శుక్రవారప్పేట పోలీసు స్టేషన్ ఎస్సయి మురారి ఎదురుగా ఉన్న జంట కేసి దీర్ఘంగా చూశాడు. ఇంట్లోంచి పారిపోయి వచ్చిన అబ్బాయి, అమ్మాయి అతన్ని బతిమాలుతున్నారు. ‘మీరే మా పెళ్లి చేయాలి సార్, ఆర్యసమాజంలో పెళ్లి చేసుకుని కాపురం పెడితే అమ్మాయిని కిడ్నాప్ చేశాడంటూ నా మీద కేసు పెడుతున్నారు. మీరే పెళ్లయిందని సర్టిఫై చేస్తే యిక కేసుల భయం ఉండదు.’ అన్నాడా అబ్బాయి. ‘ఔనంకుల్, ఇక్కడ చేసుకుంటే టీవీ వాళ్లు లైవ్ కవరేజి యిస్తారు. ఇద్దరం యిష్టపడి పెళ్లి చేసుకున్నామని అందరికీ చాటి చెప్పినట్లవుతుంది. అమ్మానాన్నా ఏమీ చేయలేరు. మీరే కాస్త పెద్ద మనసు చేసుకుని ఆ ఏర్పాట్లు చేస్తే…’ అని ప్రాధేయపడుతోంది ఆ అమ్మాయి. ‘రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోవడం ధర్మం. దానికి ముందుగా నోటీసు..’ అని మురారి ఏదో అంటూంటే ‘మీరు తల్చుకోవాలే కానీ అవన్నీ చిటికలో ఏర్పాటు చేయగలరు సార్. అయినా మారేజి సర్టిఫికెట్టుకి యిప్పుడు అర్జన్సీ ఏమీ లేదు. పెళ్లయిపోయిందని మీరు డిక్లేర్ చేస్తే చాలు, ఎవరూ మా జోలికి రారు.’ అన్నాడు అబ్బాయి.
మురారికి పబ్లిసిటీ పిచ్చి ఉందని ఆ జంటకు తెలిసే యిక్కడకు వచ్చారు. ఈవ్ టీజర్లకు పాఠాలు చెప్పి, తాగుబోతులకు కౌన్సిలింగు యిచ్చి, ఆడపిల్లలకు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో కోచింగ్ క్లాసెస్ ఏర్పాటు చేసి మీడియాలో బాగా కవరేజి వచ్చేట్లు చేసుకుంటాడతను. టీవీ కెమెరామెన్ అతనెప్పుడు పిలుస్తాడాని చూస్తూంటారు. సంఘాన్ని సంస్కరించడంలో తనెంత కష్టపడుతున్నాడో మురారి మైకుల ముందు చక్కగా మాట్లాడగలడు. చివర్లో పోలీసులంటే లోకకళ్యాణం కోసమే ఉన్నారు, నా పైఅధికారుల ఆశీస్సులతోనే యివన్నీ చేస్తున్నా అంటూ ముగించి, వాళ్లకూ పొడి వేస్తుంటాడు. ‘లోకకళ్యాణం అని మీరే అంటూంటారు కదా అంకుల్, మేమూ లోకులమే, మాకు కళ్యాణం చేసిపెట్టండి’ అని అడిగింది అమ్మాయి. ఓ పావుగంట పోయాక మురారి పెళ్లి చేయించడానికి నిశ్చయించుకున్నాడు. సాక్షులుగా పోలీసుద్యోగులను కాకుండా వేరే వార్ని పెడితే మంచిదనిపించింది. కోర్టులో తమ తరఫు దొంగ సాక్ష్యాలు చెప్పేవాడొకడు తయారుగా ఉన్నాడు. రెండోవారు ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తూండగా స్టేషన్‌కు దగ్గర్లోనే నివాసముండే పేరిందేవి గారు గుర్తుకు వచ్చారు.
మురారి పబ్లిసిటీ పిచ్చి పేరిందేవి పిచ్చి ముందు ఏ కోశానా పోలదు. ప్రజాసమస్యలపై గొంతెత్తున్నానంటూ రోడ్డుపై గుంతల దగ్గర్నుంచి పనివాళ్ల నాగాల దాకా, ఊరకుక్కల అర్ధరాత్రి అరుపుల దగ్గర్నుంచి ప్రేమికుల హద్దుల దాకా అన్నిటిపైన ఆవిడ టీవీ చర్చల్లో పాల్గొంటుంది. కాఫీ, టిఫెన్లు, ఒక్కోపుడు భోజనాలతో ప్రెస్ మీట్లు పెట్టి స్టేటుమెంట్లు గుప్పిస్తూ ఉంటుంది. కలిగిన కుటుంబమే, పిల్లలు ఫారిన్లో సెటిలయ్యారు. భర్త ఎందుకొచ్చిన గొడవిది అని విసుక్కుంటాడు తప్ప డబ్బు ఖర్చు పనులెందుకు అంటూ అడ్డుపడడు. పేరిందేవి గారికి ఫోన్ చేసి విషయం చెప్పి యింటికి కానిస్టేబుల్‌ను పంపి, సగౌరవంగా స్టేషన్‌కి రప్పించాడు మురారి. ఈలోగా స్టేషన్ అలంకరణ పూర్తయింది. మీడియా కూడా వచ్చి వెయిట్ చేస్తోంది. పెళ్లి జరిగిపోయింది. అబ్బాయి, అమ్మాయి తాము మేజర్లమని, తమ యిష్టప్రకారమే పెళ్లాడుతున్నామని, మురారి, పేరిందేవి గార్ల అండదండలు తమకున్నాయని, ప్రపంచంలో ఏ శక్తీ తమను విడదీయలేదని ఉద్ఘాటించారు. ప్రేమ వివాహాల ఉత్కృష్టతను పొగుడుతూ, పెద్దల ఛాందసాన్ని తెగుడుతూ పేరిందేవి అద్భుతంగా ప్రసంగించారు. ఇలాటి వివాహాలకు తమ స్టేషన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మురారి ప్రకటించాడు.
