బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి ఆగ్రహం ప్రదర్శించారు. ఈ సారి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏకంగా ఎన్నికల సంఘానికి సూచించడం చర్చనీయాంశమైంది. గతంలో సేవారంగంలో ఎమ్మెల్సీ పదవికి కౌశిక్‌రెడ్డిని బీఆర్ఎస్ సర్కార్ ప్రతిపాదనల్ని గవర్నర్‌కు పంపింది.
అయితే ఆ రంగంలో కౌశిక్‌రెడ్డిని నామినేట్ చేయడం కుదరదని గవర్నర్ తమిళిసై ఫైల్‌ను తిప్పి పంపి బీఆర్ఎస్ సర్కార్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారమై కేసీఆర్ సర్కార్, గవర్నర్‌కు మధ్య దూరం పెంచిందనే అభిప్రాయం వుంది. కౌశిక్‌రెడ్డిపై మరోసారి గవర్నర్ కన్నెర్ర చేయడం ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లను ఎవరూ బలవంత పెట్టకూడదన్నారు. ఓటు శాతం పెరగడానికి కేవలం ప్రకటనలు మాత్రమే ఉపయోగపడవన్నారు. ఓటు అనేది అత్యంత శక్తిమంతమైన ఆయుధమని ఆమె చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యం అనేది బతకాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆమె సూచించారు.
ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఓట్లు అభ్యర్థించడం సరైంది కాదన్నారు. ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభ్యర్థి హెచ్చరించడం తననెంతో బాధించిందని ఆమె చెప్పుకొచ్చారు.
ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులకు ఆమె బహిరంగంగా సూచించడం విశేషం. దీంతో బీఆర్ఎస్, గవర్నర్ మధ్య ఇంకా వైరం కొనసాగే అవకాశం వుంది. గవర్నర్ కామెంట్స్‌పై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో!