తను వేరే వాళ్ల కోసం బయట నుంచి సహకరించిన చిన్న సినిమాను పక్కన పెడితే ఫెయిల్యూర్ అన్నది లేదు దర్శకుడు అనిల్ రావిపూడికి. రెండేళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు అంటూ మహేష్ తో మాంచి భారీ సినిమా అందిస్తే కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది కానీ, అల వైకుంఠపురం నీడలో పడిపోయి రావాల్సినంత పేరు రాలేదు. కానీ మహేష్ దగ్గర మాత్రం మంచి రికగ్నైజేషన్ దక్కింది. అందుకే మళ్లీ అనిల్ తో సినిమాకు రెడీ అంటున్నారు మహేష్ అని వార్తలు వున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో రావిపూడి డైరక్షన్ లో ఎఫ్ 3 సినిమా వస్తోంది. ఈ సినిమా ను హిట్ చేయడానికి అటు సినిమాలోనూ, ఇటు బయటా కూడా ఎన్ని అస్త్రాలు వాడాలో అన్నీ వాడేసారు. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు, వాళ్ల అందచందాలు, పూజా హెగ్డే ఐటమ్ సాంగ్, వెంకీ, వరుణ్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ, ఇలా పక్కా కమర్షియల్ ప్యాకింగ్ తో వెళ్లారు.
ఇక బయట ప్రచారం అయితే ఇటీవల ఏ పెద్ద సినిమాకు కూడా ఈ రేంజ్ ప్రచారం జరగలేదు. అది వాస్తవం. ఓ డైరక్టర్ గా కన్నా, ఆ సినిమాకు తానే నిర్మాత, హీరో, అన్నీ తానే అన్నంతగా అనిల్ రావిపూడి కష్టపడ్డారు. సినిమా మేకింగ్ కు ఏ మేరకు కష్టపడ్డారో లేదో తెలియదు కానీ ప్రచారానికి మాత్రం ఇంత కష్టం మరే డైరక్టర్ ఇటీవల కాలంలో పడలేదు.
ఇప్పుడు అసలు సమస్య ముందు వుంచి, చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు జనం అంత త్వరగా ముందుకు రావడం లేదు. ఓపెనింగ్ విషయంలో సర్కారు వారి పాట, ఆచార్య లాంటి పెద్ద సినిమాలే తడబడ్డాయి. అందువల్ల ఎఫ్ 3 ఓపెనింగ్స్ ఓ మాదిరిగా వుండడాన్ని పట్టించుకోనక్కరలేదు. కానీ ఇక్కడ సమస్య అది కాదు.
యునానిమస్ హిట్ టాక్ లేదా బాగుంది అనే టాక్ ను తెచ్చుకోవాలి. అప్పుడే జనాలు మెలమెల్లగా బయటకు వస్తున్నారు. ఫరవాలేదు, యావరేజ్ లాంటి టాక్ కానీ, డివైడ్ టాక్ కానీ తెచ్చుకంటే పరిస్థితి బాగుండడం లేదు.
ఆచార్య, సర్కారు వారి పాట సినిమాల అనుభవం ఈ విషయం చెబుతోంది. అందువల్ల ఎఫ్ త్రీ సినిమా లాజిక్ లు, సమీక్షలు పక్కన పెడితే యూనిట్ చెబతున్న నవ్వుల ఫన్ రైడ్ అన్న టాక్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే సినిమా రేంజ్ ఓ లెవెల్ లో వుంటుంది. అలా కాకుండా డివైడ్ టాక్ తెచ్చుకుంటే సరిపోదు.
ఎందుకంటే జనం ఓటిటిలో 20 రోజుల్లో సినిమా వచ్చేస్తుంది అనే దానికి బాగా అలవాటు పడిపోతున్నారు. ఓటిటి వరకు వెయిట్ చేయకుండా థియేటర్ కు రావాలి అంటే టాక్ చాలా అంటే చాలా అవసరం.
టాక్ వచ్చి, సినిమా హిట్ అయితే అనిల్ రావిపూడిని ఇక ఎవ్వరూ ఆపలేరు.