తన అక్కతో కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవకు వివాహేతర సంబంధం ఉందని ఆత్మహత్యకు పాల్పడిన పాల్వంచ నివాసి మండిగ రామకృష్ణ సెల్ఫీ వీడియో సంచలనం సృష్టిస్తోంది. చనిపోవడానికి ముందు ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో రెండు రోజుల క్రితం విడుదలైంది. ఇందులో తన భార్యను వనమా కోరుకున్నాడని, దీన్ని తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చెప్పడం తీవ్ర కలకలం సృష్టించింది.
ఈ నేపథ్యంలో పౌర సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తింది. వనమా రాఘవను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిం చాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వనమా రాఘవను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసింది. అలాగే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ రామకృష్ణ రెండో సెల్ఫీ వీడియో విడుదలైంది. ఇందులో కూడా సంచలన విషయాలున్నాయి. తన తండ్రి చిట్టబ్బాయి నక్సలైట్ల దాడిలో మరణించాడని పేర్కొన్నాడు. ఈ సెల్ఫీ వీడియోలో తన అక్కతో ఎమ్మెల్యే తనయుడికి ఉన్న సంబంధాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఆ వీడియోలో ఏమున్నదంటే…
‘మా నాన్న చిట్టబ్బాయి మోతుగూడెంలో హెల్త్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. 1992 అక్టోబరు 27న ఆఫీసు పనిపై డొంకరాయి గ్రామానికి వెళ్లి వస్తుండగా మోతుగూడెం పోలీసులు రోడ్డుమీద మానాన్న వస్తున్న వాహనం ఆపి లిఫ్ట్ అడిగారు. ఒకేఊరు కావడంతో లిఫ్ట్ ఇవ్వగా పోలీసు వాహనం అనుకుని నక్సలైట్లు బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఈ ఘటనలో మా నాన్న సహా మొత్తం ఆరుగురు చనిపోయారు. ప్రధానంగా నేను ఈ పరిస్థితికి రావడానికి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి కారణం మొదటి సూత్రధారి వనమా రాఘవ. ఆయనకు, మా అక్కతో వివాహేతర సంబంధం ఉంది. గత 20వ సంవత్సరాలుగా ఇది కొనసాగుతోంది. మా అమ్మ కూడా వారికి సహకరిస్తోంది’ అంటూ నాగరామకృష్ణ వాపోయాడు.
వీళ్లిద్దరి వివాహేతర సంబంధం వల్ల ఒక కుటుంబం, వంశం నాశనమయ్యేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వీరిని ఏం చేస్తారో సమాజానికే వదిలేస్తున్నా అని రామకృష్ణ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఎమ్మెల్యే వనమా తనయుడి దాష్టీకానికి రామకృష్ణ, ఆయన భార్య , ఇద్దరు కూతుళ్లు సజీవ దహనం కావడం తెలుగు సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. రోజుకొక సెల్ఫీ వీడియో విడుదలవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తనయుడి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.