ఏం చేసైనా సరే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయాలి. ఆయన మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలి. జగన్ పట్ల ప్రజల్లో అపనమ్మకం ప్రబలుతున్నట్టుగా , అపకీర్తి పెరుగుతున్నట్టుగా ప్రజలను భ్రమింపజేయాలి. లేకపోతే తమకు మనుగడ ఉండదు. ఈ ఎన్నికల్లో గనుక జగన్ మళ్లీ విజయం సాధిస్తే ఇక తమ తమ రాజకీయ దందాలు శాశ్వతంగా మూసుకోవాల్సిందే అనేది తెలుగుదేశం దళాలకు చాలా స్పష్టంగా తెలుసు. అందుకే తమ తమ లక్ష్యసాధన కోసం వారు చాలా కష్టపడుతున్నారు. చాలా షార్ప్ గా పని చేస్తున్నారు. తమకు దక్కిన ఒక్క అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవడం లేదు. ఈ ఉదాహరణ గమనిస్తే.. టీడీపీ దళాలు ఎంత షార్ప్ గా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల లో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి వెళ్లడానికి హెలిపాడ్ వద్దకు వచ్చేసరికి అసలు విషయం తెలిసింది. ఆ హెలికాప్టర్ లో అప్పటికే సాంకేతిక లోపం తలెత్తింది. ఇంధన సరఫరాలో లోపం తలెత్తినట్టు పైలట్ గుర్తించారు. అప్పటికి ఇక హెలికాప్టర్ లో వెళ్లడం సాధ్యం కాదని. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకోవాలనుకున్నారు. నార్పల నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి రోడ్డు మార్గాన వెళ్లారు.
అయితే , ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన వెళుతుండగా.. ధర్మవరం మండలంలో సీఎం కాన్వాయ్ ను అడ్డుకుని నిరసన తెలియజేసేందుకు హఠాత్తుగా కొందరు ప్రయత్నించారు. వీరంతా తమ పొలాలను ఇంటిస్థలాల కోసం ఇచ్చేసి, పరిహారం అందని రైతులు అని తర్వాత చెప్పారు. అయితే హఠాత్తుగా సీఎం కాన్వాయ్ ను అడ్డుకునేందుకు రావడాన్ని గుర్తించిన పోలీసులు.. వారిని పక్కకు లాగేసి.. కాన్వాయ్ ఆగకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. సీఎం రోడ్డు మార్గంలో పుట్టపర్తి విమానాశ్రయానికి వెళ్లడం అనేది ముందుగా నిర్ణయించిన కార్యక్రమం కానే కాదు. నార్పలలో హెలికాప్టర్ సమస్య గుర్తించిన తర్వాత.. అప్పటికప్పుడు చేసుకున్న ఏర్పాటు. అయితే అంతకంటె వేగంగా సీఎంకు నిరసన తెలియజేయడానికి రైతులు అని చెప్పుకుంటున్న వారు రోడ్డు మీదకు ఎలా రాగలిగారు? రైతులు పొద్దస్తమానమూ టీవీ న్యూస్ చానెల్స్ చూసుకుంటూ కూర్చోరు కద. సీఎం వస్తున్నాడని తెలిసినంత మాత్రాన.. నిమిషాల వ్యవధిలో గుంపుల్ని పోగేసుకుని రోడ్డుమీదకు రావడం, అడ్డుకోవడం రైతులకు సాధ్యమేనా?
ఈ నిరసన అనేది పెద్ద డ్రామా అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతోంది. తెలుగుదేశం లోకల్ లీడర్స్ సీఎం వస్తున్న సంగతి తెలియగానే చాలా షార్ప్ గా రియాక్ట్ అయి, మందిని పోగేసి.. ఈ నిరసనకు ప్లాన్ చేశారని తెలిసిపోతోంది. ఈ షార్ప్ నెస్ ను తెలుగుదేశం ఏదైనా ప్రజలకోసం ఉపయోగపడే ఆలోచన మీద పెడితే బాగుండేది.