చంద్రబాబుకి మరోసారి చాకిరేవు పెట్టారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధినేత కాదని ఆయన ప్రస్తుతం కమ్మ సంఘానికి అధ్యక్షుడు అని విమర్శించారు. రమేష్ హాస్పిటల్స్ ఘటనలో బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం నాని ఈ వ్యాఖ్యలు చేశారు.
రమేష్ హాస్పిటల్స్ యజమాని డాక్టర్ రమేష్ బాబుని కాపాడేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, గతంలో తనకి చందాలు ఇచ్చినవారికి ఆయన వత్తాసు పలుకుతున్నారని అన్నారు. రమేష్ ని కాపాడేందుకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కొంతమంది పెద్దలు పనిచేస్తున్నారని, పోలీసులకు చిక్కకుండా పారిపోయిన ఆయనకు ఓ మాజీ ముఖ్యమంత్రి ఆశ్రయం ఇచ్చారని చెప్పారు.
గతంలో విశాఖ దుర్ఘటన సమయంలో విదేశీ కంపెనీ వ్యక్తులు గ్యాస్ లీక్ చేశారని, వారిని అరెస్ట్ చేయాలని గింజుకున్న బాబుకి రమేష్ హాస్పిటల్స్ వ్యవహారంలో ఎందుకు నోరు పడిపోయిందని నిలదీశారు నాని. బాబు సలహాలు వినే ఆయన ఎంక్వయిరీకి రాకుండా పారిపోయారన్నారు. అల్జీమర్స్ వల్ల చంద్రబాబుకి మైండ్ దొబ్బిందని అన్నారు.
మిగతా వారి విషయంలో నానా యాగీ చేసే బాబు.. కమ్మవారిని మాత్రం వెనకేసుకు రావడం సరికాదన్నారు. తప్పు చేసినవారెవరైనా శిక్ష అనుభవించాలన్నారు. చంద్రబాబు కాపలా కాసినా రమేష్ బాబుని ప్రభుత్వం అరెస్ట్ చేసి తీరుతుందని ప్రకటించారు కొడాలి.
కరోనా వస్తుందన్న భయంతో కనీసం బాధితుల్ని పరామర్శించేందుకు కూడా రాకుండా చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు నాని. గతంలో అనేక మంది సినిమా వాళ్లని చంద్రబాబు వాడుకుని వదిలేశారని, ఆయన మాయమాటలు రామ్ వినకుండా ఉంటే మంచిదని సలహా ఇచ్చారు.
కేవలం కమ్మవారి గురించి మాత్రమే కలవరిస్తూ.. అందులోనూ తనకి చందాలిచ్చిన కమ్మవారిని మాత్రమే సపోర్ట్ చేస్తూ కమ్మసంఘం అధ్యక్షుడిగా బాబు మారిపోయారని అన్నారు కొడాల నాని.