రవితేజకు హిట్స్, ఫ్లాప్స్ కొత్త కాదు. ఒక హిట్ ఇస్తే, ఆ వెంటనే 3-4 ఫ్లాపులు ఇవ్వడం కామన్. అయితే ఇలా ఎన్ని ఫ్లాపులొచ్చిన రవితేజ డీలా పడలేదు. మరో హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ విషయం వేరు. నిర్మాతగా ఆయన కెరీర్ ఎలా ఉండబోతోందనేది మేటర్ ఇక్కడ.
రవితేజ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తన సినిమాలకు కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో పాటు, మరికొన్ని చిన్న సినిమాలకు సోలో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆ మధ్య విష్ణువిశాల్ తో కలిసి మట్టి కుస్తీ అనే సినిమా నిర్మించాడు. సినిమా బాగుందని అంతా అనుకునేలోపే దుకాణం సర్దేసింది.
ఇప్పుడు నిర్మాతగా మరో సినిమా రెడీ చేశాడు రవితేజ. ఈ సినిమా పేరు ఛాంగురే బంగారురాజా. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా నిర్మాత రవితేజ కు హిట్ ఇస్తుందా ఇవ్వదా అనేది డిస్కషన్ పాయింట్ గా మారింది.
హీరోగా ఎన్ని ఫ్లాపులొచ్చినా నిలదొక్కుకున్నాడు రవితేజ. అయితే నిర్మాతగా అన్ని ఫ్లాపులిచ్చే పొజిషన్ లో లేడు. నిర్మాతగా అతడు సక్సెస్ అవ్వాలంటే ఛాంగులే బంగారురాజా సినిమా హిట్ అవ్వాలి. అప్పుడే ప్రొడ్యూసర్ గా మరిన్ని సినిమాలు తీయగలగడు ఈ హీరో.
మట్టికుస్తీకి గట్టిగా ప్రచారం చేసిన రవితేజ, 'ఛాంగురే' సినిమా ప్రచారంలో మాత్రం పెద్దగా కనిపించలేదు. పూర్తిగా యూనిట్ కే వదిలేశాడు. సడెన్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం, తను విదేశాల్లో ఉండడంతో, ఈ సినిమాలో రవితేజ ప్రమేయం కాస్త తక్కువగానే కనిపిస్తోంది. ఈ సినిమాతో పాటు సుందరం మాస్టార్ అనే మరో చిన్న సినిమా కూడా రెడీ చేశాడు ఈ హీరో.