లోక్ సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయా, ఈ ఏడాది జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్ సభ ఎన్నికలు జరుగుతాయా.. అనే అంశంపై ఒకవైపు చర్చ జరుగుతూ ఉండగా, వీటికి త్వరలోనే కేంద్రం సమాధానం ఇస్తుందనే వార్తలూ వస్తున్న నేపథ్యంలో… వీటితో పని లేకుండా ఎన్నికల ప్రచారాన్ని అయితే మోడీ మొదలుపెట్టేశారు!
ఎన్నికలు జరిగే రాష్ట్రాల చుట్టూ తిరుగుతూ.. అదే తన విధులు అన్నట్టుగా వ్యవహరించే అలవాటున్న మోడీ మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లలో సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు! ఇలా ఎన్నికల ప్రచారాన్ని ఆయన మొదలుపెట్టేశారు! కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఒక రేంజ్ లో కష్టపడిన మోడీ ఇప్పుడు వేరే రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని గెలిపించే పనిని పెట్టుకున్నారు.
మధ్యప్రదేశ్ లో అయితే మోడీ కాంగ్రెస్ కూటమిపై విరుచుకుపడ్డారు! సనాతన ధర్మాన్ని తుదముట్టించాలని కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తోందంటూ వ్యాఖ్యానించారు. తమిళనాడు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను మోడీ ఎక్కడో మధ్యప్రదేశ్ కు తీసుకెళ్లి వాడుకున్నారు!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేరళ స్టోరీ వంటి సినిమానే వదలని మోడీ, ఉదయనిధి వ్యాఖ్యలను బహుశా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చాలా సార్లే వాడుకోనూ వచ్చు! మొత్తానికి మోడీ మరోసారి ఎన్నికల ప్రచార హోరును మొదలుపెట్టేశారు. రాబోయే కొన్ని నెలల పాటు.. ఎన్నికల మిషన్ ను మోడీ హోరెత్తించనున్నారు!