కుటుంబాన్ని, పిల్లల్ని వదిలిపెట్టి, ఎండనక, వాననక పాదయాత్ర చేశానని, కానీ తనకు అన్యాయం జరిగిందని, అలాగే రాష్ట్రానికి న్యాయం జరగలేదని వైఎస్ షర్మిల కామెంట్స్‌పై వైసీపీ సీరియస్‌గా స్పందించింది. షర్మిలకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు.
సజ్జల మీడియాతో మాట్లాడుతూ అసలు తనకు ఏం అన్యాయం జరిగిందో చెప్పాలని షర్మిలను డిమాండ్ చేశారు. పలానా అన్యాయం చేశారని ఆమె చెప్పాలని ఆయన కోరారు. పదవుల పంపకంలో అన్యాయం చేశారా? అని నిలదీశారు. పదవులు ఇవ్వలేదంటే ఒక రాజకీయ పార్టీలో కుటుంబం పదవుల కోసం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. పదవులు, అధికారంలో భాగస్వామ్యాలు వుంటాయా? అసలు ఈ విషయం చర్చించడానికైనా అర్హమైనదా? అని ఆయన ప్రశ్నించారు.
ఒక రాజకీయ పార్టీ తన పని మొదలు పెట్టిన తర్వాత ఎదుగుతున్న క్రమంలో పునాదుల నుంచి ఉన్నవాళ్లు, అలాగే ఎదుగుతున్న క్రమంలో మధ్యలో చేరిన వాళ్లుంటారన్నారు. ఆ ప్రవాహం ఎంత బలంగా అప్రతిహతంగా ముందుకెళుతుందో, అది అంత బలంగా మనుగడ సాధిస్తుందని సజ్జల తెలిపారు. లేదంటే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుందన్నారు.
ఇందుకు ఉదాహరణ షర్మిల పార్టీనే అని ఆయన అన్నారు. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ అని పెట్టారన్నారు. ఆ పార్టీ కోసం షర్మిలతో పాటు చాలా మంది కష్టపడ్డారన్నారు. మరి వాళ్లందరి భవిష్యత్ కోసం ఏం ఆలోచించావని సజ్జల ప్రశ్నించారు. వాళ్లకు ఏం న్యాయం చేశావని సజ్జల నిలదీశారు. నాడు పదవి కోసం షర్మిల తిరిగారా? అని ఆయన ప్రశ్నించారు. దాని గురించి ఆమె ప్రత్యేకంగా చెప్పగలిగితే వివరణ అవసరం అవుతుందన్నారు.
షర్మిలతో పాటు లక్షలాది మంది కార్యకర్తలు పార్టీ కోసం పని చేశారన్నారు. వైఎస్సార్ ఆశయాలకు సమాధి కట్టేందుకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రయత్నించారన్నారు. తన తండ్రి ఆశయాలను సజీవంగా ఉంచేందుకే జగన్ ఎన్నో కష్టనష్టాలను ఓర్చి నిలబడ్డారని సజ్జల గుర్తు చేశారు.
ఏపీ రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదన్నారు. షర్మిల మాట్లాడిన ప్రతి దానికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు. జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ ప్రయత్నించ లేదా? జగన్ ఓదార్పు యాత్రను అణచివేయాలని కాంగ్రెస్ ప్రయత్నించలేదా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్ ఆశయాలు నెరవేరలేదని షర్మిల అనడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు లేదా ఎల్లో మీడియాధిపతి స్క్రిప్ట్‌ను షర్మిల చదువుతున్నట్టున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
జగన్ చెల్లెలు, వైఎస్సార్ బిడ్డ అనే ఏకైక అర్హతతో షర్మిలను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేశారని విమర్శించారు. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి రోజురోజుకూ ఎటాక్ చేస్తూ, పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ ఆశయాలను జగన్ నెరవేర్చలేదని షర్మిల విమర్శలు చేయడం చూస్తుంటే, ఇంతకూ ఆమె ఏ స్టేట్‌లో ఉండి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. షర్మిల ప్రసంగాల్లో డొల్లతనం కనిపిస్తోందన్నారు. ఏమి ఆశించి న్యాయం జరగలేదని ఆమె అంటున్నారో వివరించాలని కోరారు.