ఐదునెలలు గడిచిపోయాయి ఎన్నికలు అయిపోయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వం మీద అతిగా స్పందిస్తున్నారు. జగన్‌ను అనరాని మాటలు అంటున్నారు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఇచ్చుకుంటున్న లీకుల్లో ఏ మాత్రం సంస్కారం లేని మాటలు ఉంటున్నాయి. అయితే తన సంస్కారం అంతే అని చంద్రబాబు నాయుడు చాటుకుంటున్నారు. ఒక ఫేస్‌బుక్ పోస్టులోని బూతులను పచ్చిగా చదివి వినిపించనప్పుడే చంద్రబాబు నాయుడు తన లెవల్ ఏమిటో అందరికీ చాటి చెప్పుకున్నారని పరిశీలకులు అంటున్నారు.
అలా చంద్రబాబు నాయడు పచ్చి పచ్చిగా మాట్లాడుతూ.. ప్రభుత్వం మీద అక్కసంతా వెల్లగక్కుతుంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కిమ్మనడం లేదు. రాయలసీమ ప్రాంతంలో మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీ తరఫున చాలామంది హడావుడి చేశారు. వీరిలో మంత్రులున్నారు, సీనియర్లున్నారు. కొందరైతే చంద్రబాబు నాయుడుకే అప్పుడు లెక్చర్లిచ్చారు!
అయితే ఇప్పుడు అలాంటి వాళ్లంతా నోరు ఎత్తడం లేదు. ప్రభుత్వ విధానాల విషయంలో కానీ, ఇతర వ్యవహారాల విషయంలో కానీ వారు స్పందించడమే లేదు. ఎప్పుడైనా స్పందించినా.. ఏదో అది నామమాత్రంగా ఉంటోంది. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేతలు అయినా, చిత్తూరు జిల్లాకు చెందిన ఫిరాయింపుదారులు, అనంతపురం జిల్లాకు చెందిన పాత కాపులైన తెలుగుదేశం నేతలు.. వీళ్లంతా ఎవ్వరూ కనీసం తమ ఉనికిని చాటేలా కూడా స్పందించడం లేదు.
ఇక కడపజిల్లాలో అయితే అంతా ఖాళీ చేశారు. బీజేపీలోకి చేరిపోయారు. ఇలాంటి నేపథ్యంలో.. ఇంతకీ వాళ్లంతా ఎందుకు కామ్‌గా ఉంటున్నారు? అని ఆరాతీస్తే వాళ్ల బొక్కలు చాలా ఉన్నాయని, ఇప్పుడు ఏం మాట్లాడితే తమ బొక్కలను ప్రభుత్వం బయటకు తీస్తుందో అనే భయంతో వాళ్లు కామ్‌గా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేయని అరచకాలు లేవని, అందుకే ఇప్పుడు వారు ఏ విషయం మీదా స్పందించే పరిస్థితుల్లో లేరనే చర్చ సాగుతూ ఉంది సీమ ప్రజానీకంలో!