టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత సామాజిక వర్గ నాయకత్వ సత్తాపై చేసిన వ్యాఖ్యలు బెడిసి కొడుతున్నాయి. సొంత పార్టీ నాయకుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని పార్టీలు రెడ్లకే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని రేవంత్‌రెడ్డి సూచించడం, మిగిలిన సామాజిక వర్గాల్లో వ్యతిరేకతకు కారణమైంది. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గురువారం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రేవంత్ వ్యాఖ్యలపై బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం. ఆ లేఖలో ప్రధాన అంశాలేంటో చూద్దాం.
“కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ మీరు రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మూల విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలు, వర్గాలు, మతాల కలయిక.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూలానే యూపీఏ ఏర్పడింది.. ఆయన మరణం తరువాత యూపీఏ ప్రభుత్వం ఏర్పడలేదు అనడం సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కించపర్చడమూ, అవమానించడమే. బహుశా మీరు అప్పుడు పార్టీలో లేకపోవడం వల్ల ఈ చారిత్రక విషయాలను తెలియజేస్తున్నాను.
వరంగల్ డిక్లరేషన్, రాహుల్ గాంధీ సభతో ఉత్తేజితులై, ఊసరవెల్లి కేసీఆర్ మోసాలను గ్రహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ వైపు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మీరంతా ‘మా రెడ్లకిందనే పని చేయాలి.. రెడ్లకు మాత్రమే రాజ్యాధికారం, మాకు మాత్రమే సత్తా ఉంది’ అంటూ చేసి వ్యాఖ్యలు అత్యంత ఆక్షేపణీయంగా ఉన్నాయి. మీ వ్యాఖ్యలపై ఈ వర్గాల్లో అలజడి మొదలైంది.. అట్టుడికిపోతున్నాయి.. తిరగబడ్తున్నాయి.
ఒక్క రెడ్డి సామాజిక వర్గంతోనే ప్రభుత్వం ఏర్పడేదంటే.. సుమారు ఏడు సంవత్సరాలు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేతగా జానారెడ్డి, కొత్తగా పార్టీలో చేరినా మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినా 2018లో పార్టీ ఓటమి పాలైంది. అంతేకాక డీకే అరుణ రెడ్డి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మీరు కూడా స్వయంగా ఓటమి పాలయ్యారు.
అంతేకాక ఉత్తమ్ పద్మావతి రెడ్డి 2018లో కోదాడ లోనూ, తరువాత జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ, సీనియర్ అయిన కె జానారెడ్డి 2018 ఎన్నికల్లోనూ, తరువాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీసీ యువకుడి చేతిలో ఓటమి పాలయ్యారు. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే.. 1999లోనూ ఇదే జరిగింది. సీఎల్పీ నేతగా పి. జనార్ధన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళినా ఓటమి పాలైన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా.
మీరు మాట్లాడిన భాష, యాస అటు అన్ని వర్గాలను సోనియాగాంధీ, రాహుల్ గాధీ నాయకత్వాన్ని ప్రశ్నించేలా అవమాన పర్చేలా కించపర్చేలా ఉంది. బడుగుల, బలహీన వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా పీసీసీ అధ్యక్ష హోదాలో మాట్లాడడం తగదు. మీరు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోంది. దీనిని నివారించడానికి మీరు వెంటనే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇవ్వడంతో పాటు, అధినాయకత్వానికి విధేయత ప్రకటించాలి.
పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల్లో ఏర్పడ ఆందోళనను గందరగోళాన్ని నివృత్తి చేయాలని అడుగుతున్నా” అని మధుయాష్కీ రాసుకొచ్చారు. రేవంత్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.