దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయనేది పాత సామెత. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) పాతివ్రత్యపు ట్వీట్లు చేస్తున్నారనేది కొత్త సామెత. సినిమా టికెట్ల ధరలకు సంబంధించి వర్మ గొప్ప లాజిక్ తీసి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారని ఎల్లో మీడియా గత కొన్ని రోజులుగా ఊదర గొడుతున్న సంగతి తెలిసిందే.
తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడనే సామెత చందాన….వర్మను సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది. సినిమా చూసేందుకు ఎంత ధరైనా చెల్లించి టికెట్ కొనేందుకు ప్రేక్షకుడికి లేని ఇబ్బంది ప్రభుత్వానికి ఎందుకంటూ రామ్‌గోపాల్ వర్మ చేస్తున్న వాదనను ఓ పెద్ద లాజిక్‌గా చిత్రీకరించడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వర్మ వాదనపై నెటిజన్లు, సోషల్ మీడియా యాక్టివిస్టులు తమదైన సృజనాత్మక కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు.
టికెట్ రేట్లు పెంచేవాడికి ప్రేక్షకుడికి ఇబ్బంది లేనప్పుడు ప్రభుత్వానికి ఏంటి నొప్పి? అని వర్మ సంధించిన ప్రశ్నకు నెటిజన్ల సమాధానం ఏంటంటే…విటుడికి, వేశ్యకు ఇబ్బంది లేనప్పుడు పోలీసులకు ఏంటి నొప్పి? అని దెప్పి పొడిచారు. అలాగే లంచం ఇచ్చేవాడికి, పుచ్చుకునే వాడికి ఇబ్బంది లేనప్పుడు ఏసీబీకి ఏంటి నొప్పి?, బ్లూఫిల్మ్ తీసేవాడికి, చూసేవాడికి ఇబ్బంది లేనప్పుడు సెన్సార్ వాళ్లకి ఏంటి నొప్పి? అని సోషల్ మీడియా యాక్టివిస్టులు తమదైన శైలిలో వర్మను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు.
ఈ పోస్టులు వర్మను ఇరిటేట్ చేశాయి. వర్మ ఎంతగా అసహనానికి గురి అయ్యారో తాజాగా ఆయన చేసిన ట్వీటే చెబుతోంది. “ఒరేయ్ సుబ్బారావుల్లారా అడిగిన క్వశ్చన్ లీగల్ జ్యూరిస్ట్రిక్షన్‌లో ఉంది. మీరిచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ క్రిమినల్ యాస్పెక్ట్స్లో ఉన్నాయి” అని వర్మ ట్వీట్ చేశారు.
వర్మ చెబుతున్నట్టగా క్రిమినల్ యాస్పెక్ట్స్ గురించి చూసుకోడానికి న్యాయస్థానాలు, చట్టాలున్నాయి. అలాగని చర్యకు ప్రతిచర్య ఉండదని వర్మ ఎలా భావించారో! దీటైన జవాబివ్వడానికి ప్రభుత్వమైతే కొన్ని మర్యాదలు పాటించాల్సి వుంటుంది.
కానీ నెటిజన్లు అలాంటి మర్యాదమన్నన పాటించే ప్రశ్నే వుండదు కదా? ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఒంటబట్టించుకున్నారని అనుకునేందుకు… వర్మకు ఇచ్చిన స్ట్రాంగ్ డోసే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా ఇతరులకు మర్యాద ఇవ్వని ఆర్జీవీ , ఎదుటి వాళ్ల నుంచి దాన్ని కోరుకోవడం విచిత్రమే.