స్కంద సినిమా విడుదలయింది. రెండు రాష్ట్రాల సీఎం లు..రెడ్డి.. నాయుడు. ఎందుకో దర్శకుడు బోయపాటికి ధైర్యం చాల లేదు ఇటు రావు.. అటు రెడ్డి అని కానీ, అటు నాయుడు.. ఇటు రావు అని కానీ పెట్టడానికి. మధ్యే మార్గంగా వెళ్లారు.
పనిలో పనిగా తనలో ఒరిజినల్ అలాగే వుంది కదా. అందువల్ల చిన్న చిన్న సెటైర్లు వేస్తూనే వచ్చారు ఆంధ్ర ప్రభుత్వం మీద. మొత్తానికి సినిమాకు కీలకమైన పాయింట్ మాత్రం ఓ రాజుగారిని వేధించిన ఇద్దరు సీఎం లు వేధించడం. గమ్మత్తేమిటంటే మనీ లాండరింగ్ చేయలేదని వేధించడం.
ఇంతకీ ఈ రాజు సత్యం రామలింగ రాజేనా? సాఫ్ట్ వేర్ కంపెనీతో ప్రపంచంలోనే పేరు సంపాదించింది ఆయనే. కంపెనీ నిధుల లావాదేవీల్లో జైలు పాలయింది ఆయనే. ఈ మధ్య ఇంకో రాజు కూడా పాపులర్ అయ్యారు. ఎంపీ రఘురామరాజు. ఆయన కూడా ఆంధ్ర సీఎం జగన్ తో లొల్లి పెట్టుకుని జైలు పాలయ్యారు. ఇద్దరు రాజులు భీమవరం ఏరియాకు చెందిన వారే.
సినిమా ప్రారంభంలో డిక్లయిమర్ కార్డ్ వేసినా, జనాలు కనెక్ట్ కాకుండా వుండరని బోయపాటికీ తెలుసు. జైల్లో పెట్డడం, వీడియో కాల్లో చూడడం, కడప రిఫరెన్స్, ఇంకా చాలా చాలా చిన్న చిన్న విషయాలు వుండనే వున్నాయి. మొత్తం మీద బోయపాటి ఎప్పుడు తీసినా లైవ్ క్యారెక్టర్లు, వర్తమానం రాజకీయాల మీద చిన్న చిన్న రిఫరెన్స్ లు, సెటైర్లు వుంటాయి. ఈసారి కూడా వాటిని మిస్ కాలేదు.