ఆ తర్వాత నుంచి నెలకు రెండు, మూడు వివాహాలు అక్కడ జరగసాగాయి. యువతీయువకుల్లో మురారి పేరు మారుమ్రోగింది. పేరిందేవి పెద్దదిక్కయింది. ఇలాటి పెళ్లికి కావలసిన సరంజామా సమకూర్చడంలో స్టేషన్ సిబ్బందికి నేర్పు, వేగం పెరిగాయి. అరగంట ముందు తెలియ పరిచినా ఆశీర్వచన మంత్రం చదివి అక్షింతలు వేసే బ్రాహ్మడి దగ్గర్నుంచి ఏర్పాటు చేయగల సామర్థ్యం ఆ స్టేషన్ సంతరించుకుంది. ఎన్ని సార్లు టీవీలో కనబడినా పోలీసు వాళ్లకి అదే యూనిఫాం కానీ, పేరిందేవి మాటిమాటికీ అవే చీరల్లో కనబడలేదు కదా. పైగా అమెరికాలో ఉన్న కూతురు ఫోన్ చేసి చివాట్లు పెడుతోంది. గంధపు రంగు చీర మూడు నెలల్లో రెండుసార్లు కట్టావు, ఇక్కడ నా పేరు పోయేట్టుంది అని. దాంతో చీరలపై ఆవిడ ఖర్చు పెరిగింది. కానీ ఆడవాళ్ల ఎటెన్షన్ ఆవిడపై బాగా పడింది. వచ్చేసారి ఏం కట్టుకొస్తుందాని ఆసక్తిగా ఎదురు చూడసాగారు.
ఇదంతా చూసి యీవిడ స్నేహితురాలు ఒకావిడ తనను రెండో సాక్షిగా తీసుకుపోమని కోరింది. పోనీ కదాని తీసుకెళితే కెమెరాల ముందు యీవిడ కంటె పొడుగు స్పీచి దంచింది. ఆవిడ యీవిడ కంటె వయసు చిన్నదని, టీవీల వాళ్లు ఆవిడకు ఎక్కువ కవరేజి యిచ్చారు. దాంతో యీవిడకు ఒళ్లు మండిపోయి, తడవకు ఒకర్ని, సాధ్యమైనంత వరకు మగాళ్లని తీసుకెళ్లడం మొదలెట్టింది. ఆ కారణంగానే పోలీసు పెళ్లిళ్లంటే పేరిందేవి పేరే గుర్తుకు వచ్చేది. ఆవిడ పేరు కూడా నప్పడంతో అందరూ పెళ్లిపెద్ద పేరిందేవి అనసాగారు. దాంతో ఆవిడ యూట్యూబు ఛానెలోటి పెట్టి తను చేయించిన పెళ్లిళ్ల వీడియోలు పెట్టసాగింది. పోలీసు స్టేషన్లో ఓ బోర్డు పెట్టించి, అక్కడ వధూవరులతో తన ఫోటోలన్నీ పెట్టించింది. ఫోటోల్లో తను కూడా ఉన్నాడు కాబట్టి మురారి పెట్టనిచ్చాడు. కొన్ని మామూలు టీవీ ఛానెళ్లు, కొన్ని యూట్యూబు ఛానెళ్లు ఆవిణ్ని యింటర్వ్యూలు చేశాయి. కొన్ని దినపత్రికలు తమ ఫ్యామిలీ సెక్షన్లో ఆవిడ గురించి వ్యాసాలు రాశాయి. ప్రేమికుల పెద్దదిక్కు అనే బిరుదూ యిచ్చిందో పత్రిక.
మొట్టమొదటి పెళ్లి చేయించి ఏడాది కావస్తున్న సందర్భంగా ఓ పత్రిక ఆదివారం మ్యాగజైన్ ఆమెపై కవర్ స్టోరీ తయారు చేస్తూండగా ఆవిడకు గట్టి దెబ్బ తగిలింది. మూణ్నెళ్ల క్రితం ఆవిడ అరుంధతి అనే అమ్మాయి పెళ్లి జరిపించింది. రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి సర్టిఫికెట్ వచ్చేదాకా ఆ అమ్మాయి కాపురానికి రానంటూ ఫ్రెండ్ రూములో ఉంది. ఈలోగా ఆ అబ్బాయి ఉద్యోగం విషయంలో అబద్ధం చెప్పాడని తేలింది. ఈ అమ్మాయి ఫ్రెండ్స్ వెళ్లి నిలదీయడంతో అతను ముంబయి పారిపోయాడు. వీళ్లంతా వెళ్లి ముంబయి వెతికినా దొరకలేదు. అట్నుంచటే దుబాయి వెళ్లిపోయాడేమో అని సందేహం వెలిబుచ్చారు కొందరు. దగ్గరుండి వీళ్ల ప్రేమను ప్రోత్సహించి, పెళ్లి దాకా తీసుకొచ్చిన వారందరూ మొహం చాటేశారు. ‘ఇవన్నీ ముందే జాగ్రత్తగా కనుక్కోవలసినది’ అంటూ అరుంధతిని తప్పు పట్టారు. దాంతో ఉవ్వెత్తున కోపం వచ్చిన అరుంధతి తనకు ఆశ్రయం యిచ్చిన ఫ్రెండును కూడా తిట్టిపోసింది. ఆ అమ్మాయి రూములోంచి పొమ్మంది. గత్యంతరం లేక అరుంధతి యింటికి చేరి భోరుమంది.
