తెలుగుదేశం- జనసేనలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ లాంఛనంగా ప్రకటించేశాకా.. వీరి మధ్యన సీట్ల షేరింగ్ ఎలా ఉంటుందనేది ఆసక్తిదాయకంగా మారింది. తెలుగుదేశం పార్టీకి పొత్తులు కొత్త కాదు. ప్రతి సారీ కనీసం 15 సీట్లు అయినా వేరే పార్టీలకు ఇచ్చి పోటీ చేయడం దానికి కొత్త కాదు. అయితే ఆ 15 మందిలో ఎంతమంది చంద్రబాబు చంచాలు ఉంటారనేది వేరే సంగతి!
మిత్రపక్షానికి కేటాయించిన సీట్లలో తెలుగుదేశం రెబల్స్ ఎన్ని చోట్ల ఉంటారు, మిత్రపక్షానికి సీట్లను కేటాయించినట్టే కేటాయించి, అక్కడ మళ్లీ చంద్రబాబు తన పార్టీ బీఫారమ్ ఎంత మందికి ఇస్తారనేది నామినేషన్ల ఘట్టం పూర్తయ్యే నాటికి కానీ తేలే అంశం కాదు!
మిత్రపక్షాలకు సీట్లను ఇచ్చి ఆ తర్వాత పోటు వేయడంలో చంద్రబాబుది అందె వేసిన చేయి! ఈ విషయంలో కమ్యూనిస్టులు, కాషాయ పార్టీ వాళ్లే తాళలేకపోయారు! పవన్ కల్యాణ్ ఎంత? మరి తెలుగుదేశంతో పొత్తు అంటే.. పదో, పాతిక సీట్లో తీసేసుకుని సంతృప్తి పడబోమని ఆ మధ్య పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చాడు! మరి ఇప్పుడు కలిసి పోటీ అంటూ తనే ప్రకటించేసుకున్న ఈయన.. చంద్రబాబు నుంచి ఎన్ని సీట్లను సాధిస్తాడో ఈ విషయంలో ఈయన చేవ ఎంతో త్వరలోనే క్లారిటీ వస్తుంది!
పొత్తు తప్పనిసరి అని చంద్రబాబు కన్నా పవన్ కల్యాణే ముందే ప్రకటన చేశాడు. దీంతో పవన్ పూర్తి లోకువ అయిపోయినట్టే టీడీపీకి! మరి ఇందు మూలంగా తెలుగుదేశం విదిల్చే ముష్టి సీట్లలో పోటీ చేయాల్సిందే తప్ప జనసేనకు మరో ఆప్షన్ లేదని స్పష్టం అవుతోంది.
మరి ఆ వీర ముష్టి పది సీట్లా, పాతిక సీట్లా అనేది చంద్రబాబు దయ, పవన్ కల్యాణ్ ప్రాప్తం! తెలుగుదేశంతో జనసేన పొత్తు పెట్టుకుంటే 50-50 శాతం సీట్లు అని కొంతమంది జనసైనికులు, పవన్ కల్యాణే సీఎం క్యాండిడేట్ అని మరి కొంతమంది జనసైనికులు నమ్మారు పాపం! అయితే తనకు ఎందుకు సీఎం సీటు ఇస్తారంటూ ప్రశ్నించి పవన్ కల్యాణ్ వారివి భ్రమలే అని ఆ మధ్య తేల్చి చెప్పాడు. ఆ తర్వాత తను కూడా సీఎం అభ్యర్థినంటూ చెప్పుకుని కవర్ చేసే యత్నం చేశాడు.
అయితే.. పొత్తు ప్రకటనతో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే.. సీఎం పదవి కాదు, ఫిఫ్టీ -ఫిఫ్టీ సీట్ల ఒప్పందమూ లేదు, చంద్రబాబు వేసే వీర ముష్టే జనసేనకు పరమావధి అని పవన్ స్వయంగా స్పష్టతను ఇచ్చినట్టుగా అవుతోంది!