పది మంది ప్రాణాలను బుగ్గిపాలు చేసిన విజయవాడలోని స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద వ్యవహారంలో రమేశ్ ఆస్పత్రి ఎండీ, చైర్మన్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అగ్ని ప్రమాదానికి సంబంధించి తమపై నమోదైన కేసు కొట్టి వేయాలని కోరుతూ రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఆస్పత్రి ఎండీ రమేశ్‌బాబు, సీతారామ్మోహన్‌రావు వేర్వేరుగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు.
స్వర్ణ ప్యాలెస్‌లో రమేశ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో కోవిడ్ సెంటర్ నిర్వహించారు. ఈ నెల 9న జరిగిన అగ్ని ప్రమాదంలో పది మంది మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రభుత్వం విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది. అలాగే రమేశ్ ఆస్పత్రికి కోవిడ్ కేర్ సెంటర్ అనుమతులు రద్దు చేసింది. ఆస్పత్రి ఎండీ డాక్టర్ రమేశ్‌బాబుతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. తమపై కేసులు కొట్టి వేయాలని డాక్టర్ రమేశ్‌బాబు, ఇతర నిందితులు హైకోర్టును ఆశ్రయించారు.
విచారణలో భాగంగా హైకోర్టు స్పందిస్తూ అనుమతులిచ్చిన అధికారులు కూడా ప్రమాదానికి బాధ్యులే కదా అని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందన్నారు. ఇరు వైపు వాదనలు విన్న అనంతరం డాక్టర్ రమేశ్‌బాబు, సీతారామ్మోహన్‌రావుపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనలో పిటిషన్‌దారులకు తాత్కాలికంగానైనా తాము కోరుకున్నట్టు న్యాయం జరిగినట్టైంది.