వాళ్ల నాన్న ఉగ్రనారాయణ నెత్తి బాదుకున్నాడు. ఈ పెళ్లి విషయం చెప్పకుండా మరో పెళ్లి సంబంధం చూద్దామంటే కుదరటం లేదు. పేరిందేవి పబ్లిసిటీ ధర్మమాని అందరికీ తెలిసిపోయింది. అమ్మాయి ఫోటో చూడగానే ఎక్కడో చూసినట్లుంది అనడం, రెండు రోజుల తర్వాత పేరిందేవి గారి కేసు కదండీ, ఆ అబ్బాయి ఏమయ్యాడని అడగడం జరగసాగింది. కాదని బుకాయించడానికి వీలు లేకుండా యూట్యూబు, వాట్సాప్ సాక్ష్యాలున్నాయి కానీ సంసారం జరగలేదన్న దానికి సాక్ష్యాలు లేకపోవడంతో ఏం జరిగిందో ఎవరి పాటికి వాళ్లు ఊహించుకో సాగారు. పెళ్లి జరుగుతుందన్న నమ్మకం సన్నగిల్లడంతో ముద్దూ ముచ్చటా లేకుండా కూతురి జీవితం తెల్లారిపోతోందని తల్లి జబ్బు పడింది. ఇదంతా ఉగ్రనారాయణకు పిచ్చెక్కించింది. ఆ పిచ్చికోపం పేరిందేవి మీదకు మళ్లింది. తెలిసీతెలియక చిన్నపిల్ల అమ్మానాన్నలకు చెప్పకుండా పెళ్లి చేసుకొంటానంటే మందలించి పంపక తన పబ్లిసిటీ కోసం ఎగదోయడమేమిటని ఆయన ఆక్రోశం. కప్పిపుచ్చుదామంటే వీల్లేకుండా పెళ్లి ఫోటోలు ఆవిడ అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ పోస్టు చేసి పంపించేసింది.
అమ్మాయిని మోసగించినవాడు దొరకలేదు కానీ పేరిందేవి మాత్రం ఊళ్లో దొరికింది. ఈ మధ్యే ఓ ఆఫీసు కూడా పెట్టి రహస్యవివాహం ఎలా చేసుకోవాలో, అమ్మానాన్నలను ఎలా ఏమార్చాలో కౌన్సిలింగులు కూడా యిస్తోంది. వెళ్లి విరుచుకు పడ్డాడు. ‘‘నువ్వు దగ్గరుండి చేయించిన పెళ్లి విఫలమైంది. ఆ దొంగ వెధవ పారిపోయాడు. నువ్వు బాధ్యత వహిస్తావా?’’ అని అరిచాడు. ‘‘బాగుంది. నాదేం బాధ్యత? అవన్నీ అమ్మాయి, అబ్బాయి జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి చెడిపోతే విందుకొచ్చిన వాళ్లను తప్పు పడతారా?’’ అని వాదించింది పేరిందేవి. ‘‘అతిథులకూ, నీకూ తేడా లేదా? అవేళ టీవీల్లో ఏం చెప్పావ్? తల్లి లాటి దాన్నన్నావు. మరోటన్నావ్. అసలు తలిదండ్రులం అమ్మాయి యింకా యింటికి రాలేదు, ఎక్కడకు పోయిందో తెలియక యింట్లో కూర్చుని ఏడుస్తున్నాం. మరో పక్క నువ్వు కెమెరాల ముందు పెద్దదిక్కు పాత్ర అమోఘంగా పోషించేస్తున్నావు…’’
పేరిందేవికి గుక్క తిరగలేదు. ‘‘బాగుంది, శుభమాని పెళ్లి చేసుకుంటామంటే మీ చావు మీరు చావండని వదిలేస్తామా? నాలుగు అక్షింతలు వేసి మా ఆశీస్సులు మీకున్నాయి అంటాం. వయసులో పెద్దదాన్ని కాబట్టి తల్లి లాటిదాన్ని అన్నాను.’’ ‘‘తల్లి స్థానమంటే అప్పనంగా వస్తుందా? మా అమ్మాయి యిప్పుడు డిప్రెషన్‌తో ఉద్యోగం మానేసింది. రా, వచ్చి పోషించు. మళ్లీ పెళ్లి చేయి. పెళ్లికొడుకు ఎవర్నయినా వెతుకు.’’ అన్నాడాయన ఉగ్రంగా. ‘‘బాగుందయ్యోయ్, నేనేమీ మారేజీ బ్యూరో నడపటం లేదు. మీరే వెతుక్కోవాలి. ఈ సారైనా మంచివాణ్ని వెతుక్కో.’’ అని ఎగిరింది పేరిందేవి. ‘‘ఈసారైనా.. అంటావేమిటి? కితంసారి వాణ్ని మేం సెలక్టు చేశామా? నువ్వేగా వాణ్ని ఇంద్రుడు, చంద్రుడు, అదేమిటబ్బా.. ఆధునిక యువతరానికి ప్రతినిథి అంటూ ఆకాశానికి ఎత్తేసింది.’’ అంటూ దులిపేశాడు.
పేరిందేవి తగ్గింది. ‘‘మీ అమ్మాయి మంచివాడంది, కాబోసనుకున్నాను. నాకేం తెలుసు, వీడిలా తేలతాడని. అయిందేదో అయింది. మంచి కుర్రవాడెవరైనా మా సర్కిల్స్‌లో తగిలితే తప్పకుండా సంబంధం చెప్తా. ఓర్పుగా ఉంటేనే పనులవుతాయి. మీ కోపతాపాలు చూసి భయపడే మీ అమ్మాయి తను వరించినవాణ్ని మీ దగ్గరకు తీసుకు రాలేదు. లేకపోతే వాడెలాటివాడో మీరప్పుడే కనిపెట్టేసేవారు.’’ అని ఉబ్బేసి, శాంతపరిచి పంపేసింది. ఆయన తలూపాడు కానీ ‘‘వచ్చే వారం మళ్లీ వస్తా. దాని పోషణభారం సంగతి కూడా మీరు ఆలోచించాలి.’’ అని యీవిడ నెత్తిన ఓ బండరాయి పెట్టి వెళ్లాడు.
