కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని జనసేనాని పవన్‌కల్యాణ్ పరోక్షంగా తప్పు పట్టారు. ఒకవైపు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎంతో గౌరవమని కబుర్లు చెబుతూ, మరో వైపు ప్రభుత్వం కోనసీమ జిల్లాకే ఎందుకు పేరు పెట్టాలి? కడపకు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించడం పవన్‌కల్యాణ్‌కే చెల్లింది. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌పై మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విరుచుకుపడ్డారు.
కృష్ణా జిల్లా గుడివాడ మండలం లింగవరంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌కు రాజకీయ అవగాహన లేదన్నారు. నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చగొట్టి పవన్‌కల్యాణ్ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ, రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ అవగాహనతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని పవన్‌ను నిలదీశారు. అంబేద్కర్‌ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.
చీకటి ఒప్పందాలు చేసుకున్న నాయకుల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఫైర్ ఓపెన్ చేయించి కాల్పులు జరిపితే పరిస్థితి అదుపులోనే ఉండేదన్నారు. ఆ తర్వాత చంద్రబాబు అసలు పుత్రుడు, దత్త పుత్రుడు పాడెలు మోస్తూ శవ రాజకీయాలు చేసేవారని విరుచుకుపడ్డారు.
ఇదిలా వుండగా సన్యాసి, సన్నాసికి మరోసారి అర్థాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సన్యాసి అంటే లోకాన్ని విడిచిపెట్టిన వాడని అర్థం. సన్నాసి అంటే లోకం విడిచిపెట్టిన వాడని అర్థం. కొడాలి నాని విమర్శ ప్రకారం లోకం పట్టించుకోకుండా వదిలి పెట్టిన నాయకుడు పవన్‌కల్యాణ్ అని అర్థం చేసుకోవాలి.