సునీత పాత్రను ధ్రువీకరించేలా షర్మిల మాటలు!

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమై తన పోరాటం కొనసాగిస్తుండవచ్చు గాక! కానీ ఏపీ రాజకీయాల్లో కూడా ఆమె పేరు అస్సలు వినపడకుండా ఉండాలంటే కుదరదు. ప్రత్యేకించి వివేకా హత్య కేసుకు సంబంధించి…

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమై తన పోరాటం కొనసాగిస్తుండవచ్చు గాక! కానీ ఏపీ రాజకీయాల్లో కూడా ఆమె పేరు అస్సలు వినపడకుండా ఉండాలంటే కుదరదు. ప్రత్యేకించి వివేకా హత్య కేసుకు సంబంధించి షర్మిల కూడా ఒక కీలకమైన వ్యక్తి. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద నిందలు వేస్తున్న వారంతా.. షర్మిల పేరును కూడా ప్రస్తావిస్తున్నారు. కడప ఎంపీ టికెట్ షర్మిలకు లేదా తనకు ఇవ్వాలని వివేకా డిమాండ్ చేశారని, అందుచేతనే అవినాష్ రెడ్డి హత్యకు పథక రచన చేశాడని నిందలు వేస్తుంటారు. 

అవినాష్ రెడ్డి మాత్రం.. తన అభ్యర్థిత్వం పట్ల వివేకాలో వ్యతిరేకత లేదని అంటూ, అందుకు నిదర్శనంగా హత్యకు గురైన ముందురోజు కూడా తనకోసం చేసిన ఎన్నిక ప్రచారాన్ని ప్రస్తావిస్తారు. ఇది కేవలం ఆస్తి కోసం జరిగిన హత్యగా ఆయన చెబుతుంటారు. వివేకాకు రెండో వివాహం అయిందని, ఆమె ద్వారా పుట్టిన కొడుకు కు ఆస్తి వెళ్లకుండా, ఆయన మొదటి భార్య కూతురు సునీత, అల్లుడు కలిపి హత్య చేయించారనేది ఆరోపణ.

ఇదిలా ఉండగా తాజాగా ఈ వ్యవహారాలపై వైఎస్ షర్మిల మాట్లాడారు. ‘ఇది ఆస్తికోసం జరిగిన హత్య కానే కాదన్నారు’. నిజానికి ఆమె అవినాష్ రెడ్డిని ఇరుకు పెట్టేలాగా, ఆయన మీద అనుమానాలు మరింత పెరిగేలాగానే మాట్లాడారు గానీ.. జాగ్రత్తగా లోతుగా గమనిస్తే.. షర్మిల మాటల అంతరార్థం వేరే ఉంది. హత్య కేవలం సునీత – లేదా ఆమె తరఫు పనిచేస్తున్న వాళ్లు చేయించినట్లుగా ఎవ్వరికైనా అర్థమవుతుంది.

ఇంతకూ షర్మిల ఏమంటున్నారంటే.. ‘ఆస్తులన్నీ సునీత పేరిట ఎప్పటినుంచో ఉన్నాయట. ఆస్తులను సునీత పేరిట పెడుతూ వివేకానందరెడ్డి చాలా కాలం కిందటే వీలునామా రాశారట. అందువల్ల సునీత ఈ హత్య చేయించే అవకాశం లేదని షర్మిల అన్నారు. 

షర్మిల తెలిసి అన్నారో తెలియెక అన్నారో మనకు బోధపడ్డం లేదు గానీ.. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే హత్య చేయించాల్సిన అవసరం సునీతకే ఎక్కువ. ఎందుకంటే, ఆస్తులన్నీసునీత పేరిట ‘రిజిస్టరు అయి’ లేవు. కేవలం వివేకా ఆమె పేరిట వీలునామా రాశారంతే. అది జరిగి చాలా కాలం అయింది. వీలునామా అనేది శాశ్వతం కాదు. 

ఒకవేళ రిజిస్టరు చేసి ఉన్నా సరే.. సదరు వీలునామాను అదే వివేకా మళ్లీ మార్పించి రాయించి, మళ్లీ రిజిస్టరు చేయడానికి లీగల్ గా అవకాశం ఉంటుంది. అంటే.. వివేకానందరెడ్డి జీవించి ఉంటే… సునీత పేరిట ఉన్న ఆస్తులు ఏదో ఒక క్షణంలో పూర్తిగా వివేకా రెండో భార్య కొడుకు పేరు మీదికి మారిపోయే అవకాశం ఉంది. వీలునామాను తిరిగరాయించే అవకాశం ఉండేది. 

కేవలం అందుకోసమే సునీత, ఆమె భర్త ఈ హత్య చేయించి ఉండవచ్చునని.. షర్మిల మాటలను లోతుగా గమనించిన వారికి అనుమానం కలుగుతుంది. అయితే హత్య వెనుక గల నిజానిజాలు ఏమిటన్నది సీబీఐ మాత్రమే తేల్చాల్సి ఉంది.