ఎన్నికల షెడ్యూల్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నా.. కర్నాటక కాంగ్రెస్ ఇప్పటినుండే ఎన్నికలకు సిద్దమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో దిగబోయే 124 మంది అభ్యర్ధుల పేర్లతో మొదటి జాబితాను విడుదల చేశారు. ఈ తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్య, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేర్లు ఉన్నాయి.
కాగా ఈ సారి సిద్ధరామయ్య వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మైసూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన వరుణ నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం వరుణ నియోజకవర్గంలో ఆయన కుమారుడు డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో వరుణ నుంచి సిద్ధరామయ్య రెండుసార్లు గెలిచారు. 2013లో ఆ స్థానం నుంచే గెలిచి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.
కాగా డీకే శివకుమార్ కనకపుర స్థానం నుంచి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే.. చీతాపూర్ నుంచి, మాజీ ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర కోరటగెరె స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్లు పార్టీ ప్రకటించింది. బీజేపీతో మైండ్ గేమ్ మొదలు పెట్టిన కాంగ్రెస్ ఇంకా షెడ్యూల్ రాకుండానే అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది.
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువుకన్నా ముందే ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. బీజేపీ రెబెల్స్ బెడదను ఎదుర్కొంటున్నది.