Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఓ మహాప్రస్థానం.. తిరుగులేని చరిత్రకు ఏడాది

ఓ మహాప్రస్థానం.. తిరుగులేని చరిత్రకు ఏడాది

బహుశా.. ఆలోచన మొలకెత్తినప్పుడు ఇది ఈ స్థాయికి చేరుకుంటుందని విజయేంద్రప్రసాద్, రాజమౌళి అనుకొని ఉండరు. బహుశా.. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నప్పుడు, ఇది ఇంత పెద్ద మూవీ అవుతుందని చరణ్-తారక్ ఊహించి ఉండరు. బహుశా.. ఈ సినిమాకు సంగీతం మొదలుపెట్టినప్పుడు అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ అందుకుంటానని కీరవాణి అనుకొని ఉండరు. దశాబ్దాలుగా పాటలు రాస్తున్న చంద్రబోస్.. ఈసారి తను రాసిన సాహిత్యానికి అంతర్జాతీయ ఖ్యాతి వస్తుందని ఊహించి ఉండరు.

ఒక చిన్న ఆలోచన.. ఎన్నో మెదళ్లను కదిలించింది.. పెద్ద సినిమా అయింది.. ప్రపంచవ్యాప్తంగా హిట్టయింది.. ఏకంగా ఆస్కార్ అవార్డ్ సైతం అందుకుంది. అదే ఆర్ఆర్ఆర్. ఇవాళ్టికి ఈ సినిమా విడుదలై ఏడాది.

ఐదేళ్ల కిందటి సంగతి..

సినిమా విడుదలై ఏడాది మాత్రమే అయింది. కానీ ఆలోచన మొలకెత్తి ఐదేళ్ల పైమాటే అవుతోంది. బాహుబలి లాంటి పాన్ ఇండియా ఫ్రాంచైజీ తర్వత ఎలాంటి సినిమా చేద్దామని రాజమౌళి ఆలోచిస్తున్న టైమ్ అది. తండ్రి విజయేంద్రప్రసాద్ తో కలిసి ఎడతెరగని చర్చలు సాగిస్తున్న కాలమది. ఆ టైమ్ లో 'స్వతంత్ర' విప్లవకారులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాలు జక్కన్నను ఆకర్షించాయి. వాళ్ల జీవితాల కంటే, ఒకే గమ్యం దిశగా, ఒకే లక్ష్యం కోసం, ఒకే టైమ్ లో పోరాటం సాగిస్తూ కూడా కలవని వాళ్ల ప్రస్థానాలు రాజమౌళిని ఆలోచింపజేశాయి. 

ఇలాంటి రెండు బలమైన శక్తులు స్వతంత్ర పోరాటం టైమ్ లో కలిస్తే ఎలా ఉండేదనే ఆలోచన రాజమౌళిని కదిలించింది. అతడికి నిద్రలేకుండా చేసింది. ఏదో ఒకటి చేయాలంటూ ఊపిరి సలపనివ్వకుండా చేసింది ఈ పాయింట్. అలాంటి భావోద్వేగం కోసమే వెదుకుతున్న రాజమౌళి, పాయింట్ కు ఫిక్స్ అయిపోయాడు. టాలీవుడ్ చరిత్రలో కొత్త అధ్యాయానికి సంబంధించి, కొత్త పేజీ అక్కడే మొదలైంది.

ఎనౌన్స్ మెంట్ తో సంచలనం..

అలా చిన్న ఆలోచనతో మొదలైన ఆర్ఆర్ఆర్ సినిమా, అద్భుతమైన షేప్ తీసుకుంది. తండ్రి, కుటుంబం, రైటింగ్ టీమ్ తో కలిసి ఈ ప్రాజెక్టుకు ఓ తుదిరూపు తీసుకొచ్చాడు రాజమౌళి. అంతా బాగానే ఉంది. ఇందులో హీరో ఎవరు? సరిగ్గా ఇక్కడికొచ్చి ఆగింది సినిమా. ఎందుకుంటే, ఒక హీరో అయితే ఓకే, రాజమౌళి ఎవ్వరినైనా ఒప్పిస్తాడు, జక్కన్న అడిగితే ఎవ్వరూ కాదనరు, అది అతడి స్థాయి. కానీ ఈ సినిమాకు ఇద్దరు హీరోలు కావాలి. పైగా ఒకరు ఫస్ట్ హీరో, మరొకరు సెకెండ్ హీరో అనే టైపు కూడా కాదు. ఇద్దరూ హీరోలే. జగత్ జెట్టీలు, హేమాహేమీలు, కొదమసింహాలు.. ఇలా ఏ పేరైనా పెట్టుకోండి, హీరోలు మాత్రం ఒకరికి ఒకరు తగ్గకూడదు.

