మహేష్ బాబు సినిమాలో రమ్యకృష్ణ

కొన్ని కాంబినేషన్లు తెరపై చూడ్డానికి భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇదీ అలాంటిదే. మహేష్ బాబు సినిమాలో రమ్యకృష్ణ నటించబోతోంది. వీళ్లిద్దరూ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలామందికి ఉంది. త్రివిక్రమ్ సినిమాతో అది నెరవేరబోతోంది.…

కొన్ని కాంబినేషన్లు తెరపై చూడ్డానికి భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇదీ అలాంటిదే. మహేష్ బాబు సినిమాలో రమ్యకృష్ణ నటించబోతోంది. వీళ్లిద్దరూ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలామందికి ఉంది. త్రివిక్రమ్ సినిమాతో అది నెరవేరబోతోంది.

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న కొత్త సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారు. నిజానికి ఈ కథను చాన్నాళ్ల కిందటే రమ్యకృష్ణకు వినిపించాడు త్రివిక్రమ్. అయితే అప్పట్లో ఆమె అంతగా ఆసక్తి చూపించలేదు. తాజాగా ఒప్పుకుంది.

తన ప్రతి సినిమాలో ఓ సీనియర్ నటిని ప్రొజెక్ట్ చేయడం త్రివిక్రమ్ కు అలవాటే. ఇతడు తీసిన అత్తారింటికి దారేది సినిమాతో నదియా కెరీర్ పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది. ఇక అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో టబు.. మెరిశారు. ఇదే కోవలో మహేష్ బాబు సినిమాలో రమ్యకృష్ణ కోసం ఓ బలమైన పాత్రను రాసుకున్నాడు త్రివిక్రమ్.

ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ బంగ్లా సెట్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా సెట్ రెడీ అయింది. సోమవారం నుంచి ఆ ఇంటి సెట్ లోనే షూటింగ్. మేజర్ పార్ట్ షూట్ మొత్తం ఇందులోనే.

సినిమాలో మహేష్ సరసన పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో మహేష్ బాబుకు రమ్యకృష్ణ ఏమౌతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.