రాజకీయాల్లో శకునాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడుగుతీసి అడుగేయడంలో కూడా నేతలు శకునాలను చూసుకుంటారు. అందునా.. ఎన్నికల వంటి వాటికి ప్రిపరేషన్, అందుకు సంబంధించిన అడుగులకు అయితే చాలా ప్రాధాన్యత ఉంటుంది.
దీనికి ఏ రాజకీయ పార్టీ కూడా మినహాయింపు కాదు! మరి ఇలాంటి శకునాల మధ్యన అపశకునంలా అమావాస్య రోజున తమ పొత్తు ప్రకటనను చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పవన్ దోస్తీ పదేళ్ల నుంచి కొనసాగుతున్నదే!
ఎన్నికల్లో పోటీలు, ఇతర పార్టీలతో పొత్తులు వంటివి ఎన్ని జరిగినా.. చంద్రబాబుకు తొత్తుగా, దత్తపుత్రుడుగానే పవన్ కల్యాణ్ కొనసాగారు, కొనసాగుతున్నారు! అయితే వచ్చే ఎన్నికలకు ఆయన తాజాగా చేసిన పొత్తు ప్రకటన మాత్రం ప్రత్యేకమైనది! ఇది తమ గతి మారుస్తుందని టీడీపీ భావిస్తోంది. సొంతంగా పోటీ చేసి గెలిచి చరిత్ర ఏనాడూ తెలుగుదేశం పార్టీకి లేదు. అందునా చంద్రబాబు నాయుడు టీడీపీ పగ్గాలు చేపట్టాకా.. గెలిచిన ప్రతి సారీ మిత్రపక్షాల గాలి ఉన్నప్పుడు మాత్రమే!
1999, 2014లలో కేవలం బీజేపీకి దేశంలో ఉండిన సానుకూలతల వల్ల మాత్రమే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. 2004లో బీజేపీని తనతో పాటు తీసుకెళ్లి చిత్తు చేశారు. ఇక కమ్యూనిస్టులు, కేసీఆర్ లకు సానుకూలత లేని సమయంలో వారితో పొత్తు పెట్టుకుని సైతం చంద్రబాబు నెగ్గలేకపోయారు! మరి ఇప్పుడు పవన్ తో మరోసారి బాహాటమైన పొత్తుకు రెడీ అయ్యారు.
ఇదంతా కొన్నాళ్లుగా జరుగుతున్న తతంగమే అయినా.. తమ పార్టీలు ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేస్తాయనే ప్రకటనను పవన్ కల్యాణ్ అమావాస్య రోజున చేయడం ఏదో అపశకునంలా ఉంది! జైల్లో పొడిచిన ఈ పొత్తుకు సంబంధించి అమావాస్య రోజున పవన్ కల్యాణ్ ప్రకటించుకున్నారు! అసలే చంద్రబాబుకు రోజులు బాగోలేవని, ఆయన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని కొంతకాలం కిందట జ్యోతీష్యుడు వేణుస్వామి వంటి వారు చెప్పారు.
కొన్ని నెలల కిందట వేణుస్వామి ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో అమావాస్య రోజున పవన్ పొత్తు ప్రకటన ఈ కూటమిని ఎలా నడకపై ఎలాంటి ప్రభావం ఉంటుందో సిద్ధాంతులే చెప్పాలి!