తెరపై ఒకలా మాట్లాడ్డం, తెరవెనక రాజకీయాలు చేయడం బాబుకు బట్టర్ తో పెట్టిన విద్య. తాజాగా నంధ్యాల ఆత్మహత్యల ఘటనలో కూడా బాబు ఇలానే రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాబు బండారాన్ని బయటపెట్టారు మంత్రి బొత్స సత్యనారాయణ.
ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులతో దర్యాప్తు జరిపి, అరెస్టులు చేస్తే.. కఠిన శిక్ష పడేలా పలు సెక్షన్లు కూడా బనాయిస్తే.. చంద్రబాబు తన మనుషులతో వాళ్లకు బెయిల్ ఇప్పించిన విషయాన్ని బొత్స బయటపెట్టారు.
“బాబు హయాంలో కాపు కార్పొరేషన్ లో డైరక్టర్ గా ఉన్నారు రామచంద్రరావు. ఆయన తెలుగుదేశం పార్టీలో జిల్లా సెక్రటరీ స్థాయిలో ఉన్నారు. ఆయన ఓ లాయర్. ఆయన ద్వారా బెయిల్ ఇప్పించారు. కుటుంబంలో నలుగురు చనిపోతే, ఆ కేసుకు సంబంధించి రామచంద్రరావుతో బెయిల్ ఇప్పించారు చంద్రబాబు. అడిగితే అది ఆయన వృత్తి అంటారా? సిగ్గులేదా ఆ మాట అనడానికి. పాత పరిచయాలతో బెయిల్ ఇప్పించింది టీడీపీ.”
ఇలా నిందితుల తరఫున వాదించిన లాయర్ కు, టీడీపీకి ఉన్న సంబంధాన్ని బయటపెట్టారు మంత్రి. ఈ మేరకు కొన్ని పత్రాల్ని కూడా మీడియా ముందుంచారు. కొన్ని వ్యవస్థల్లో చంద్రబాబుకు బాగా పరిచయాలున్నాయని, ఆయన లాలూచీ రాజకీయాల గురించి అందరికీ తెలుసని విమర్శించారు బొత్స.
“ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేద్దామంటే దానిపై స్టే తెస్తారు. అవినీతిని అరికడదామని ఎంక్వయిరీ వేస్తే దానిపై స్టే తీసుకొస్తారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామంటే స్టే తెస్తారు. అసలు చంద్రబాబు ఏం చేస్తున్నారో ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మా పార్టీ అధ్యక్షుడిపై, మా పార్టీపై ఉన్న కక్షను ప్రజలపై ఎందుకు చూపిస్తారు.”
ఓవైపు తెరవెనక రాజకీయాలు చేసి నిందితులకు బెయిల్ ఇప్పించి, మరోవైపు కొవ్వొత్తులతో ధర్నా చేయాలని చంద్రబాబు పిలుపునివ్వడం అతడి నీచ రాజకీయాలకు ఉదాహరణ అంటున్నారు బొత్స. ఆ ధర్నాలు చంద్రబాబు ఇంటి ముందు, అచ్చెన్నాయుడు ఇంటి ముందు చేయాలని అన్నారు.