గతేడాది ఓ సందర్భం. తమ సినిమాలు చెప్పిన తేదీకే వస్తాయంటూ మేకర్స్ ఒకటికి రెండు సార్లు ప్రకటించుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలోనే అలాంటి సందర్భం వచ్చింది. బడా సినిమా మేకర్స్ అంతా మరోసారి తమ సినిమా విడుదల తేదీలపై క్లారిటీలు ఇచ్చుకోవాల్సి వచ్చింది.
పుష్ప-2 సినిమాను ఆగస్ట్ 15కు షెడ్యూల్ చేశారు. ఇది చాలా పాత విషయం. అయితే ఈ సినిమా అనుకున్న తేదీకి రాదంటూ ప్రచారం మొదలైంది. దీంతో యూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చెప్పిన తేదీకే వస్తామంటూ ప్రకటించుకుంది.
ఆ వెంటనే కల్కి యూనిట్ నుంచి కూడా ప్రకటన వచ్చింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను మే 9న విడుదల చేయబోతున్నారు. ఆ తేదీ నుంచి సినిమా డ్రాప్ అయిందనే ప్రచారం మొదలైంది. వెంటనే యూనిట్ స్పందించింది. అలాంటిదేం లేదని తెలిపింది.
ఇలా పెద్ద సినిమాలపై ఒక్కసారిగా ఊహాగానాలు చెలరేగడానికి కారణం దేవర-1. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా లెక్కప్రకారం ఏప్రిల్ 5కు రావాలి. కానీ ప్రొడక్షన్ లో జాప్యం వల్ల ఆ తేదీకి సినిమా రావడం లేదు.
అలా దేవర సినిమా విడుదల పోస్ట్ పోన్ అవ్వడంతో, మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ లో కూడా మార్పు ఉండొచ్చంటూ పుష్ప-2, కల్కి సినిమాలపై గాసిప్స్ ఊపందుకున్నాయి. దీంతో అంతా మరోసారి తమ సినిమాల రిలీజ్ డేట్స్ పై ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు.