ఎన్నాళ్లు ఈ భజన బృందగానాలు. కాస్త పెద్ద హీరోల సినిమా వస్తోంది అంటే పబ్లిసిటీకి కామన్ ఇంటర్వ్యూ అనే పదార్థం ఒకటి వండుతారు. యాంకర్ కు లక్ష..రెండు లక్ష ఇచ్చి మరీ ఈ ఇంటర్వ్యూలు తయారు చేయించుకుంటారు. భళా..అంటే భళీ అన్నట్లు సాగుతాయి ఇవి. వాటి వల్ల ఏం ఉపయోగమో వాళ్లకే తెలియాలి. ఎందుకిలా? ఫ్రీగా ఇంటర్వూలు ఇవ్వవచ్చు కదా అంటే..ఒకరికి ఇస్తే మరొకరు అడుగుతారు. ఎంత మందికి అని ఇస్తాం..అందుకే ఈ కామన్ ఇంటర్వూ అనేది సమాధానంగా వస్తుంది.
పైగా ఇలాంటి ఇంటర్వూల్లో పొరపాటున కూడా హీరోలు నొచ్చుకునే ప్రశ్నలు వుండవు. అందుకే ఇలాంటి వాటిని జనం చూడడం కూడా తగ్గించేసారు. మరో రకం ఇంటర్వూలు ఏమిటంటే ఎవరో ఒక సెలబ్రిటీని తీసుకువచ్చి టీమ్ నో, హీరోనో ఇంటర్వూ చేయించడం. వాళ్లు మాత్రం తక్కువ తిన్నారా..మీరు ఇంత పొడుగు..అంత లావు..ఇంత తరుము..అంత తోపు అంటూ భజన చేయడం తప్ప, సూటిగా, చురుక్కున తగిలేలా ఒక్క ప్రశ్న అడగరు.
ఎందుకంటే చిన్న నెగిటివిటీని కూడా హీరోలు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. లేటెస్ట్ గా ఇలాంటి సంఘటనే జరిగింది.
రామబాణం సినిమా కోసం హీరో గోపీచంద్ ను దర్శకుడు తేజ చేత ఇంటర్వూ చేయించారు. తేజ అంటే గోపీచంద్ కెరీర్ ను మలుపుతిప్పిన దర్శకుడు. అందుకే గోపీచంద్ కూడా సరే అన్నారు. అక్కడ వరకు బాగానే వుంది. కానీ తేజ అందరిలాంటి వాడు కాదు. నిర్మొహమాటంగా తాను మాట్లాడాలనుకున్నది మాట్లాడతారు. అడగాల్సింది అడిగేస్తారు. అదే జరిగింది ఈ రామబాణం ఇంటర్వూలో. తనతో ఒకె చేసి వదిలేసిన సినిమా గురించి, తన ఫోన్ ఎత్తకపోవడం గురించి నిర్మొహమాటంగా అడిగేసారు. మీ నాన్న గొప్పోడు సరే, నువ్వేం పీకావ్ అంటూ కాస్త ఘాటుగానే అడిగేసారు.
ఈ ప్రోమో వదిలేసరికి అది కాస్తా వైరల్ అయింది. అక్కడి వరకు బాగానే వుంది. హీరో గోపీచంద్ కు మాత్రం ఎందుకో అది అంత నచ్చలేదు. ఆ సంగతి మీడియా కూపీ లాగితే, రాంగ్ గా ప్రోమో కట్ చేసారు. ఒకదాని సమాధానం మరోదానికి తగిలించారని చెప్పుకోచ్చారు.
ఇప్పుడు ఈ ఇంటర్వూను వదిలితే ఒక బాధ, వదలకుంటే మరో బాధ. అందుకే దాన్ని పట్టుకుని, హీరోకి ఇబ్బంది లేకుండా, ఎడిట్ చేసి, వదిలే ప్రయత్నంలో పడింది యూనిట్. ఇక పొరపాటున కూడా తేజ ను ఎవ్వరూ ఇంటర్వూ చేయమని ఇక పిలవరేమో?