లాక్ డౌన్ తో తనకు, తన ఇంట్లోని వాళ్లకు పని లేకుండా పోయినా, ఇన్ కమ్ తగ్గిపోయినా తమ స్టాఫ్ కు మాత్రం తాము అండగా నిలుస్తున్నట్టుగా చెప్పుకుంది నటి రష్మిక. ఈ ఏడాది తనకు బ్రహ్మాండంగా ఆరంభం అయినా.. అనూహ్యంగా కరోనా-లాక్ డౌన్ లతో పని లేకుండా పోయిందని చెబుతోంది ఈ హీరోయిన్. ప్రస్తుతం అంతా ఆన్ లైన్ లోనే సాగుతోందని, తనకు కథలు వివరించాలనుకుంటున్న వాళ్లు కూడా ఆన్ లైన్ ద్వారా సంప్రదిస్తున్నారని రష్మిక వివరించింది.
ఇక తన స్టాఫ్ తో పాటు.. తన తండ్రి చేసే వ్యాపారంలో భాగంగా 20 మంది తమ వద్ద పని చేస్తున్నట్టుగా రష్మిక చెప్పింది. ప్రస్తుతం తనకూ ఆదాయం లేదని, తన తండ్రి చేస్తున్న వ్యాపారానికి సంబంధించి కూడా ఇన్కమ్ లేదని రష్మిక చెబుతోంది. ఇలా ఆదాయం లేదు కాబట్టి.. తమ స్టాఫ్ ను గాలికి వదలడం లేదని రష్మిక చెబుతోంది. వారందరికీ తాము జీతాలు చెల్లిస్తున్నట్టుగా వివరించింది. పని లేదని చెప్పి వారిని వదిలించుకోవడం లేదని, తమ వంతుగా జీతం ఇస్తూ సాయంగా నిలుస్తున్నట్టుగా రష్మిక చెబుతోంది.
లాక్ డౌన్ కు ముందు.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ఫ' సినిమా విషయంలో తన కసరత్తు సాగుతూ ఉండేదని రష్మిక చెప్పింది.చిత్తూరు యాసలో తెలుగు మాట్లాడటం నేర్చుకుంటున్న సమయంలో అవాంతరం ఏర్పడిందని వివరించింది. తనకు పని చేసుకోవడం అంటే ఇష్టమని, లాక్ డౌన్ తో పనికి బ్రేక్ రావడం పట్ల ఒకింత నిరాశ వ్యక్తం చేస్తోంది రష్మిక.