హనుమాన్ సినిమా ఫ్రాంచైజీలో చాలా సినిమాలొస్తాయని ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇందులో భాగంగా జై హనుమాన్ ప్రాజెక్టును ఆల్రెడీ ఎనౌన్స్ చేశాడు. ప్రీ-ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈ యూనివర్స్ లో మరో సినిమా కూడా దాదాపు ప్రకటించాడు.
“మాకు చిన్న ఐడియా వచ్చింది. రవితేజ పోషించిన క్యారెక్టర్ ను మా సినిమాటిక్ యూనివర్స్ లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఐడియా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా ఇది. రవితేజ ఒప్పుకుంటే, కోటి అనే క్యారెక్టర్ తో ఓ సినిమా చేసేంత ఐడియా ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే హను-మాన్ యూనివర్స్ లో రవితేజతో ఓ సినిమా చేస్తాం.”
ఇలా హను-మాన్ ఫ్రాంచైజీలోకి రవితేజను కూడా తీసుకొచ్చే ఆలోచనను బయటపెట్టాడు ప్రశాంత్ వర్మ. తన సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన రవితేజకు థ్యాంక్స్ చెప్పాడు.
“నా సినిమాలో వాయిస్ ఓవర్ ఇవ్వాలని రవితేజను మూడేళ్ల కిందట అడిగాను. ఆయన అప్పుడు నాకు మాటిచ్చారు. హనుమాన్ వర్క్ పూర్తిచేసిన తర్వాత చూస్తే, రవితేజ సినిమా కూడా మా మూవీతో పాటు రెడీ అయింది. దీంతో అడగాలా వద్దా అని డౌట్ పడ్డాను. ఓసారి అడిగి చూశాను. ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పారు. రవితేజ లాంటి జెన్యూన్ వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం.”
మొదటి సినిమాలో ఉన్న చాలామంది నటీనటులు హనుమాన్ యూనివర్స్ లో కొనసాగుతారని ప్రశాంత్ వర్మ స్పష్టం చేశాడు.