దీన్ని గట్టి దెబ్బ అనుకోవడానికి కారణమేమిటంటే, యింతకు ముందే చిన్నాచితకా దెబ్బలు తగిలాయి. తను చేయించిన పెళ్లిళ్ల తాలూకు మొగుడూపెళ్లాలు కొట్టుకున్నపుడు తగవు తీర్చమంటూ వాళ్లు యీవిడ దగ్గరకు వచ్చేవారు. నా దగ్గర కెందుకు అని యీవిడంటే, ‘ఈ పెళ్లి కారణంగా మా వాళ్లు దూరమై పోయారు. ఫోన్ చేసి మా ఆయన పట్టించుకోటం లేడు, మా ఆవిడ మాట వినటం లేదు అని చెప్పుకోబోతే, మీ కొత్త తల్లి ఉందిగా, మీతో ఫోటోలు దిగి పంచిపెడుతోందిగా, ఆవిడ దగ్గరకే వెళ్లండి, లేకపోతే ఆ ఎస్సయి మురారి దగ్గరకు వెళ్లండి అంటున్నారండి. మురారి ఐతే ఎటూ వినకుండా యిద్దర్నీ నాలుగు తన్ని లోపలకి తోస్తాడేమోనన్న భయంతో మీ దగ్గరకు వచ్చామండి.’ అని చెప్పేవారు వాళ్లు. మంత్రసానితనం ఒప్పుకున్నాక.. అనే సామెత గుర్తుకు తెచ్చుకుని, సరే కానీండి అంటూ యీవిడ వినేది. నాలుగైదు సార్లు యిలాటి పంచాయితీలు యింట్లో పెట్టడంతో పేరిందేవి భర్త విసుక్కున్నాడు. కావాలంటే వేరే ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడ పెట్టుకో దుకాణం అన్నాడు. దానికే ఆఫీసని పేరు పెట్టుకుందీవిడ. రోజూ ఉదయం పది గంటలకల్లా వెళ్లి సాయంత్రం దాకా ఉంటోంది. మురారి కూడా అక్కడికే కబురు పెడుతున్నాడు.
పేరిందేవికి తగిలిన దెబ్బ కాని దెబ్బ విన్యాస్ది. అతనూ పోలీసు స్టేషన్లో పెళ్లి చేసుకోబోయాడు. సాక్షిగా వచ్చిన పేరిందేవి అమ్మాయిని చూసి ‘నిన్నెక్కడో చూశానే’ అంది. ఆ అమ్మాయి కంగారు పడింది. జరిగిందేమిటంటే తను గుజరాతీ అమ్మాయినని చెప్పుకుని, భీంగూడ పోలీసు స్టేషన్లో ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుందామె. మురారి సిఫార్సుతో పేరిందేవి ఆ స్టేషన్‌కు కూడా వెళ్లి చేయించిన పెళ్లిళ్లలో అదొకటి. ఆ తర్వాత ఆ అమ్మాయి అబ్బాయితో రెండు నెలలు కాపురం చేసి, ఓ రోజు అతనిచ్చిన నగలతో మాయమై పోయింది. ఈసారి విన్యాస్ను పట్టి, యీ స్టేషన్లో ప్రత్యక్షమైంది. పేరిందేవి అక్కడాయిక్కడా కూడా వస్తుందని ఊహించని ఆ అమ్మాయి తాను తెలుగమ్మాయినని బాగానే బుకాయించింది కానీ వధూవరుల ఫోటోలన్నీ పేరిందేవి మెదడులో ముద్రితమై పోయి ఉండడం వలన, ఆమె విన్యాస్ను హెచ్చరించింది. అతను సందిగ్ధంలో పడ్డాడు. మురారి భీంగూడ స్టేషన్‌కి మనిషిని పంపించి రికార్డులు తెప్పించాడు. ఈ లోపునే యీ అమ్మాయి కన్నుగప్పి పారిపోయింది. మీడియా వాళ్లకు పండగే పండగ. ‘కి‘లేడీ’ ఆటకట్టించి అమాయకుణ్ని కాపాడిన పేరిందేవి’ పేరుతో కథనాలు వేశారు.
ఇక విన్యాసయితే దాసోహమనేశాడు. నా బతుకు కాపాడారన్నాడు. మా అమ్మానాన్నా ఉన్నా వాళ్లకిది సాధ్యమయ్యేది కాదన్నాడు. ఇక అప్పణ్నుంచి ఎవరైనా పెళ్లికూతుర్ని కలుసుకోవడానికి కాఫీ కఫేకు వెళ్లినప్పుడల్లా యీవిణ్ని తోడుగా రమ్మనేవాడు. ఈ అమ్మాయిని యింతకు ముందెప్పుడూ చూడలేదు అని యీవిడ సర్టిఫై చేసినా, కాస్సేపుండి ఈమె హావభావాలు పరిశీలించి కిలేడీయా, ఉట్టి లేడీయా చెప్పండి అని ప్రాధేయపడేవాడు. ఇది గమనించిన అవతలి అమ్మాయిలు యిలాటి సందేహుడు మాకెందుకు అని వెళ్లిపోయేవారు. అయినా అతను పద్ధతి మార్చుకోలేదు. తనకు లభిస్తున్న ప్రాధాన్యతకు ఈవిడ పొంగిపోసాగింది కానీ విన్యాస్ తల్లి రుక్మిణికి అది కన్నెఱ్ఱ అయింది. ‘మీ నాన్నకైతే యిలాటివేవీ తెలుసుకునే బుర్ర లేదు సరే, నన్ను తీసుకెళ్లచ్చుగా, చిటికెలో చెప్పేద్దును. కన్నతల్లిని వదిలేసి దానెవత్తినో తీసుకెళ్లడమేమిటి? అవతలి వాళ్లేమనుకుంటారు? అమ్మానాన్నా లేని అనాథ అనుకోరా?’ అని ఎగిరిపడుతోంది. కానీ విన్యాస్ పేరిందేవిని పట్టుకునే వేళ్లాడుతున్నాడు. చూసిచూసి రుక్మిణికి ఒళ్లు మండి, పేరిందేవికి ఫోన్ చేసి తిట్టనారంభించింది.
