ఓ కొత్త పని ప్రారంభిస్తున్నప్పుడు మొదటి రోజు ఎవరికైనా కాస్త టెన్షన్, ఇంకాస్త ఆనందం ఉంటుంది. రకుల్ కు కూడా దాదాపు అలాంటి ఫీలింగే కలిగింది. నటిగా మొట్టమొదటిసారి కెమెరా ఫేస్ చేసిన తొలి రోజు అనుభవాన్ని గుర్తుచేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
“ఢిల్లీలో డిగ్రీ చదువుతున్నాను. కన్నడ మూవీ ఆఫర్ వచ్చింది. సౌత్ లో ఓ ఇండస్ట్రీ కూడా ఉందని అప్పటివరకు నాకు తెలియదు. షూటింగ్ కు ఒక్క రోజు ముందు మాత్రమే వెళ్లాను. ఎలాంటి రిహార్సల్స్ లేవు. హీరో బైక్ పై ఉన్నారు. నేను వెనక నుంచి నడుస్తుంటాను. అతడు నా వైపు సీరియస్ గా చూసి నన్ను ఫాలో అవ్వొద్దు అంటాడు. నేను మళ్లీ వెనక్కి వచ్చేయాలి. ఆ సీన్ నా ఫస్ట్ షాట్. బాగా చేశానని అంతా మెచ్చుకున్నారు. అప్పుడు నా వయసు 18.”
ఇలా హీరోయిన్ గా తన తొలి రోజు అనుభవాన్ని బయటపెట్టింది రకుల్. అంతేకాదు.. టాలీవుడ్ వల్ల బాలీవుడ్ అవకాశాలు ఎలా మిస్సయ్యాయో కూడా చెప్పుకొచ్చింది.
“తెలుగు కంటే ముందు నాకు హిందీ సినిమా ఆఫర్ వచ్చింది. ఫస్ట్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా యారియాన్. కానీ అది బాగా ఆలస్యమైంది. దానికంటే ముందు తెలుగులో ఫస్ట్ రిలీజ్ పడింది. దీంతో టాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు వచ్చాయి. వాటిని ఒప్పుకున్నాను. అలా టాలీవుడ్ కు ఫిక్స్ అయిపోయాను.”
ముందుగా హిందీ సినిమానే రిలీజ్ అయి ఉంటే, తనకు బాలీవుడ్ నుంచి మరిన్ని అవకాశాలు వచ్చి ఉండేవని పరోక్షంగా అభిప్రాయపడింది రకుల్. అయితే టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు రావడంతో పాటు.. తెలుగు ప్రేక్షకుల ప్రేమ ముందు తను ఇంకేం ఆలోచించలేకపోయానని చెప్పుకొచ్చింది.