తెలుగు హీరోల్లో అందగాడు అనిపించుకున్న హీరో మహేష్ బాబు. కానీ ఇప్పటి వరకు పౌరాణిక పాత్రలు పోషించలేదు. ఎప్పుడో ఫ్యూచర్ లో ఏ రాజమౌళి లేదా త్రివిక్రమ్ నో భారీగా రామాయణం లేదా భారతం తీస్తే మహేష్ ను రాముడిగానో, కృష్ణుడిగానో, అర్జునుడిగానో చూడొచ్చేమో.. కానీ ప్రస్తుతానికి ఆ అవకాశం అయితే కనిపించడం లేదు.
కానీ మరో ఐడియా మాత్రం టాలీవుడ్ లో వినిపిస్తోంది. హనుమాన్ తరువాత పార్ట్ జై హనుమాన్ త్వరలో సెట్ మీదకు వెళ్తుంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ను ఎప్పుడో రెడీ చేసి వుంచారు. ఈ సినిమాలో రాముడి పాత్ర నిడివి మరీ పెద్దదేమీ కాదు. జస్ట్ ఒకటి రెండు సీన్లలో కనిపిస్తుందో లేదా, మరి కాస్త వుంటుందో.. అంతకు మించి అయితే కాదు.
ఈ సినిమాలో రాముడి పాత్రకు మహేష్ ను తీసుకుంటే ఎలా వుంటుంది? మహేష్ దానికి ఒప్పుకుంటారా? పైగా రాజమౌళి సినిమా చేస్తుండగా మరో సినిమాకు ఊ అంటారా? నిడివి తక్కవ, స్పెషల్ క్యారెక్టర్ కనుక ఊ అన్నా అనొచ్చు.
జై హనుమాన్ భారీగా రూపొందే సినిమా. పాన్ ఇండియా సినిమా. హనుమాన్ గా ఏ భాష స్టార్ ను తీసుకున్నా, క్రేజీ స్టార్ నే తీసుకునే ఆలోచన చేస్తున్నారు. రానా లాంటి హల్క్ పర్సనాలిటీని తీసుకుంటారు. అప్పుడు మాంచి క్రేజీ ప్రాజెక్ట్ గా మారుతుంది.