వీటితో వేగుతూ వస్తున్న పేరిందేవికి యిటీవల ఉగ్రనారాయణుడు సింహస్వప్నం అయిపోయాడు. వారానికో సారి ఫోన్ చేసి సంబంధం చూశారా? ఉద్యోగం చూశారా? అని చంపసాగాడు. పేరిందేవి ఆఫీసుకి వచ్చి ఓ రోజంతా కూర్చొన్నాడు. వచ్చిన వాళ్లందరికీ తన కథ చెప్పాడు. వాళ్లలో ఓ రిపోర్టరున్నాడు. ‘తగుదునమ్మా అంటూ పెళ్లిపెద్దగా దిగబడడం కాదు, తేడాలొస్తే నిలబడాలి, బాధ్యత వహించాలి. ఆనాడు అసలు తలిదండ్రుల్ని బజార్న పడేసి వికృతానందం పొందడం కాదు, యీనాడు తల్లిలా ఆదరించాలి, తండ్రిలా అన్నం పెట్టాలి.’ అంటూ యీయన పెద్ద లెక్చరిచ్చాడు. ఆ రిపోర్టరు యిదంతా పేపర్లో వేసి, తాము చేసిన పెళ్లిళ్లకు పోలీసులు బాధ్యత తీసుకుంటారా? అంటూ మురారినీ చేర్చాడు. పేరిందేవి కారణంగా తమ పరువు పోయిందన్న కోపంతో ఉన్న తండ్రులు కొందరు రిపోర్టర్ని అడిగి ఉగ్రనారాయణుడికి ఫోన్ చేసి మద్దతిచ్చారు. సొంత పిల్లల్ని ఏమీ అనలేక, అసలు పేరిందేవే యువతీయువకులను ప్రేరేపించి, సంధానపరిచి, చెడగొడుతోందని అనసాగారు. ‘పేరు కోసం పేరిందేవి పాకులాట, పావుల్లా యువతీయువకులు’ అనే పేరుతో యూట్యూబు కథనం వచ్చి బాగా పాప్యులరైంది.
అది బాగా వైరల్ కావడంతో, దాన్ని చూసి తన స్నేహితురాళ్లు వెక్కిరించడంతో పేరిందేవికి విరక్తి కలిగింది. సాక్షిగా స్టేషన్‌కి యికపై రానని చెప్పడానికి మురారికి ఫోన్ చేసింది. ‘ఓకే మేడమ్, యిక రానక్కరలేదు. నాకు సిఐగా ప్రమోషన్ వచ్చి వేరే స్టేషన్‌కి వేశారు. మీ వల్లే నాకు బాగా గుర్తింపు వచ్చింది. థాంక్స్.’ అన్నాడతను. కానీ పీడ విరగడ కాలేదు. అతని స్థానంలో వచ్చిన కొత్త ఎస్సయి ముత్తయ్య పేరిందేవి రిటైరవ్వడానికి వీల్లేదన్నాడు. అతనొచ్చిన పది రోజులకే ఓ జంట ఫోన్ చేసి పెళ్లికి ఏర్పాట్లు చేయమంది. ముత్తయ్య పేరిందేవికి ఫోన్ చేయమన్నాడు. ఆవిడ రానంటోందని విని ఎగిరి పడ్డాడు. ‘మురారి నాకంటె జూనియరైనా పెళ్లిళ్ల పబ్లిసిటీతో పేరు తెచ్చుకుని ప్రమోషన్ కొట్టేశాడు. ఇప్పుడు నా వరకు వచ్చేసరికి ముసల్దానికి యీ నీలుగుడేమిటి? మర్యాదగా రాకపోతే రోడ్డుకడ్డంగా ముగ్గులేసింది లాటి పెట్టీ కేసేదో పెట్టి స్టేషన్‌కు రప్పించి, అప్పుడు సంతకం పెట్టిస్తానని చెప్పు.’ అని కానిస్టేబుల్‌ను తోలాడు. అతనొచ్చి పేరిందేవి కనబడటం లేదని చెప్పాడు. ఇవతల ప్రేమపక్షులు వచ్చి వాలాయి. పెళ్లి వాయిదా వేసుకోమంటే, ‘ఆలస్యమైతే అమ్మానాన్నకు తెలిసిపోతుంది. మీరింత చేతకాని వారనుకోలేదు. శుక్రవారప్పేట పోలీసు స్టేషన్‌కి యీ గతి పెట్టిందని మా గ్రూపులో హెచ్చరించుకుంటాం లెండి. ముందు మురారి గారు ఏ స్టేషన్‌కి బదిలీ అయ్యారో అది చెప్పండి చాలు.’ అన్నాడు మగపక్షి. అది కూడా అప్పటికే విచ్చేసిన టీవీ వాళ్ల ముందు! ముత్తయ్య కుతకుతలాడి పోయాడు. స్వయంగా వెళ్లి పేరిందేవికి గట్టి వార్నింగు యివ్వాలనుకున్నాడు.
