రష్మికా మందన్న…కన్నడ భామ. కిరాక్ పార్టీ సినిమాతో పాపులర్ అయిన రష్మిక ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ఛలో సినిమాతో ఛలోమంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారామె. వరుస విజయాలతో తెలుగు సమాజానికి చాలా దగ్గరయ్యారామె. మన తెలుగు పిల్లే అనేంతగా టాలీవుడ్లో కలిసిపోయిన రష్మిక ఆదివారం తన 24వ పుట్టిన రోజు జరుపుకున్నారు.
కనీసం పుట్టిన రోజు అని కూడా ఆలోచించకుండా రష్మిక కంట కన్నీళ్లు తెప్పించాడో బడుద్దాయ్. అసలు పుట్టిన రోజే లేకపోతే బహుశా ఆమె ఏడ్చే అవకాశం ఉండేది కాదేమో. బాధ కలిగినా, ఆనందం వచ్చినా కన్నీళ్లే వస్తాయంటారు. ఇంతకూ రష్మిక కన్నీళ్లకు కారణమేంటో తెలుసుకుందాం.
రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేశారు. రష్మికకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు, కామెంట్స్ గురించి చెప్పనవసరం లేదు. రష్మికపై భక్తి పెరిగిన ఓ అభిమాని ఏకంగా ఆమె పేరుపై దేవుడికి పాలాభిషేకం చేయించాడు. ఆ వీడియోను చూసిన రష్మిక ఆనందంతో పొంగిపోయారు. అయితే “ఇంత ప్రేమ పొందడానికి నేనేం చేశాను” అని రష్మిక ట్వీట్ చేశారు.
అలాగే మరో వ్యక్తి వినూత్నంగా గిఫ్ట్ ఇచ్చాడు. రష్మిక ఇప్పటివరకు నటించిన సినిమాల్లోని సీన్లను కలిపి `రష్మిక ఇన్స్పిరేషనల్ జర్నీ` పేరుతో వీడియో రూపొందించి పంపాడు. ఈ వీడియో చూసి రష్మిక భావోద్వేగానికి గురైంది. ఆమె నోట మాట రాలేదు. “నువ్వు నన్ను భావోద్వేగానికి గురి చేశావు. నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చాలా ధన్యవాదాలు” అని తన కృతజ్ఞతను చాటుకున్నారామె. ఇదన్న మాట రష్మిక కంట కన్నీరు పెట్టించిన కథాకమామీషు.