అత‌డు పెట్టిన ముద్దు.. 15 యేళ్ల‌కు ఆమెకు రిలీఫ్!

చోద్య‌మంటే ఇదే కాబోలు. ఎప్పుడో ప‌దిహేనేళ్ల కింద‌ట ఒక వేదిక‌పై హాలీవుడ్ న‌టుడు రిచ‌ర్డ్ గెరే బాలీవుడ్ న‌టి శిల్పా షెట్టిని ముద్దు పెట్టుకోవ‌డానికి సంబంధించిన తీర్పు ఇప్పుడు వెలువ‌డింది! ఇలాంటి కేసుల‌కు మ‌న…

చోద్య‌మంటే ఇదే కాబోలు. ఎప్పుడో ప‌దిహేనేళ్ల కింద‌ట ఒక వేదిక‌పై హాలీవుడ్ న‌టుడు రిచ‌ర్డ్ గెరే బాలీవుడ్ న‌టి శిల్పా షెట్టిని ముద్దు పెట్టుకోవ‌డానికి సంబంధించిన తీర్పు ఇప్పుడు వెలువ‌డింది! ఇలాంటి కేసుల‌కు మ‌న న్యాయ‌స్థానాలు త‌మ విలువైన స‌మ‌యాన్ని ప‌దిహేనేళ్ల పాటు కేటాయించాయి. రోజువారీ విచార‌ణ కాక‌పోయినా.. ఇలాంటి కేసుల‌కూ ఎంతో కొంత స‌మ‌యం అయితే కేటాయించి ఉండ‌వ‌చ్చు. మ‌రి ప‌దిహేనేళ్ల విచార‌ణ త‌ర్వాత తేలిందేమిటంటే… శిల్పా షెట్టి ఈ కేసులో నిందితురాలు కాదు, ఆమె బాధితురాలు అని. ఈ మేర‌కు ముంబై కోర్టు తీర్పును ఇచ్చింది.

మ‌రీ యంగ్ జ‌న‌రేష‌న్ కు ఈ కేసు పూర్వాప‌రాలు కూడా తెలియ‌క‌పోవ‌చ్చు. ఇప్పుడు కాదు.. ప‌దిహేనేళ్ల కింద‌ట‌, దేశంలో ఎయిడ్స్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా రిచ‌ర్డ్ గెరే అనే హాలీవుడ్ న‌టుడు తిరిగాడు. అత‌డి కార్య‌క్ర‌మాల‌కు టాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా హాజ‌ర‌య్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సారి ఆయ‌న‌తో క‌లిసి వేదిక‌పై క‌నిపించారు. గెరేను అభినందించారు.

అయితే ఆ త‌ర్వాత గెరే వ్య‌వ‌హారం ఒక వివాదంగా మారింది. రాజ‌స్థాన్ లో జరిగిన ఒక కార్య‌క్ర‌మ వేదిక మీద న‌టి శిల్పా షెట్టిని ఆమాంతం వాటేసుకుని ముద్దులు పెట్టేసుకున్నాడు ఈ న‌టుడు. మ‌రీ వ‌ల్గ‌ర్ గా కాదు కానీ, అమెరిక‌న్ స్టైల్లో, కాస్త మురిపాలు కురిపిస్తూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఆ చ‌ర్య‌తో శిల్ప ఏ మేర‌కు అవాక్క‌య్యిందో కానీ, చేసేది లేక న‌వ్వుతూ రిప్లై ఇచ్చింది. ప్ర‌తిగా ఈమె ముద్దులు పెట్టుకోలేదు కానీ, మ‌రీ తోసేయ‌లేన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించింది. అత‌డి చ‌ర్య‌లో కామం క‌న్నా, కాస్త ఉత్సాహం, మురిపెం క‌నిపించింది చాలా మందికి.

అయితే ఇలాంటి వాటిని వివాదంగా చూసే జ‌నాలు.. ఇది భారత సంస్కృతికి అవ‌మానం అన్న‌ట్టుగా కోర్టులో ఒక పిటిష‌న్ ప‌డేశారు. రిచ‌ర్డ్ మీదే కాదు, శిల్ప మీద కూడా కేసులు పెట్టేశారు! ముద్దు పెట్టింది అత‌డు, ఏడ‌వ‌లేక న‌వ్విన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించింది ఆమె! అయితే ఈ కేసులో శిల్ప పేరు ప‌దిహేనేళ్ల పాటు నాన‌క త‌ప్ప‌లేదు.

ప్ర‌స్తుతానికి ఆమెను ఈ కేసుల్లో నిందితురాలిగా వ్య‌వ‌హ‌రించ‌లేమ‌ని, బాధితురాలిగానే చూడాల‌ని న్యాయ‌స్థానం చెప్పింది. మ‌రి కేసులు పెట్టిన వారికి ఇంత‌టితో అయినా జ్ఞానోద‌యం అవుతుందో లేక పై కోర్టుకు వెళ‌తారో! ఈ అంత‌ర్జాతీయ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి!r