బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో నటి రియా చక్రబర్తిపై కొంతమంది తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి, ఆ తర్వాత సుశాంత్ ది హత్య అని కొందరు ఆరోపిస్తున్నారు, మరి కొందరు ఆత్మహత్య అని అంటూ దానికి కారణం, అతడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించింది రియా చక్రబర్తే అంటూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇందులో నిజానిజాలు ఏమిటో దర్యాప్తు సంస్థలు తేల్చాలి.
అయితే సోషల్ మీడియా జనాలు మాత్రం తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. వాస్తవాలు తేలకపోయినా రియా చక్రబర్తిని తీవ్రంగా దూషిస్తూ ఉన్నారు. భారత దేశంలో మహిళలు నిందితులుగా నిలిచిన సందర్భాల్లో జనాలు మరింత ఓవర్ గా స్పందించడం అలవాటుగా మారిందనేది వేరే చెప్పనక్కర్లేదు. అదే ఒక హీరో విషయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చి ఉంటే, అతడిని మరీ తీవ్రంగా నిందించరు. అందుకు ఉదాహరణ నిశ్శబ్ద్ హీరోయిన్ జియా ఖాన్ ఆత్మహత్య. ఆ కేసులో ఒక బాలీవుడ్ యువ నటుడు పేరు వినిపించినా.. అతడి మీద మరీ ఈ స్థాయిలో దుమ్మెత్తి పోయలేదు. అయితే రియా ను మాత్రం తీవ్రంగా కార్నర్ చేస్తున్నారు.
ఒకవేళ ఆమెది తప్పు ఉంటే అందుకు శిక్ష ఏమిటో న్యాయస్థానం నిర్ణయిస్తుంది. అయితే జనాలకు సహజంగానే హీరోయిన్లపై, అమ్మాయిలపై ఉన్న చులకన భావాలనంతా రియా మీద రుద్దుతున్నారని మాత్రం స్పష్టం అవుతోంది.
ఇలాంటి నేపథ్యంలో రియా తరఫున గళం విప్పాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒక టీవీ చానల్ తో ఆయన మాట్లాడుతూ… రియాను విలన్ ను చేసి వెంటాడుతున్నారని వ్యాఖ్యానించారు. రియాను దోషిగా తేల్చేసి మాట్లాడుతున్న చాలా మందికి అక్కడ ఏం జరిగిందో కూడా తెలియకపోవచ్చని, ఏదో దొరికింది కదా.. అని నోరు పారేసుకునే వాళ్లే ఎక్కువని ఆర్జీవీ విశ్లేషించాడు. మీడియా అయితేనేం సోషల్ మీడియా అయితేనేం.. రియాను మానసికంగా వేధిస్తూ ఉందని, ఆమె ఏదైతే సుశాంత్ కు చేసిందని వీరు ఆరోపిస్తున్నారో, ఇప్పుడు వీరు చేసేది కూడా అలానే ఉందని ఆర్జీవీ విశ్లేషించారు.