జనసేనకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి గట్టి షాక్ ఇచ్చారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. టీడీపీ, జనసేన మధ్య సీట్లు, నియోజకవర్గాల కేటాయింపు డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో చివరి వరకూ ఈ తతంగాన్ని కొనసాగించి తడి గుడ్డతో బాబు గొంతు కోస్తాడనే అనుమానం, భయం జనసేన నేతలను వెంటాడుతున్నాయి.
జనసేన భయమే నిజమయ్యేలా కనిపిస్తోంది. జనసేనకు కేటాయించే సీట్లలో తిరుపతి తప్పనిసరిగా వుంటుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. 2009లో ప్రజారాజ్యం అధినేత, మెగాస్టార్ చిరంజీవి పరువు కాపాడింది తిరుపతే. ఈ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో వుంది. జనసేనను తమ పార్టీగా ఆ సామాజిక వర్గం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో తిరుపతి సీటు తమదే అని లెక్కలేసుకుని, జనసేనకు చెందిన నేతలు అప్పుడే ఎమ్మెల్యేలు అయిపోయామనే ఊహా లోకంలో విహరిస్తున్నారు. అయితే తిరుపతి సీటును జనసేనకు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా లేనట్టు సమాచారం. ఇందుకు చంద్రబాబు వాయిస్‌తో తిరుపతి నియోజకవర్గ ఓటర్లకు వచ్చిన ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ఫోన్ కాల్సే నిదర్శనం.
తిరుపతి నియోజక వర్గంలో టీడీపీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం తెలియజేయాలని కోరుతూ నలుగురి పేర్లను చెప్పారు. ఆ నలుగురు జేబీ శ్రీనివాస్, ఊకా విజయ్‌కుమార్, కోడూరి బాలసుబ్రమణ్యం, వెంకట కార్తీక కావడం గమనార్హం. వీరంతా బలిజ సామాజిక వర్గానికి చెందిన వారే. వీరిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలు కార్తీక కూడా ఉన్నారు.
అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అభిప్రాయ సేకరణ పరిశీలిస్తే, జనసేనకు తిరుపతి సీటు ఇచ్చే ఉద్దేశం లేదనే చర్చకు తెరలేచింది. రాయలసీమలో అంతోఇంతో తమకు బలం ఉన్న నియోజకవర్గంగా తిరుపతి గురించి జనసేన నేతలు చెబుతుంటారు. అలాంటి సీటుకే దిక్కులేకపోతే, ఇక జనసేనకు సీమలో ఇచ్చే ఉద్దేశం ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.