చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్న ఏపీ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారు రామచంద్రమూర్తి ఎట్టకేలకు ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తన సలహాదారి…రాజీనామానే అని ఆయన నిర్ణయానికి ఎప్పుడో వచ్చారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అధికారికంగా తన పదవికి మంగళవారం ఆయన రాజీనామా చేసి…సంబంధిత లేఖను ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లంకు అందజేశారు.
వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ఆయన పేర్కొనడం గమనార్హం. తెలుగు జర్నలిజంలో సంపాదకుడిగా ఆయన పేరెన్నికగన్న వ్యక్తి. ప్రస్తుతం ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్గా తప్పుకున్న తర్వాత…ఆ పదవిలో రామచంద్రమూర్తి కొనసాగారు. సార్వత్రిక ఎన్నికల సమయానికి ఆయన సాక్షిలో క్రియాశీలక పోస్టులో ఉన్నారు.
ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారుడిగా కేబినెట్ హోదా పదవిని దక్కించుకున్నారు. మొత్తం 33 మంది జగన్ సర్కార్కు సలహాదారులున్నారు. వీరిలో పది మంది కేబినెట్ హోదా దక్కించుకున్న సలహాదారుల్లో రామచంద్రమూర్తి ఒకరు.
మీడియా తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తీసుకునే నిమిత్తం జగన్ సర్కార్ తీసుకొచ్చిన చట్టాన్ని రామచంద్రమూర్తి సమర్థించడంపై అప్పట్లో వివాదాస్పదమైంది. రామచంద్రమూర్తి నిర్ణయాన్ని తప్పు పడుతూ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన కొత్త పలుకులో వ్యాఖ్యానించడం, దానిపై రామచంద్రమూర్తి ఘాటుగా లేఖ రాయడం తెలిసిందే. కౌంటర్, ఎన్కౌంటర్లతో రెండుమూడు రోజులు మీడియాలో వాళ్లిద్దరి లేఖాస్త్రాలు చర్చనీయాంశమయ్యాయి.
కాగా తన సలహాలు ప్రభుత్వానికి అవసరం లేదనే భావనలో చాలా రోజులుగా రామచంద్రమూర్తి ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చివరికి నేటికి ప్రభుత్వంలో తన సలహాల ప్రస్థానానికి ఆయన ముగింపు పలికారు.