రెండు రోజుల తర్వాత రుక్మిణి పేరిందేవికి ఫోన్ చేసింది. తనెవరో చెప్పి ఆఫీసుకి వచ్చి మాట్లాడతా ఉండండంది. సరే రండి అని చెప్పి పేరిందేవి విన్యాస్కి ఫోన్ చేసి సంగతేమిటని అడిగింది. సారీ ఆంటీ, పొద్దున్నే పెద్ద గొడవైంది. అమ్మ వచ్చి నా కొడుకు పెళ్లి విషయంలో నీకేం పని అని విరుచుకు పడబోతోంది అన్నాడతను. ఏం చేయాలో పాలుపోక పేరిందేవి తల పట్టుకుంది. అంతలోనే అరుంధతి ఫోన్ వచ్చింది. ‘సారీ ఆంటీ, మా నాన్న మీమీద కేసు పెడతానంటున్నాడు. మీరూ ఏదైనా మంచి లాయర్ని పెట్టుకోండి.’ అని చెప్పడానికి. ఆ అమ్మాయి ఓ పది రోజుల క్రితం పేరిందేవి ఆఫీసుకి వచ్చి అనేక క్షమాపణలు చెప్పుకుంది. ‘తప్పు చేసినది, వాణ్ని నమ్మి మోసపోయింది నేను. మధ్యలో మీ మీదకు మా నాన్న దాడి చేయడమేమిటి, నాన్సెన్స్. నన్నేమీ అనలేక మీమీద ఎగురుతున్నాడు. పోషణకు డబ్బు కూడా యిమ్మంటున్నాట్ట. ఏమీ యివ్వకండి. నేను యింకో ఉద్యోగం వెతుక్కుంటున్నాను. రెండు, మూడు యింటర్వ్యూలకు వెళ్లాను కూడా. నా బతుకు కుదుటపడుతుంది. నా మూలంగా మీకు చెడ్డపేరు రాకుండా చూస్తాను.’ అని చెప్పింది.
పేరిందేవికి ఆ అమ్మాయి వినయం, వాక్చాతుర్యం నచ్చాయి. మెచ్చుకుని పంపించేసింది. ఇప్పుడు హఠాత్తుగా ఒక ఐడియా వచ్చింది. ‘అరుంధతీ, ఒక ఉపకారం చేసి పెట్టు’ అంటూ విన్యాస్ కథంతా చెప్పి, ‘రుక్మిణి గారు వచ్చినపుడు కాస్త నువ్వు ఉండి నైస్‌గా మాట్లాడి పంపించేయ్. నా మేనకోడల్నని చెప్పు. విన్యాస్ మాట కాదనలేక పెళ్లిచూపులకి వెళుతున్నాను తప్ప, దీనిలో నా స్వార్థమేమీ లేదని అర్థమయ్యేట్లా చెప్పు. వెంటనే బయలుదేరి రా. ఆఫీసులో స్టాఫెవరూ లేరు. నువ్వు వచ్చేదాకా నేను కాచుకోవాలి.’ అంది. ఆమె సరేనంది కానీ తను వచ్చే లోపునే రుక్మిణి ఆటో దిగింది.
పేరిందేవి వెంటనే మూలనున్న చీపురు చేతిలోకి తీసుకుని, కొంగు తలపైన కప్పుకుని ముందు గది తుడవసాగింది. రుక్మిణి గదిలోకి వచ్చి ‘పేరిందేవి ఎక్కడ?’ అని అడిగింది అధార్టీగా. పేరిందేవి ఏమీ చెప్పకుండా ఆఫీసు గదివైపు చూపించింది. రుక్మిణి ఆ గదిలోకి వెళ్లగానే చీపురు పారేసి, ఆటో వైపు పరిగెట్టబోయింది. అప్పుడే వరండాలోకి వచ్చిన ముత్తయ్య ఆమెకు అడ్డు తగిలాడు. ‘పేరిందేవి గారెక్కడ?’ అని అడిగాడు. ‘లోపల గదిలో కూర్చొన్నారు.’ అని చెప్పేసి, ఆటోలో ఎక్కేసి, ‘ముందిక్కణ్నుంచి పోనీయ్’ అంది.
ముత్తయ్య లోపలకి వెళ్లి రుక్మిణిని చూసి ‘‘ఏమిటి, పోలీసు పెళ్లిళ్ల సాక్ష్యానికి రమ్మనమంటే రానంటున్నారుట?’’ అని గద్దించాడు. అంతే, రుక్మిణి తుపానులా విరుచుకు పడింది. ‘‘పోలీసు పెళ్లిళ్లా, గాడిద గుడ్డా? ఆ పెళ్లి పెటాకులైతే మీరు కూడు పెడతారా? గుడ్డ యిస్తారా? అయినా మీరు పోలీసులా? పెళ్లిళ్లు చేయించే పంతుళ్లా? మా కాలనీలో యిల్లు దోచుకుని పోయి మూణ్నెళ్లయింది. ఆ దొంగలను పట్టుకోవడం చేతకాదు కానీ, యిలాటి పన్లకు ఎగబడుతున్నారే! చేతనైతే మా అబ్బాయిని మోసం చేయబోయిన అమ్మాయిని పట్టుకోండి. మీ కళ్లెదురుగుండానే స్టేషన్లోంచి పారిపోయింది. ఈ పాటికి ఎంత మంది కుర్రాళ్లను ముంచుతోందో!’’ అంటూ పావు గంట సేపు ఎడాపెడా వాయించేసింది. ముత్తయ్యకు చెమటలు పట్టాయి. మారు మాట్లాడకుండా బతుకు జీవుడా అని పారిపోయాడు.