ఇలా ఆలోచించిన రాజమౌళికి చరణ్-తారక్ స్నేహం ఆకర్షించింది. ఆన్ స్క్రీన్ పై ఇద్దరి మధ్య పోటీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మెగా వర్సెస్ నందమూరి అంటే ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ తెరవెనక మాత్రం వీళ్లిద్దరూ మంచి స్నేహితులు. ఆ ఫ్రెండ్ షిప్ ను తెరపై చూపించాలనుకున్నాడు రాజమౌళి. అనుకున్నదే తడవుగా ఇద్దర్నీ తన ఇంటికి పిలిపించాడు. ఎవరి పాత్రల్ని వాళ్లకు ఫుల్ నెరేషన్ ఇచ్చాడు. కూర్చోబెట్టి మాట్లాడాడు. సింగిల్ సిట్టింగ్ లో ఇద్దరూ ఓకే చేశారు. అదే టైమ్ లో ముగ్గురూ ఒకరిపై ఒకరు కాళ్లు వేసుకుంటూ దిగిన ఫొటోను మీడియాకు వదిలారు. సినిమాను ఎనౌన్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ అనే హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేశారు. ఆ రోజు నుంచి ఇవాళ్టి వరకు ఈ ఆర్ఆర్ఆర్ ఓ సంచలనం.

ఎన్నో అడ్డంకులు.. మరెన్నో అవరోధాలు

అయితే అప్పటివరకు ఎదుర్కోని ఎన్నో అడ్డంకుల్ని,, అవరోధాల్ని ఆర్ఆర్ఆర్ కోసం ఎదుర్కొన్నాడు రాజమౌళి. ప్రీ-ప్రొడక్షన్ లో అతడు ఎంత కష్టపడాల్సి వచ్చిందో, ఫీల్డ్ లో అంతకు పదింతలు కష్టించాల్సి వచ్చింది. నిర్మాత డీవీవీ దానయ్యను ఒప్పించడంతో ఈ ప్రాజెక్టు కార్యరంగంలోకి దూకింది.

అప్పటికే డీవీవీకి రాజమౌళి కమిట్ మెంట్ ఉంది. డీవీవీ కూడా మెంటల్లీ ఫిక్స్ అయి ఉన్నాడు. బాహుబలి తర్వాత సినిమా కాబట్టి ఆ రేంజ్ లోనే ఖర్చు ఉంటుందని అతడికి తెలుసు. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ అంతకుమించి ఖర్చుపెట్టించింది. ఎనౌన్స్ మెంట్ టైమ్ లో 350 కోట్ల రూపాయలుగా చెప్పిన ఈ సినిమా, రిలీజ్ టైమ్ కు 500 కోట్ల రూపాయలకు చేరుకుంది. అలా ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలిచింది.

బడ్జెట్ సమస్యలతో పాటు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. షూటింగ్ మొదలైంది, మొదటి షెడ్యూల్ లోనే రామ్ చరణ్ గాయపడ్డాడు. కొంతమంది దీన్ని అపశకునం అన్నారు. మరికొంతమంది సినిమా ఆగిపోయిందన్నారు. ఇలాంటివాటిని రాజమౌళి ఖాతరు చేయలేదు. చరణ్ కోలుకున్నంతవరకు వెయిట్ చేశాడు.

అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఊహించని విధంగా కరోనా వచ్చిపడింది. అన్ని సినిమాలతో పాటు ఆర్ఆర్ఆర్ కూడా ఆగిపోయింది. సాధారణ సినిమా ఆగితే ఓకే, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమా ఆగితే ఆ కష్టం, నొప్పి ఎలా ఉంటుందో దానయ్య లాంటి నిర్మాత, రాజమౌళి లాంటి దర్శకుడు మాత్రమే చెప్పగలరు. వేసిన సెట్స్ అన్నీ పాడైపోయాయి. రాసుకున్న షెడ్యూల్స్ అన్నీ చిరిగిపోయాయి. ఇచ్చిన అడ్వాన్సులు బ్లాక్ అయిపోయాయి, ఇవ్వాల్సిన కాల్షీట్లు ఆగిపోయాయి.

