ఎన్నో అవమానాలు భరించానని లేడీ కమెడియన్ నూర్ ఇబ్రహీం నస్రీన్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలాసార్లు తాను ఒత్తిళ్లకు గురైనట్టు వాపోయారు. ‘పాట్రియాట్ యాక్ట్ విత్ హసన్ మిన్హాజ్’ అనేది అమెరికన్ కామెడీ, వెబ్ టెలివిజన్ షో. ఈ షో చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలకు వ్యంగ్యాన్ని జోడించి జనాల ముందు ప్రదర్శిస్తారు.
అనేక కారణాల వల్ల ప్రస్తుతం ఈ షో తాత్కాలికంగా నిలిపివేశారు. షో మాజీ నిర్మాత, కమెడియన్ నూర్ ఇబ్రహీం నస్రీన్ తనకు జరిగిన అవమానాల గురించి సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ షో నిర్వాహకులు విషపూరిత ఆలోచనలతో వర్క్ కల్చర్‌ను భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూర్ వరుస ట్వీట్లు చేశారు.
‘ఈ షోలో పని చేస్తూ ఎన్నో అవమానాలు పొందాను. చాలా సార్లు నన్ను టార్గెట్ చేశారు. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగానే విస్మరించే వారు. వీరు షోలో చూపించే నీతిని నిజంగా పాటిస్తే చాల బాగుండేది. చాలా మంది నన్ను ఈ షో గురించి మాట్లా డమని ప్రాథేయపడేవారు. కానీ నేను తప్పించుకునేదాన్ని. ఎందుకంటే మాట్లాడితే నిజాలే మాట్లాడాలి కాబట్టి. చాలా సార్లు డిప్రెషన్‌కు గురయ్యాను ’ అన్నారు నూర్.
ఇంకో ట్వీట్‌లో కూడా నూర్ తన ఆవేదన, ఆగ్రహానికి చోటు కల్పించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే… ‘కొందరు మహిళలు నాకంటే ధైర్యవంతులు. వారు దీని గురించి చర్చించారు. నా పని పట్ల నేను చాలా గర్వంగా ఫీలవుతాను. నాకు లభించిన అవకాశాలకు నేను ధన్యవాదాలు తెలుపుతాను. అయితే గత కొద్ది నెలలుగా నేను అనుభవిస్తున్న మానసిక వేదనతో పోల్చితే.. ఇది అంత విలువైనదేం కాదని అర్థమవుతోంది. నిజంగానే మనకు ఓ దేశ భక్తి చట్టం ఉండాలని.. ఈ షో చూపించిన దానిని వారు నిజంగా పాటించాలని కోరుకుంటున్నారు. అప్పుడే వారు ప్రేక్షకుల ప్రేమకు అర్హులు’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్లు వైరల్ అయ్యాయి. షోలో చూపించే నీతిని నిజంగా పాటిస్తే చాలా బాగుండేదని చెప్పడం ద్వారా…వాస్తవ పరిస్థితిని తన ట్వీట్లతో ఆమె ప్రతిబింబించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రియల్‌కు, రీల్‌కు మధ్య ఉన్న ఈ తేడానే మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుందనేందుకు ఈ ఎపిసోడే నిదర్శనం.