దానికి ఐదు నిమిషాల ముందే అరుంధతి వచ్చి వెనక నుంచి కిచెన్‌లో దూరింది. ముత్తయ్య బయటకు వెళ్లగానే గదిలోకి వెళ్లి రుక్మిణికి చల్లటి మంచినీళ్లు అందించింది. రుక్మిణి అవి తాగి అరుంధతి కేసి చూసి కళ్లెగరేసింది. ‘నేను పేరిందేవి గారి మేనకోడల్ని. మా మావయ్యకు ఆస్త్మా ఎటాక్ వచ్చిందంటే అత్తయ్య అర్జంటుగా యింటికి వచ్చింది. మీరిక్కడ వెయిట్ చేస్తున్నారని నన్నిక్కడకి పంపి, తను ఆస్పత్రికి తీసుకెళ్లింది.’ అంటూ సంజాయిషీ చెప్పుకుని సంభాషణ ప్రారంభించింది. రుక్మిణి గోడంతా వింది. ఈనాటి అమ్మాయిలను ఎవర్నీ నమ్మడానికి వీల్లేదని రుక్మిణి యిచ్చిన స్టేటుమెంటును బలపర్చింది. అత్తయ్య మొహమాటస్తురాలు కాబట్టే విన్యాస్తో వెళుతోంది కానీ లేకపోతే దీనిలో ఆవిడకు కలిసి వచ్చేదేముంది అంటూ నచ్చచెప్పింది. ముత్తయ్య మీద కరువుతీరా అరవడంతో రుక్మిణి కొంత చల్లారి ఉంది. అరుంధతి రూపురేఖలు, మాటతీరు ఆమెను బాగా ఆకట్టుకున్నాయి. నీకు పెళ్లయిందా? అని అడిగింది. లేదని చెప్పగానే ‘నీలాటి అమ్మాయిని యింట్లో పెట్టుకుని ఆ పేరిందేవి మా వాడికి ఎవరెవర్నో చూపిస్తుందేం?’ అని కోపం తెచ్చుకోబోయింది.
‘నాకు ఉద్యోగం లేదండి. ఉన్నది పోయింది. ఈ రోజుల్లో ఉద్యోగం లేని అమ్మాయిల్ని ఎవరు చేసుకుంటున్నారు చెప్పండి. నా సంబంధం చెపితే చెల్లని నాణాన్ని అంటగడుతోం దనుకుంటారని అత్తయ్య భయం.’ అని అరుంధతి వినయంగా అనగానే రుక్మిణి బోల్డు కోపం తెచ్చుకుంది. ‘డబ్బే ప్రధానమా? నీలాటి లక్షణమైన పిల్లని వదులుకోవడం బుద్ధితక్కువ కాకపోతే మరేమిటి? ఉండు మీ పెద్దవాళ్లతో మాట్లాడతాను. మీ మావయ్య ఆస్పత్రి నుంచి యింటికి రానీ..’ అని లేచి వెళ్లిపోయింది.
అరుంధతి వాక్చాతుర్యంతో మురిసిపోయినది రుక్మిణి ఒకత్తే కాదు, ఆవిడ కొడుకు విన్యాస్ కూడా. జరిగిందేమిటంటే పేరిందేవి ఆటోలో పారిపోతూండగా ఉగ్రనారాయణ వస్తున్నానంటూ ఫోన్ చేశాడు. ఆవిడ వెంటనే విన్యాస్కు ఫోన్ చేసి, ఆ కేసు సంగతి చెప్పి ‘నువ్వు మా అక్కగారి అబ్బాయినని చెప్పుకుని ఆయనతో మాట్లాడు. వాళ్లమ్మాయి చేసిన తప్పుకి నన్ను దండించడమేమిటని అడుగు.’ అని కోరింది. అతను సరేనన్నాక ‘నువ్వు మా ఆఫీసుకి వెళ్లేసరికి మీ అమ్మ ఉండవచ్చు. నువ్వు వెనకనుంచి కిచెన్‌లోకి వచ్చి దాక్కో. అరుంధతి అనే అమ్మాయి మీ అమ్మతో మాట్లాడడం అయిపోయాక, ఆమెను కిచెన్ ద్వారా బయటకు పంపేసి, నువ్వు వాళ్ల నాన్నని టేకిల్ చెయ్యి ప్లీజ్’ అంది. అతను వచ్చి కిచెన్‌లో ఉండి అరుంధతి వాళ్ల అమ్మను బుట్టలో పెట్టడం చూసి ముచ్చటపడ్డాడు. వాళ్ల అమ్మ గది బయటకు వెళ్లగానే తను లోపలికి అరుంధతికి విషయం చెప్పి కిచెన్‌లో దాక్కోమని తను సీటులో కూర్చున్నాడు.
అరగంట పోయేసరికి ఉగ్రనారాయణ పూర్తిగా కరిగిపోయి ఉన్నాడు. ‘నిజమే అనుకో. మా అమ్మాయి తన మనసులో మాట మాకు చెప్పలేక పోయిందంటే మా పెంపకం అంత సరిగ్గా లేదని ఒప్పుకోవచ్చు. కానీ పేరిందేవి గారు పెద్దావిడై ఉండి, ‘అమ్మానాన్నలకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా, రా, నేను నచ్చచెపుతాను అంటూ మా దగ్గరకు తీసుకురావాలి తప్ప, వాళ్లెలా పోయినా ఏం ఫర్వాలేదు అనడమేమిటి? తన పిల్లలకు శాస్త్రోక్తంగా పెళ్లి చేసి ఫారిన్ పంపేసింది. మాకు మాత్రం దిక్కుమాలిన గొడవలు తెచ్చిపెట్టింది. నీలాటి కుర్రాడు యింట్లో ఉన్నపుడు పోనీ మాకు సజెస్ట్ చేయవచ్చు కదా’ అని మెత్తగానే వాదిస్తున్నాడు. ‘మీ మావయ్యగారు ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాక ఆవిణ్నోసారి నాకు ఫోన్ చేయమను’ అంటూ ఆయన కదిలాక, విన్యాస్ హమ్మయ్య అనుకుని కిచెన్‌లోకి వెళ్లి చూస్తే అరుంధతి అక్కడే ఉంది. ‘మా నాన్నగార్ని యింత శాంతంగా ఎప్పుడూ చూడలేదండి. మీరు భలే హేండిల్ చేశారు.’ అని మెచ్చుకుంది. ‘మీరు మాత్రం..’ అంటూ అతనూ మెచ్చుకున్నాడు.