రిలీజ్ కష్టాలు.. వివాదాల సుడిగుండాలు..

ఇలా చెప్పుకుంటూపోతే ఒకటి, రెండు కాదు.. అడుగడుగునా రాజమౌళి అండ్ టీమ్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. విదేశీ టెక్నీషియన్లు, ఆర్టిస్టుల్ని ఇండియాకు రప్పించడం, గ్రాఫిక్స్, సెట్ ను మళ్లీ మళ్లీ మార్చడం, కాల్షీట్లు సమన్వయం చేసుకోవడం.. ఇలా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంది ఆర్అర్ఆర్ యూనిట్. చివరికి విడుదల టైమ్ లో కూడా ఈ సినిమాను కష్టాలు వీడలేదు.

ముందుగా ఈ సినిమాను 2020, జులై 30న విడుదల చేయాలనుకున్నారు. ఇక అక్కడ్నుంచి పలుమార్లు ఈ సినిమా వాయిదా పడుతూనే ఉంది. మధ్యలో 2 సంక్రాంతులు కూడా మిస్సయ్యాయి. ఎట్టకేలకు 2022, మార్చి 25న ఆర్అర్ఆర్ సినిమా థియేటర్లలోకి వచ్చింది.

విమర్శలకు ఎదురెళ్లి.. ఆస్కార్ అందుకొని..

థియేటర్లలోకి వచ్చిన వెంటనే ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టలేదు. బాహుబలి టైపులో ఏకగ్రీవ స్పందన రాలేదు. సినిమాలో ఎమోషన్ క్యారీ అవ్వలేదన్నారు కొందరు. మరికొందరికి సినిమా ఎత్తుగడ నచ్చలేదు. చరణ్ ఫ్యాన్స్ తారక్ కు ఎలివేషన్లు ఎక్కువయ్యాయన్నారు, తారక్ ఫ్యాన్స్ చరణ్ కు ఎక్కువ స్కోప్ ఇచ్చారని విమర్శించారు. వీటికి అదనంగా టికెట్ రేట్లు భారీగా పెంచి దండుకున్నారనే అపవాదు కూడా ఒకటి.

ఇలా ఎన్నో విమర్శలు, ఆరోపణల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది. విడుదలైన అన్ని సెంటర్లలో ఘనవిజయం సాధించింది. పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్టయిన ఈ సినిమా, విదేశాల్లో కూడా అదే స్థాయి ఫలితాన్ని అందుకుంది.

ఆస్కార్ వేదికపై తొలి తెలుగు సినిమా

ఇక అంతిమ ఘట్టంగా ఆస్కార్ సంరంభంలోకి ఎంటరైంది ఈ సినిమా. ఈ మూవీకి ఆస్కార్ బరిలో అధికారిక ఎంట్రీ దక్కలేదు. మళ్లీ అక్కడ కూడా ఆర్ఆర్ఆర్ పై ఎన్నో విమర్శలు, కథనాలు పుట్టుకొచ్చాయి. ఆస్కార్ కు వెళ్లేంత సీన్ ఆర్ఆర్ఆర్ లో ఏముందన్నారు కొందరు. రాజమౌళి టీమ్ మాత్రం తమ ప్రాడెక్ట్ ను నమ్మింది. మరింత ఖర్చుపెట్టి గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ రేసులోకి ఎంటరైంది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం లాంటి కీలకమైన విభాగాల్లో ఈ సినిమాకు అవార్డ్ రాకపోయినా.. నాటు-నాటు పాటతో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కించుకుంది ఆర్ఆర్ఆర్ మూవీ.

ఇప్పటికీ ప్రపంచంలో ఏదో ఒక మూల ఈ సినిమా ఇంకా థియేటర్లలో నడుస్తూనే ఉంది. ఆస్కార్ అవార్డ్ కంటే, ఏడాది గడిచినా ఇంకా తమ సినిమా ఏదో ఒక మూల థియేటర్లలో నడవడం అతిపెద్ద అవార్డ్ అంటోంది యూనిట్. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?