కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో కేఏ పాల్ పాత్రపై స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. సినిమాలో తన పాత్ర మంచి కామెడీ పండిస్తుందని పరోక్షంగా చెప్పుకొచ్చాడు.
పాల్ ను ఇప్పటివరకు ఒకేఒక్కసారి కలిశానని, ఆ టైమ్ లో ఆయన కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నించానన్నాడు ఆర్జీవీ.
“కేఏ పాల్ ను ఒకే ఒక్కసారి కలిశాను. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నించాను. మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఒక్కసారి ఆయన కాళ్లు పట్టుకోవడానికి ట్రై చేశాను. ఎందుకంటే ఆయన చెప్పే అబద్ధాలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. అలాంటి కలలుగనే వాళ్లు నాకు తెలిసీ ఎక్కడా ఉండరు. అందుకే కాళ్లు పట్టుకోవాలనుకున్నాను. అదే టైమ్ లో ఆ కాళ్లు లాగితే కిందపడి ఆయన తల పగిలి మైండ్ సెట్ అవుతుందేమో అని చిన్న ఆశ. కానీ జీసస్ ను నామీద ప్రయోగిస్తారని భయపడి ఆగిపోయా.”
ఇలా కేఏ పాల్ పై ఇంటర్వ్యూలో కూడా కామెడీ చేశాడు వర్మ. కేఏ పాల్ లాంటి పాత్రల్ని ఇప్పటివరకు తను కామిక్ పుస్తకాల్లో, సినిమాల్లో మాత్రమే చూశానని.. నిజజీవితంలో కేఏ పాల్ లాంటి వ్యక్తి ఉనికిలో ఉండడం అసాధ్యం అంటున్నాడు.
“కేఏ పాల్ లాంటి మనిషి ఉనికిలో ఉండడం సాధ్యం కాదు. ఏదో కామిక్ పుస్తకం నుంచి ఓ ఫన్నీ క్యారెక్టర్ ప్రాణం పోసుకొని వచ్చేసింది. జనాల మధ్య ఉండాల్సిన వ్యక్తి కాదు ఆయన. కేఏ పాల్ ఏం మాట్లాడినా, ఏం చేసినా కామిక్ బుక్ లో ఓ జోక్ కు ప్రతిరూపమే. అబద్ధాల్ని కూడా కామెడీగా చెప్పడానికి తెలివి కావాలి. అది కేఏ పాల్ కు ఉంది.”
కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా చూపించామంటున్నాడు వర్మ. ఓ తండ్రి, కొడుకు వద్దకొచ్చి ప్రేమతో పప్పు వడ్డించే సన్నివేశంలో తను ఫ్యామిలీ ఎమోషన్ ను మాత్రమే చూశానని, ప్రేక్షకులు మాత్రం పప్పును చూస్తున్నారని.. అది తన తప్పు కాదని అంటున్నాడు వర్మ.