మీకు మాత్రమే చెప్తా.. ఈ సినిమా ఎలా ఉందనే విషయాన్ని ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తీసిన ఈ సినిమా క్వాలిటీ ఇంత నాసిరకంగా ఉందనేదే అందరి కంప్లయింట్.
అవును.. మరీ షార్ట్ ఫిలిం రేంజ్ లో మీకు మాత్రమే చెప్తా క్వాలిటీ ఉందంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై విజయ్ దేవరకొండ తండ్రి, నిర్మాతల్లో ఒకరైన వర్థన్ దేవరకొండ స్పందించారు.
కోటిన్నర లేదా 2 కోట్లలో సినిమాను చుట్టేసి ఉంటారంటూ విమర్శలు వస్తున్న వేళ.. తమ సినిమా కోసం ఏకంగా ఐదున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేశాం అంటున్నాడు విజయ్ దేవరకొండ తండ్రి.
అయితే డీఐలో బ్రౌన్ టింట్ ఎక్కువగా వాడడం వల్ల ఫ్రేమ్ డల్ గా కనిపించిందని అదే కారణమని అంటున్నాడు. అంతేతప్ప… కెమెరాలు, ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదంటున్నారాయన.
ఈ సినిమాలో నటించిన నటీనటుల రెమ్యునరేషన్లకే దాదాపు కోటిన్నర అయిందని చెబుతున్నారు. ప్రమోషన్ కు కోటి పాతిక లక్షలు ఖర్చుచేశామని.. మిగతా మొత్తమంతా పూర్తిగా ప్రొడక్షన్ కే కేటాయించామంటున్నారు.
నైట్ ఎఫెక్ట్ లో తీయాల్సి రావడం, అనసూయ-అభినవ్ కాల్షీట్లు సెట్ అవ్వకపోవడం, ఔట్ డోర్ షూటింగ్స్ చేయాల్సి రావడంతో బడ్జెట్ చాలా ఎక్కువైందంటున్నారు.
విజయ్ తండ్రి ఎంత సమర్థించుకున్నప్పటికీ ఇప్పుడు చేయగలిగిందేం లేదు. విడుదలకు ముందే ఆ టెక్నికల్ అంశాల్ని చూసుకోవాలి. ఇప్పుడు ఎంత సమర్థించుకున్నా కలిగే ప్రయోజనం శూన్యం.
సినిమాకైతే ఇప్పటికే నెగెటివ్ టాక్ వచ్చేసింది. సినిమాకు తక్కువ, వెబ్ సిరీస్ కు ఎక్కువ అంటూ కామెంట్లు పడుతున్నాయి. సినిమా హిట్టా లేక ఫట్టా అనే విషయం రేపట్నుంచి వచ్చే వసూళ్లతో తేలిపోతుంది.