డైరక్టర్, సెలబ్రిటీ స్థాయి నుంచి యాంకర్ స్థాయికి..!

ఓ స్థాయిలో ఉన్న వ్యక్తులు కాస్త ఫేమ్ లో ఉన్నప్పుడే కెరీర్ నుంచి హుందాగా తప్పుకుంటారు. అది గౌరవసూచకం, అవసరం కూడా. అంతకుమించి వెంపర్లాడితే ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. స్టార్ డైరక్టర్లు కూడా ఇక…

ఓ స్థాయిలో ఉన్న వ్యక్తులు కాస్త ఫేమ్ లో ఉన్నప్పుడే కెరీర్ నుంచి హుందాగా తప్పుకుంటారు. అది గౌరవసూచకం, అవసరం కూడా. అంతకుమించి వెంపర్లాడితే ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. స్టార్ డైరక్టర్లు కూడా ఇక తమ పనైపోయిందని భావించినప్పుడు గౌరవంగా తప్పుకుంటారు. రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇవేం పట్టించుకున్నట్టు కనిపించదు.

ఇండస్ట్రీని మలుపుతిప్పిన సినిమాలు తీశాడు. బాలీవుడ్ ను షేక్ చేసిన మూవీస్ అందించాడు. టేకింగ్ లో కొత్త పాఠాలు నేర్పించాడు. ఇలా దర్శకదిగ్గజంగా పేరు తెచ్చుకున్నాడు ఆర్జీవీ. అయితే క్రేజ్ కలకాలం ఉండదు కదా. వర్మకు కూడా ఫ్లాపులొచ్చాయి.

అలా ఫ్లాపులొచ్చిన ప్రతిసారి, మళ్లీ మళ్లీ ఫ్లాపులు తీస్తూనే ఉన్నాడు ఈ దర్శకుడు. ఇతడు ఫ్లాపులు తీసిన ప్రతిసారి, ఈసారి హిట్ ఇస్తాడులే అని సర్దిచెప్పుకున్నారు అతడి అభిమానులు. కొన్నాళ్లకు వర్మకు ఫ్లాపులు అలవాటైపోయాయి. ఇతడు ఇక హిట్స్ ఇవ్వడని, అతడి ఫ్యాన్స్ కు కూడా అర్థమైపోయింది.

ఆ తర్వాత వివాదాల వెంట పడ్డాడు వర్మ. కాంట్రవర్సీ స్టేట్ మెంట్స్, సినిమాలతో లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేశాడు. రాజకీయ సంచలనాలు, క్రైమ్ ఘటనలు, ప్రేమ వ్యవహారాలు.. ఇలా ప్రతి అంశంపై స్పందిస్తూ, మరోవైపు చకచకా సినిమాలు తీస్తూ వచ్చాడు. అవి కూడా వర్కవుట్ కాలేదు.

ఇక లాభం లేదనుకొని సెమీ-అడల్డ్ సినిమాల వైపు మళ్లాడు. అక్కడితో ఆగకుండా హాట్ బ్యూటీస్ ను ఇంటర్వ్యూ చేసి రకరకాలుగా మాట్లాడ్డం స్టార్ట్ చేశాడు. ఇక ఇంతకంటే దిగజారడులే అనుకున్న ప్రతిసారి మరింత కిందకు దిగుతూ వచ్చాడు వర్మ.

ఈమధ్య ఓ కార్యక్రమంలో ఓ నటి కాలి వేళ్లను నాకడంతో అతడి దిగజారుడితనం అట్టడుగుకి చేరిపోయింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు సగటు యాంకర్ గా మారిపోయాడు వర్మ. నిజం అనే యూట్యూబ్ ఛానెల్ పెట్టి అన్నీ నిజాలే మాట్లాడతానంటూ ముందుకొచ్చాడు.

తను ఏవైతే చెప్పాలనుకున్నాడో, ఇన్నాళ్లూ సెలబ్రిటీ హోదాలో వాటిపై స్పందించేవాడు వర్మ. ఇప్పుడు ఆ హోదా నుంచి యాంకర్ స్థాయికి మారిపోయాడు ఈ దర్శకుడు. మరో వ్యక్తిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం 'నిజం'లో చూస్తున్నాం. ఒక స్టార్ డైరక్టర్ నుంచి సెలబ్రిటీ హోదాకు వచ్చి, అక్కడ్నుంచి ఇలా సగటు యాంకర్ స్థాయికి వర్మ పడిపోయాడు. 'అంతా నా ఇష్టం' అంటూ ఆర్జీవీ తనలోని ఇంకెన్ని కోణాలు చూపిస్తాడో!