ముఖ్యమంత్రి, తన అన్న వైఎస్ జగన్‌తో విభేదాలను పెంచుకునేందుకే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తహతహ లాడుతున్నారు. కాంగ్రెస్ కోసం అన్నతో ఎందాకైనా పోరాడుతోందన్న పేరు తెచ్చుకుని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది షర్మిల వ్యూహమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అన్నాచెల్లెళ్ల వివాదంలోకి ఇవాళ తన తల్లి వైఎస్ విజయమ్మను షర్మిల లాగడం గమనార్హం. తన చెల్లి షర్మిలతో విభేదాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ చేస్తోందని, నాడు తన చిన్నాన్న వైఎస్ వివేకాను కేబినెట్‌లోకి తీసుకుని, విజయమ్మపై పోటీ చేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు తన సోదరి షర్మిలతో అదే రకమైన బురద రాజకీయానికి కాంగ్రెస్ తెరలేపిందని ఆయన విమర్శించారు. భగవంతుడు అన్నీ చూస్తున్నారని, కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతారని ఆయన కామెంట్స్ చేశారు.
తన అన్న కామెంట్స్‌పై షర్మిల ఇవాళ సీరియస్‌గా స్పందించారు.
‘ఇవాళ వైఎస్సార్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్నే. దీనికి సాక్ష్యం దేవుడు… దీనికి సాక్ష్యం నా తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. 18 మంది రాజీనామాలు చేసి జగన్ అన్న వైపు నిలబడితే అధికారంలో వచ్చాక మంత్రులను చేస్తా అన్నారు. వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు? వాళ్లు రాజీనామాలు చేస్తే అమ్మ, నేను వాళ్ల గెలుపు తిరిగాం. వాళ్లను గెలిపించాం. వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని, పిల్లలకు పక్కన పెట్టి ఎండనక, వాననక రోడ్ల మీదే ఉన్నా. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకని అడగకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా. గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగా. మిమ్మల్ని గెలిపించా. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్‌మోహన్ రెడ్డి వేరే మనిషిగా మారిపోయాడు’ అని ఆమె ధ్వజమెత్తారు.
జగన్‌ను ముఖ్యమంత్రి చేసిందే తానే అని షర్మిల బలంగా నమ్ముతున్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడంలోనూ, అలాగే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలోనూ తానే కీలక పాత్ర పోషించానని షర్మిల పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబును గద్దె దించడంలో వైఎస్ జగన్ పాత్ర ఏదీ లేదని షర్మిల నమ్ముతున్నారు. తాను అధికారంలోకి తీసుకొచ్చిన జగన్, కనీసం తన ప్రయోజనాలను పట్టించుకోకపోవడం ఏంటనే బాధ, ఆవేదన ఎట్టకేలకు బయట పెట్టారు.
చివరికి అన్నతో విభేదాల వివాదంలోకి తల్లి విజయమ్మను సాక్ష్యంగా షర్మిల ప్రవేశ పెట్టడం గమనార్హం. వివాదంలోకి తల్లిని ఎలా లాగాలని ఆలోచిస్తున్న షర్మిలకు, జగనే ఆ అవకాశం కల్పించినట్టైంది. దీంతో షర్మిల దొరికిందే చాన్స్ అనుకుని గబగబా తల్లి విజయమ్మను వివాద తెరపైకి తీసుకొచ్చారు. ఇంకా రానున్న రోజుల్లో ఎన్నెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో!