మైత్రీ సంస్థ ఐటి దాడుల అంకం ముగిసింది. కానీ దాని మీద వినిపించే గ్యాసిప్ లు మాత్రం ఆగడం లేదు. ఐటి దాడుల్లో ఇలా జరిగింది..అలా జరిగింది…అవి దొరికాయి..ఇవి దొరికాయి లాంటి గ్యాసిప్ లు విరివిగా చలామణీ అవుతున్నాయి. ఎన్నారై ఫండ్స్ రెండు వందల కోట్ల నుంచి అయిదు వందల కోట్ల మీదుగా ఏడు వందల కోట్లు అనే అంకెకు చేరిపోయాయి.
ఇవి చాలా వరకు గాలి వార్తలే అయి వుండాలి. ఎందుకంటే 700 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు. ఇప్పటి వరకు మైత్రీ తీయబోయే సినిమాల మీద పెట్టిన పెట్టుబడులే మహా అయితే రెండు వందల కోట్లు మించి వుండవు. పుష్ప సినిమా పూర్తి చేయడానికే నాలుగైదు వందల కోట్లు కావాల్సి వస్తుంది కానీ ఆ మేరకు ఫైనాన్స్ ఫండింగ్ ఎలాగూ వుంటుంది.
ఆ విషయం అలా వుంచితే బాలీవుడ్ దర్శకుడికి 150 కోట్లు అని మరో గ్యాసిప్. కానీ అదీ నిజం అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఓ దర్శకుడికి అంత మొత్తం ఎందుకు పంపుతారు. సల్మాన్ లాంటి హీరోకి పంపారు అంటే కాస్త నమ్మవచ్చు. అప్పుడు కూడా అంత మొత్తం అయితే కాదు.
ఈ గ్యాసిప్ లు ఇలా వుంటే రెండు బలమైన విషయాలు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి వాట్సాప్ చాట్ లు. నిర్మాతలు డిలీట్ చేయకుండా వుంచుకున్న వాట్సాప్ చాట్ ల్లో దాదాపు ఇండస్ట్రీలో చాలా మంది పేర్లు వున్నాయన్నది ఒకటి. సీనియర్ టాప్ హీరో నుంచి పాన్ ఇండియా టాప్ హీరో వరకు అందరి ప్రస్తావన ఆ చాట్ ల్లో వుందని తెలుస్తోంది. వీటిని పట్టుకుని ఆ హీరోల దగ్గరకు వెళ్లి చేసేదేమీ వుండదు. కాస్త ప్రశ్నించడానికి తప్ప మరో ఆస్కారం వుండదు.
మరో గ్యాసిప్ ఏమిటంటే మైత్రీ అధినేత మొబైల్ లో ఓ ఎక్సెల్ షీట్ దొరికిందన్నది. అందులో ఆర్థిక లావా దేవీలకు సంబంధించిన వివరాల డేటా చాలా వుందని వినిపిస్తోంది. అసలు అలా ఓ ఎక్సెల్ షీట్ పెట్టుకుని, ఫోన్ లో అందుబాటులో ఎందుకు వుంచుకున్నారని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. ఐటి శాఖను దృష్టిలో వుంచుకుని జాగ్రత్తగా వుండాలి కదా అని కామెంట్ చేస్తున్నారు.
ఐటి అధికారులు ఫోన్ ల నుంచి కంప్యూటర్ల నుంచి టోటల్ డేటా డౌన్ లోడ్ చేసుకుని తమతో తీసుకెళ్లారని తెలుస్తోంది. అధికారులు ఆ డేటా అంతా విశ్లేషించి, ఆ తరువాత ఓ అంచనాకు రావాల్సి వుంటుంది. ఆపైన తమకు అందిన సమాచారం మేరకు పన్ను ఎగవేతలు ఏమేరకు జరిగాయి అన్నది నిర్థారణకు రావాల్సి వుంటుంది. అప్పుడు నోటీసులు, సమాధానాలు, అప్పీళ్లు ఇలా చాలా వుంటుంది వ్యవహారం. అప్పటి వరకు ఇలా గ్యాసిప్ లు వినిపిస్తూ వుంటాయేమో?