మాకు సోలో రిలీజ్ ఇస్తామన్నారు అని ఈగిల్ సినిమా నిర్మాతలు పంతం పడుతున్నారు. దాంతో అక్కడ ప్లేస్ చేసి వున్న భైరవ కోన సినిమాను వెనక్కు పంపిస్తున్నారు. కానీ నిజానికి రెండు రాష్ట్రాల్లో వున్న అన్ని స్క్రీన్ లు ఈగిల్ సినిమాను వేయగలరా? ఏం చేసుకుంటారు? అన్ని స్క్రీన్ లు అంటే సమాధానం వుండదు. అంటే కేవలం పోటీ లేకుండా సోలోగా విడుదల చేసుకుని సక్సెస్ కావాలనుకుంటున్నారేమో?
కానీ ఇక్కడ తెలియాల్సింది ఏమిటంటే విడుదలవుతున్న మూడు సినిమాల్లో ఈగిల్ నే పెద్ద సినిమా. యాత్ర 2, భైరవ కోన మీడియం సినిమాలు. అందువల్ల పెద్దగా స్క్రీన్ లు అవసరం పడవు. పైగా పెద్ద సినిమా, మీడియం సినిమా అనేది తొలిరోజు, ఓపెనింగ్ వరకే. మర్నాటి నుంచి ఏ సినిమా బాగుంటే ఆ సినిమానే ఆడుతుంది.
మరే సినిమా పోటీ లేకపోతే వారం రోజుల పాటు తమ సినిమానే చూస్తారని ఈగిల్ మేకర్లు ఆలోచిస్తున్నట్లు వుంది. నిజానికి కొంత వరకు వాస్తవమే. కానీ మరీ సినిమా బాగా లేకుంటే, సోలో అయినంత మాత్రాన చూడరు. పైగా థియేటర్లు చాలా వరకు ఖాళీగా వుంటాయి. వాటిల్లో ఏవో ఒక సెకెండ్ రిలీజ్ లు వచ్చి పడతాయి. అది కూడా ఇబ్బందే.
కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సినిమా నిర్మాతల కన్నా, హీరో రవితేజ సోలో విడుదలకు పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. హీరో పట్టుపట్టడంతో నిర్మాతలు ఏమీ మాట్లాడక, అదే మాట మీద వుండిపోయారు. అందుకే ఇండస్ట్రీ పెద్దలు భైరవకోన సినిమాను వెనక్కు పంపే పనిలో పడ్డారు.