ఇద్దరూ కలిసి పేరిందేవికి ఫోన్ చేసి ‘ఫర్వాలేదు, వెనక్కి వచ్చేయండి’ అని చెప్పారు. ‘లేదు, లేదు. నేను రైల్వే స్టేషన్‌కి వచ్చేశాను. సామాన్లు తీసుకుని మా ఆయన్ని వచ్చేయమన్నాను. ఓ నెల్లాళ్లు మా చెల్లెలి ఊరెళ్లి తలదాచుకుంటాను. ఫోన్ ఆఫ్ చేసి పడేసి ప్రశాంతంగా ఉంటాను.’ అంది.
నెల్లాళ్లు పోయాక పేరిందేవి యింటికి తిరిగి వచ్చి, ఫోన్ ఆన్ చేసేసరికి అరుంధతి, విన్యాస్ యిద్దరూ పెట్టిన మెసేజిలు కనబడ్డాయి. ఇద్దరి మనసులూ కలిశాయట. పెద్దలు అంగీకరించారట. కళ్యాణమండపంలో పెళ్లి చేసుకోబోతున్నారట. పేరిందేవిగారు తప్పకుండా రావాలట. ముత్తయ్య కూడా మెసేజి పెట్టాడు, ఇక మీద తనను ఎప్పుడూ కాంటాక్ట్ చేయనని! పేరిందేవి, ఆమె భర్త హమ్మయ్య అనుకున్నారు. రేపే ఆఫీసు మూసేస్తానని ఆవిడ మాటిచ్చింది కూడా.
సాయంత్రమయ్యేసరికి ఒకాయన వచ్చాడు. పేరు సీతారామ్ట. ‘మీరు సమాజసేవ మానేస్తే మాబోటి వాళ్లం ఏమై పోవాలి’ అంటూ గోలుగోలు మన్నాడు. నీ బాధేమిటంటే చెప్పుకొచ్చాడు. ‘ఈ రోజుల్లో సంబంధాలు వెతకడం, పెళ్లిళ్లు చేయడం ఎంత కష్టంగా ఉందో మీకర్థం కావటం లేదు. మనం ఏ సంబంధం తెచ్చినా పిల్లలు తిరక్కొట్టేస్తున్నారు. అందువలన చూసీచూడనట్లు వదిలేస్తే వాళ్లే ప్రేమలో పడుతున్నారు. సగం పనైంది కదా, పెళ్లి చేద్దామని అనుకున్నా అది మా వల్ల కావటం లేదు. మా తాతల కాలం నాటి ఐదు రోజుల పెళ్లి క్రమేపీ చిక్కి ఒక పూట పెళ్లికి వచ్చింది. ఇటీవలి కాలంలో ప్రివెడ్డింగ్, హల్దీ, మెహందీ, సంగీత్, బాచిలర్స్ పార్టీ, నా శార్ధం అంటూ ఐదు రోజుల పెళ్లికి మళ్లీ వచ్చేసింది. పూట కూడా తగ్గేదేలే అంటున్నారు అబ్బాయిలు, అమ్మాయిలు.
అందుకని నాబోటి తండ్రులందరం ఓ ప్లాను వేశాం. ఇప్పుడు మా అమ్మాయుందనుకోండి తన ప్రేమ గురించి నాతో చెప్పగానే భగ్గుమంటాను, ఠాఠ్ వీల్లేదంటాను. నాలుగు రోజులు పోయాక నా ఫ్రెండ్ మా అమ్మాయితో ‘మీ నాన్న నీ సంగతి చెప్పాడు. వాడి మొహం, వాడికేం తెలుసు, వాణ్ని పట్టించుకోకండి. ఏ పోలీసు స్టేషన్లోనో పెళ్లి చేసేసుకోండి. తర్వాత వాడే దిగొస్తాడు.’ అంటూ ఎగదోస్తాడు. వాళ్లు తర్జనభర్జన పడి సరేననుకుని, మీరు వచ్చి సాక్షి సంతకం పెడతారా అంటే, ‘నేను వస్తే మీ నాన్న నా మీద పడి ఏడుస్తాడు. ఎన్నో ఏళ్ల స్నేహం కదమ్మా, మీరేం చేస్తారంటే ఆ పేరిందేవి గారి దగ్గరకు వెళ్లండి, ఆవిడ ఆఫీసెక్కడుందో నేను చెప్తాను.’ అంటాడు.
‘పెళ్లయిన ఏడాది తర్వాత మేం పెళ్లిని ఆమోదించి, పిల్లలను యింటికి పిలిచి పట్టుబట్టలు పెడతాం. పెళ్లి ఖర్చులు అంతటితో సరి. ఈ ట్రిక్కుతో మా స్నేహబృందంలో పన్నెండు మంది లాభపడ్డాం. మేమంతా మీ పేరు తలచుకుని దణ్ణాలు పెట్టుకుంటాం. ఇప్పుడు మీరు మానేస్తే ఎలా చెప్పండి. మా రెండో అమ్మాయిని కూడా యిలాగే ఎంకరేజ్ చేయించి సిద్ధంగా పెట్టాను. తీరా చూస్తే ముత్తయ్య మీరు రానంటున్నారని చెప్పాడు. మీరంతా డబ్బున్నవాళ్లు, మీ పిల్లలు సెటిల్ అయిపోయారు. పెద్ద మనసు చేసుకుని మా సంగతి కాస్త చూడండి.’ అని బతిమాల సాగాడు.
ఓ పావుగంట పోయేసరికి పేరిందేవి పూర్తిగా ఉబ్బిపోయింది. ‘రేపట్నుంచి ఆఫీసుకి వచ్చేస్తున్నానండి. మీ ఫ్రెండ్సందరికీ చెప్పండి. పరోపకారార్థం యీ వెధవ శరీరం అన్నారు. నా వంతు సేవ నేను చేస్తాను.’ అంది.
ఆవిడ భర్త తలపట్టుకున్నాడు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2023)