సుపరిపాలన అందించాననే నమ్మకం, భరోసాతో మళ్లీ తాను అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు, మంచి పని చేశానని ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న మాటలను ఎల్లో మీడియా, టీడీపీ తమ ఇష్టానుసారం అన్వయించుకున్నాయి. జగన్‌లో ఓడిపోతామనే భయం కనిపిస్తోందని, చేతులెత్తేశాడనేందుకు సమ్మిట్‌లో అన్న మాటలే నిదర్శనమంటూ ఎల్లో పత్రిక రాయగా, లోకేశ్ దాన్ని షేర్ చేసి, సీఎంకు బైబై చెప్పడం యువ నాయకుడికే చెల్లింది.
సీఎం జగన్ చేతులెత్తేశారని, వైసీపీ ప్యాకప్ అవుతోందంటూ లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. 2024లో జగన్ ఇక ఉండరని.. ఈ ఏడాదికి బై బై జగన్ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. అలాగే ఎల్లో పత్రికలో జగన్ కామెంట్స్‌ను వక్రీకరిస్తూ రాసిన కథనాన్ని ఆయన షేర్ చేయడం గమనార్హం.
గత ఎన్నికల్లో మంత్రి హోదాలో లోకేశ్ మంగళగిరిలో ఓడిపోయారు. ఈ దఫా మళ్లీ అక్కడి నుంచే బరిలో దిగేందుకు ఆయన రెడీ అయ్యారు. ఈ ఎన్నికల్లో లోకేశ్‌కు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వరుసగా రెండోసారి కూడా లోకేశ్ ఓడితే టీడీపీని నడిపేంత సీన్ లేదని ఆయన నాయకత్వాన్ని ఎవరూ అంగీకరించరు. అందువల్ల మంగళగిరిలో గెలుపు కోసం ఏం చేయాలో ఆ పనిపై లోకేశ్ నిమగ్నమైతే మంచిది.
ఇప్పటికే లోకేశ్‌ను మరోసారి ఓడించేందుకు జగన్ పకడ్బందీ వ్యూహంతో ముందుకెళుతున్నారు. మంగళగిరిలో బలమైన ఓటు బ్యాంక్ కలిగిన చేనేత నాయకుడు గంజి చిరంజీవిని వైసీపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సొంత సామాజిక వర్గానికి చెందిన, సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సైతం పక్కన పెట్టడానికి జగన్ వెనుకాడడం లేదు. తనకు టికెట్ ఇవ్వలేదనే ఆవేదనతో కాంగ్రెస్‌లో ఆళ్ల చేరిన సంగతి తెలిసిందే.
మంగళగిరిలో వైసీపీని ఎదుర్కోవడంపై లోకేశ్ దృష్టి సారిస్తే మంచిది. ఇప్పటికీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటే, పైశాచిక ఆనందం పొందడానికే లోకేశ్ పరిమితం కావడం విమర్శలపాలవుతోంది. జనంలోకి వెళ్లి తాను గెలవడంతో పాటు పార్టీని అదే బాట పట్టిస్తేనే లోకేశ్‌కు భవిష్యత్. లేదంటే తన గతేంటో ఒక్కసారి లోకేశ్ ఆలోచించుకోవడం మంచిది.
జగన్‌కు బైబై అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఆనందించడం పెద్ద పనికాదు. ఎన్నికల్లో గెలవడం తన ముందున్న అతిపెద్ద సవాల్ అని లోకేశ్ గుర్తించి, ఆ దిశగా ఆలోచిస్తే మంచిదని నెటిజన్లు హితవు చెబుతున్నారు.