ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 4వేలు దాటింది. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయానికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4067గా ప్రకటించింది. వీళ్లలో 109 మంది మరణించారని, 291 మంది డిశ్చార్జ్ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు కరోనాకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాల్ని కూడా వెల్లడించింది ప్రభుత్వం. కరోనా మృతుల్లో ఎక్కువమంది పురుషులే ఉన్నట్టు నిర్థారించింది. ఇప్పటివరకు మరణించిన వారిలో 73 శాతం మంది పురుషులు కాగా.. 27 శాతం మంది స్త్రీలు ఉన్నట్టు తెలిపింది. అటు వయసు రీత్యా కూడా విశ్లేషణలు వెల్లడించింది. 60 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో 63 శాతం మరణాలు చోటుచేసుకుంటున్నాయని, మృతుల్లో 40-60 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు 30శాతం ఉన్నారని తెలిపింది.
మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. 40 ఏళ్ల లోపు వయసున్న వ్యక్తుల్లోనే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని, మరణాలు మాత్రం 60 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లోనే ఎక్కువగా ఉంటున్నాయని తెలిపింది. అంటే.. శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవాళ్లు కరోనా నుంచి బయటపడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు చనిపోయిన వ్యక్తుల్లో 86 శాతం మంది కరోనాతో చనిపోయినప్పటికీ వాళ్లు ఆల్రెడీ షుగర్, బీపీ, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలతో కూడా బాధపడుతున్నారని.. ఇలాంటి వాళ్లు కరోనా బారిన పడితే ముప్పు ఎక్కువగా ఉంటోందని విశ్లేషణలో తేలింది.
మరోవైపు కరోనా పరీక్షలను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం 5 లక్షల కరోనా కిట్స్ కోసం ఆర్డర్ ఇచ్చింది. వీటిలో వీటిలో రెండున్నర లక్షల కిట్లు మరో 3 రోజుల్లో అందుతాయి. అప్పుడు కరోనా నిర్థారణ పరీక్షలు మరింత వేగవంతంగా చేసేందుకు వీలుంటుంది. రిజల్ట్ కోసం వేచిచూసే సమయం బాగా తగ్గుతుంది.
ఇక కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల వేతనాల్లో 30శాతం కోత విధించింది. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి.