ఇసుక రాజకీయం.. పోరాటాలన్నీ కుతంత్రాలే!

'ఇసుక కొరత' అంటే ఏమిటో, దానివలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో స్వయంగా తెలియని, సరిగా అవగాహన చేసుకోలేని రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు హఠాత్తుగా దానిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే…

'ఇసుక కొరత' అంటే ఏమిటో, దానివలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో స్వయంగా తెలియని, సరిగా అవగాహన చేసుకోలేని రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు హఠాత్తుగా దానిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో  'ఇసుక సీజన్‌' నడుస్తోంది. ఇసుక గురించి మాట్లాడకపోతే.. మనల్ని నాయకుడి కింద గుర్తించరేమో అనేభయం విపక్షాలకు కలుగుతోంది. సీజన్‌ను బట్టి మాట్లాడకపోతే రాజకీయాల్లో మనుగడ కాపాడుకోవడం కష్టమని వారికి తెలుసు. కానీ, పోరాటాలకు పిలుపునివ్వడమే వారి కుతంత్రం.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇసుక కొరత ఉంది. ఇలాంటివి దాచిపెడితే దాగే సంగతులు కావు. అయితే భాజపా, తెదేపా, జనసేన అందరూ అదే టాపిక్‌ను తమ ఎజెండాగా ఎత్తుకున్నారు. జనసేన పిలుపునిచ్చిన పోరాటాలకు తెలుగుదేశం కూడా మద్దతివ్వబోతోంది. మంచిదే. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మీద విపక్షాలు ఏకమై పోరాడడం మంచిదే. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోరాటాలు అవసరం. అయితే ఇవన్నీ సరైన దిశలోనే సాగుతున్నాయా? ప్రజల సమస్యలు తీర్చడమే ఎజెండాగా సాగుతున్నాయా? లేదా వీరికి మరే ఇతర వక్ర ప్రయోజనాలు, హిడెన్‌ ఎజెండాలు ఉన్నాయా? అనేది మాత్రం అనుమానాస్పదంగానే ఉంది.

ముందుగా ఒక్క విషయం గుర్తించాల్సి ఉంది. జగన్మోహన రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ అయిదు నెలల్లో విపక్షాలు ఇంతగా ముక్తకంఠంతో ప్రభుత్వంపై పోరాడిన వ్యవహారం మరొకటిలేదు. ఇంత ఘాటుగా చేసిన ఉద్యమం కూడా మరొకటిలేదు. ఏతావతా మనం గమనించాల్సినది ఏంటంటే… ఈ అయిదునెలల పదవీకాలంలో.. ఇసుకను అందుబాటులో ఉంచడంలో తప్ప.. జగన్‌ సర్కారు వైఫల్యం ఇతరత్రా ఒక్కటైనా వారికి కనిపించలేదు.

కొందరికి ఇది సమస్యను పక్కదారి పట్టించడంగా కనిపించవచ్చు కానీ నిజం. ఇన్నాళ్లకు జగన్‌ ప్రభుత్వం పనితీరులో లోపం వల్ల ప్రజలకు ఎదురవుతున్న సమస్య విపక్షాలకు కనిపించింది. ఇప్పుడంతా దానిని గ్లోరిఫై చేసి.. మరింత పెద్దదిగా భూతద్దంలో చూపించాలనుకుంటున్నారు. కూలీ వర్గం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా చనిపోతారా? లేదా? అని ప్రతిరోజూ ఎదురుచూస్తున్నారు. ఎవరు ఏ కారణాలతో చనిపోయినా.. వెంటనే దానిని ఇసుక కొరతతో ముడిపెట్టి, జగన్‌ చేసిన హత్యగా అభివర్ణించడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

ఇసుక కొరత నేపథ్యంలో అత్యంత నీచమైన రాజకీయం ప్రస్తుతం నడుస్తోంది. ప్రతిపక్షాల్లో ఉన్న మేధావులకు మాత్రమేకాదు… నిజంగా పనులు దొరక్క ఇబ్బంది పడుతున్న కూలీకి కూడా స్పష్టంగా తెలిసిన కారణాలను, మూలాలను కూడా తొక్కిపట్టి.. ప్రతిదీ జగన్‌ వైఫల్యంగా మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది.

ప్రభుత్వం ఎలా ఫెయిలైందంటే…
జగన్‌ సర్కారు ఇసుక విషయంలో విఫలమైన మాట నిజం. ఆ వైఫల్యం ఎంతవరకు? అనేది కూడా నిష్పాక్షికంగా ఆలోచించాలి. తెలుగుదేశం హయాంలో వేలకోట్ల రూపాయల మేర జరిగిన పచ్చ దళారీల ఇసుక దోపిడీని అడుగంటా అణగదొక్కేయాలని జగన్‌ అనుకున్నారు. అందుకు కొత్త ఇసుక విధానం తేదలచుకున్నారు. ఇసుక రీచ్‌లు, విక్రయాల్లో పారదర్శకత తేవాలనుకున్నారు. ఆ మేరకు కొత్త విధానాన్ని రూపొందించే పనికి శ్రీకారం చుట్టారు.

ఇక్కడే జగన్‌ అనుభవరాహిత్యం బయటపడింది. జూన్‌-జులై-ఆగస్టు నెలలు అనేవి సాధారణంగా నిర్మాణ పనులు ముమ్మరంగా ఉండే సీజనే. ఆ సీజనులో ఇసుక విక్రయాలపై నిషేధం విధించేసి.. కొత్త విధానానికి కసరత్తు ప్రారంభించారు. అదే సమయంలో ప్రభుత్వ కాంట్రాక్టు పనులు అన్నీ కూడా ఆగిపోయాయి. ముమ్మరంగా పనులు ఉండే.. సీజన్‌లో కూలీలు అంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయారు. ఇలా చేయడం పొరబాటు.

కొత్తనోట్లను అందుబాటులోకి తేకుండా.. ముద్రణ కూడా ప్రారంభించకుండా.. రాత్రికి రాత్రి పాతనోట్ల రద్దు ప్రకటించిన మోడీ చేసిన తప్పిదం లాంటిదే ఇది కూడా. సెప్టెంబరు 5న కొత్త ఇసుక విధానం వస్తుందని అనుకుంటే.. జగన్‌ కసరత్తు ప్రారంభించిన తర్వాత.. ఆగస్టు మాసాంతం వరకు పాతవిధానాన్ని కొనసాగనిచ్చి.. ఆ తర్వాత ఓ రెండు వారాల నిషేధంతో కొత్త విధానం తెచ్చి ఉంటే.. ప్రజలెవ్విరికీ ఎలాంటి ఇబ్బందీ తెలిసి ఉండేది కాదు. కేవలం ఆ మూడునెలల వ్యవధి గురించిన తొందరపాటు.. జగన్‌ ప్రభుత్వానికి చాలా చెడ్డపేరు తెచ్చేసింది.

మూడునెలల విరామం తర్వాత.. ఒక్కసారిగా పనులు మొదలయ్యేసరికి ఇసుక అవసరం అమాంతం పెరిగింది. కొరత అనేది విశ్వరూపం దాల్చింది. అన్నాళ్లు ఖాళీగా ఉండడం వలన ఒక్కసారిగా పనులు ప్రారంభించడంతో అవసరం పెరిగింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. కొరత విరాట్రూపం దాల్చడానికి ఇది ఒక కీలక కారణం. కొత్త విధానం బాగానే ఉంది. దోపిడీకి అవకాశం తక్కువ. పారదర్శకత పెరిగింది. ఎవరైనా ఆన్‌లైన్‌లో కొనాలనే నిబంధన మంచిదే.. అంతా బాగానే ఉంది. కానీ.. ఈ కొత్త విధానానికి బాలారిష్టాలు తప్పలేదు.

కొత్త విధానాన్ని రూపొందించిన వారు.. ఇసుక దొంగలు తమకంటె తెలివిమీరిన వారై ఉంటారనే వాస్తవాన్ని విస్మరించారు. కొత్త విధానంలో లొసుగులు గ్రహించిన వాళ్లు యథేచ్ఛగా దోపిడీకి తెగబడ్డారు. ఆన్‌లైన్‌ విక్రయాలు ఓపెన్‌ అయిన నిమిషాల వ్యవధిలో నోస్టాక్‌ దర్శనమివ్వడం మామూలైపోయింది. అన్నిచోట్లా ఇదే దుస్థితి. సామాన్యుడికి ఇసుక దొరకడం అనేది గగనం అయిపోయింది. ఎవరైనా అర్థం చేసుకోవాల్సిన, కనీసం ఆలోచించాల్సిన సంగతి ఒకటే.

కొనుగోలు ఆన్‌లైన్‌ ద్వారా అయినప్పుడు.. వైకాపా ఇసుక దళారీలు మాత్రమే.. ముందుగా కొనేసి.. కొరత సష్టించడం అనేది ఎలా సాధ్యం అవుతుంది. ఓపెన్‌ అయిన కొన్ని నిమిషాల్లో మొత్తం కొనేసే దళారీ పాత్రను.. ఇసుక విక్రయాల్లో ముదిరిపోయిన ఎవ్వరైనా పోషించొచ్చు. అదే పని అయిదేళ్లుగా ఇసుక దోచుకోవడాన్ని తమ అలవాటుగా మార్చుకున్న తెలుగుదేశం వారు కూడా చేశారు. నిజానికి ఈ రకమైన ఇసుక దళారీల దందాలకు కుల మత, పార్టీ తారతమ్యం లేదు. అక్కడ ఒక దళారీపని ద్వారా.. ఆన్‌లైన్‌ విధానాన్ని వాడుకోవడం ద్వారా ఇసుకను దక్కించుకుని బ్లాక్‌ మార్కెట్‌ విక్రయాలు చేసుకుని ప్రతిరోజూ లక్షలు గడించడానికి అవకాశం ఉంది.

ఆ మర్మం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆ దురాగతాలకు పాల్పడ్డారు. వైకాపా వారు ఇందులో లేరని అనుకోనక్కర్లేదు. కానీ.. విపక్షాలు చాలా తెలివిగా.. విధానం వైకాపాది గనుక, వైకాపా దళారీలకు మాత్రమే ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుందని అన్నట్లుగా.. ప్రజలను నమ్మించారు. మొత్తం జగన్‌ స్వయంగా దోచేసుకుంటున్నాడన్నట్లుగా రంగు పులమడానికి ప్రయత్నిస్తున్నారు.

దీనికి సమాధానం చెప్పాలి…
చంద్రబాబు పాలనలో ట్రాక్టరు ఇసుక 2000కే ఇచ్చాం అంటున్నారు. అప్పట్లో ప్రభుత్వానికి వచ్చింది సున్నా. ఇసుకను ఉచితంగా ఇవ్వడం అప్పటి ప్రభుత్వ విధానం. అయినప్పటికీ.. రీచ్‌ నుంచి కొన్న వ్యక్తికి చేరేసరికి ఇసుక 2000 పలికింది. ఆయనే ఒప్పుకుంటున్నారు. ఈ సొమ్ము ఎక్కడికెళ్లింది? కేవలం తవ్వకం, రవాణా ఖర్చులే 2000 అయ్యేవా? అప్పట్లో మాయ ఎక్కడ జరిగింది. అందులో సగానికి పైగా తెలుగుదేశం నాయకులు భోంచేశారు!

ఇసుక తినడంలో ఇష్టం వచ్చినట్లుగా చెలరేగారు. ఉచిత ఇసుక ముసుగులో ఇలా కోట్లు కాజేస్తున్నవారు సాక్షాత్తూ ఎమ్మెల్యేలు గనుకనే… అడ్డుకోడానికి వచ్చిన అధికారుల మీద దాడులు చేయడం కూడా జరిగింది. జగన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానంలో అలాంటి దోపిడీకి అవకాశం లేకుండాపోయింది. ఈ విధానమే లోపభూయిష్టమైనదని ప్రచారం చేయడానికి, ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను ఈసడించుకునేలా చేయడానికి ఒక వ్యూహాత్మక ప్రచారం సాగుతోంది. ఇందులో దోపిడీకి అవకాశంలేదు. వారి నోటికాడ ఇసుకను జగన్‌ సర్కారు దక్కనివ్వకుండా చేసింది. అందుకే వారికి కడుపుమంట!

వర్షాలు కూడా జగన్‌ పాపమేనా?
నిర్మాణ రంగంతో కనీస పరిచయం ఉండే కూలీ కూడా.. వర్షాకాలంలో పనులు మందగిస్తాయని చెబుతారు. వర్షాకాలంలో పనులు సాగించడమే కుదరదు. వర్షాలు కాస్త ఎక్కువగా ఉండి.. ఇసుక రీచ్‌లు ఉండే నదులు ప్రవహిస్తూ ఉంటే గనుక.. ఆ ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు అసలు ఇసుక లభ్యత ఉండదు. ఈ సంగతిని గ్రహించడానికి తెలివితేటలు, మేధస్సు అక్కర్లేదు. కనీస కామన్‌సెన్స్‌ ఉంటే చాలు. కానీ.. మన ఖర్మ ఏంటంటే.. విపక్ష నాయకులకు లోపించింది అదే.

కామన్‌ సెన్స్‌ లేని వ్యక్తులు నాయకులు కావడం మూలాన.. ఇసుక కొరత ఏర్పడడానికి అసలు మూల కారణాలను విస్మరించి.. జగన్‌ మీద పడి ఏడవడం జరుగుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. అలాగని.. జననష్టం, ప్రాణనష్టం కలిగించే తుపాను, వరదల్లా కాకుండా.. నదులన్నీ సమృద్ధిగా ప్రవహించే స్థాయి వర్షాలు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలోని డ్యాంలన్నీ.. మళ్లీ మళ్లీ గేట్లు ఎత్తేస్తే తప్ప.. భరించలేనంత సమృద్ధిగా నీరు వస్తోంది. ప్రతిచోటా చెరువులు కుంటలు సహా సమస్తం నిండిపోయాయి. ఇంత స్థిరమైన జలసిరిని ఈ రాష్ట్రం కొన్ని దశాబ్దాలుగా చూసి ఎరగదు. అన్నదాతల్లో నవ్వులు విరిసే పరిస్థితి ఇది.

వర్షాకాలపు సీజన్‌ ప్రభావం ఇది. మారుమూల ప్రాంతాల్లో నిత్యం ఎండిపోయి ఉండే నదులు, వాగులు కూడా ఇప్పుడు పారుతున్నాయి. ఇక ఇసుక ఎక్కడినుంచి తేవాలి? అనివార్యమైన పరిస్థితి ఇది. ఈ వర్షాలు, నదులు నిండుగా పారుతున్న కారణంగా ఏర్పడుతున్న కొరతను ఘనత వహించిన విపక్ష నాయకులు ఏ రకంగా మానవ తప్పిదంగా అభివర్ణించగలరు? ప్రతి దానికీ జగన్‌ను బాధ్యుడిని చేసి.. అవాకులు చెవాకులు పేలితే నమ్మడానికి ప్రజలు వెర్రి వెంగళాయిలు అని అనుకుంటున్నారేమో తెలియదు. కొరతకు గల ఈ సహజ కారణాలను ప్రజలు గ్రహించకుండా ఉండేందుకు.. నానాయాగీ చేస్తూ మభ్యపెడుతున్నారు.

ప్రభుత్వ వైఫల్యం ఇదీ…
ప్రభుత్వం కొత్త విధానం తెచ్చింది. తేవడంలో జరిగిన జాగు, అప్పటిదాకా అనవసరమైన నిషేధం ఒక తప్పిదం. అయితే కొత్త విధానం ఆన్‌లైన్‌లో మొదలెట్టాక దళారీలు చేయిచేసుకోవడాన్ని, నోస్టాక్‌ బోర్డు దర్శనమివ్వడానికి దారితీస్తున్న కారణాలను వెంటనే గుర్తించడం, అంతకంటె వేగంగా.. అలాంటి దుస్థితిని చక్కదిద్దడంలో ప్రభుత్వం విఫలం అయింది. ఆన్‌లైన్‌ విక్రయాలు ప్రోగ్రామింగ్‌ మీదనే ఆధారపడి ఉంటాయి. ఇసుక కొనుగోలు సమయంలో వీరు ఊహించగలిగే దళారీ ఎత్తుల ప్రకారం.. చిరునామా, ఆధార్‌ నెంబరు వంటివి ఎంటర్‌ చేసిన తర్వాతే.. విక్రయించే ఏర్పాటు చేసే ఉంటారు.

అయితే.. ఇసుక దళారీల పరం అవుతున్నదని తెలుసుకోగానే.. యూజర్‌ ఐడీ, ఐపీ ట్రాకింగ్‌ లాంటి ఇతరత్రా ఫిల్టర్‌లు కూడా ప్రోగ్రాం చేసి ఉంటే దళారీలకు కొంత ముకుతాడు పడి ఉండేది. ఆ పనిని సకాలంలో చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. అందువలన, కొత్త విధానం తీసుకురావడంలో వారి లక్ష్యం ఎంత మంచిది అయినప్పటికీ.. కొరత తప్పలేదు. తద్వారా నిందలు తప్పలేదు. ఎద్దుపుండు కాకికి ముద్దు అన్నట్లుగా ప్రజల ఇసుక కష్టాలు ప్రతిపక్షాలకు పండగగా కనిపిస్తున్నాయి. అవకాశవాద పోరాటాలకు సిద్ధపడుతున్నారు.

ఇవన్నీ శుష్క పోరాటాలే..
చంద్రబాబునాయుడు తమ పచ్చ దళాలతో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయించారు. ఇసుక పొట్లాలను దండలుగా వేసుకుని షో చేశారు. భాజపా కూడా ఆందోళనలు చేసింది. జనసేన రాష్ట్రవ్యాప్తంగా ఏ చిన్న కార్యక్రమమూ తమ పార్టీ తరఫన చేసే సత్తాలేక, జనం లేక విశాఖలో మాత్రం మార్చ్‌ ప్లాన్‌ చేసింది. అందుకు కూడా జనసమీకరణకు జడిసి.. చంద్రబాబును ఆశ్రయించింది. ఆయన సై అన్నారు. ఇప్పుడు వారు మార్చ్‌ చేయబోతున్నారు.

ఈ పోరాటంలో చిత్తశుద్ధి ఉందా? ఈ మార్చ్‌ వలన ఇసుక లభ్యత పెరుగుతుందా? పోరాటంలో సమస్యను హైలైట్‌ చేస్తారు సరే.. అందుకు జగన్‌ ఎలా స్పందించాలి. ఎలా సమస్య తీర్చాలి. ఇసుక దొరికే నదుల్లో ఉన్న నీటిని మొత్తం ఎత్తి బయటపారబోసి.. ఇసుక తవ్వకాలకు ఆదేశాలివ్వాలా? ఈ పోరాటాలు ఎంత దురుద్దేశంతో.. వాస్తవాన్ని దాచిపెడుతూ.. ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో నడుస్తున్నవో అర్థం చేసుకోవాలి.

ఈ ఇసుక కొరత ఇప్పట్లో తీరదు. కొన్నాళ్లపాటూ… నిర్మాణరంగం మీద ఆధారపడిన కూలీలంతా కూడా.. ప్రత్యామ్నాయ-తాత్కాలిక కూలీ, ఉపాధి పనులు వెతుక్కోవాల్సిందే. చేదుగా ఉన్నా ఇది నిజం. పవన్‌ కల్యాణ్‌ రంకెలు వేసినంత మాత్రాన, చంద్రబాబు ట్వీట్లు చేసినంత మాత్రాన.. ఇసుక కొరత తక్షణం తీరే అవకాశమే లేదు. జగన్‌ మోహన్‌ రెడ్డిది జనసంక్షేమ ఎజెండాతో పనిచేస్తున్న ప్రభుత్వం. రాష్ట్రమంతటా ప్రభావం చూపించే ఇసుక విషయంలో వారెందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు? బద్నాం అయిపోతామనే భయం వారికి ఉండదా? ఉంటుంది.. బద్నాం అవుతున్నారు కూడా.

అయితే తక్షణం చేయగలిగిన పరిష్కారం వారి చేతుల్లో లేదు. ప్రజలు కూడా ఆ విషయం అర్థం చేసుకుంటే.. ఇసుక కొరత దాని సహజ క్రమంలో తగ్గుతుంది. సమస్య పరిష్కారం అవుతుంది. అవకాశవాద పోరాటాల వల్ల కాదు.. ప్రభుత్వ చిత్తశుద్ధి వల్ల మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది.

ఆంధ్రా రాజకీయం.. ఈవారం స్పెషల్ 'గ్రేట్ ఆంధ్ర' పేపర్