ఇలాంటి పిచ్చి పనులకే కదా ఫ్యాన్స్ విడిపోయేది..!

ఫ్యాన్స్ ఎప్పుడూ మంచిగానే ఉంటారు. సినిమా యూనిట్లు చేసే తింగరి పనుల వల్లనే వాళ్లలో ఒక్కోసారి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఓ హీరో ఫ్యాన్స్ పై మరో హీరో అభిమానగణం దుమ్మెత్తి పోస్తుంది. సోషల్…

ఫ్యాన్స్ ఎప్పుడూ మంచిగానే ఉంటారు. సినిమా యూనిట్లు చేసే తింగరి పనుల వల్లనే వాళ్లలో ఒక్కోసారి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఓ హీరో ఫ్యాన్స్ పై మరో హీరో అభిమానగణం దుమ్మెత్తి పోస్తుంది. సోషల్ మీడియాలో కామెంట్లు హద్దులు దాటుతుంటాయి. అందుకే మన హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయరు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా లేనిపోని తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సున్నితమైన, సంక్లిష్ట పరిస్థితుల మధ్య ఆర్ఆర్ఆర్ లో కలిసి నటించేందుకు ముందుకొచ్చారు రామ్ చరణ్, ఎన్టీఆర్.

మొన్నటివరకు రికార్జుల పేరిట ఈ ఇద్దరి హీరోల మధ్య వార్ ఓ రేంజ్ లో జరిగింది. ఎప్పుడైతే ఇద్దరూ కలిసి సినిమా చేయడం స్టార్ట్ చేశారో.. చరణ్-తారక్ ఫ్యాన్ గ్రూపులన్నీ కలిసిపోతాయి. ఒకట్రెండు మూర్ఖపు ఫ్యాన్ గ్రూపులు మినహాయిస్తే.. అసలైన ఫ్యాన్స్ మాత్రం సంయమనం పాటిస్తూ వచ్చారు. ఇలాంటి టైమ్ లో సినిమా యూనిట్ తో పాటు.. హీరోల పీఆర్ టీమ్స్ కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాలి. కానీ ఆఖరి నిమిషంలో వ్యవహారం బెడిసికొట్టింది.

ఆర్ఆర్ఆర్ సరికొత్త వివాదం

ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఇన్నాళ్లూ ఇద్దరూ సమానం అన్నట్టు సాగింది ప్రచారం. ఈ విషయంలో రాజమౌళిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. చరణ్ ప్రోమో రిలీజ్ చేసినప్పుడు తారక్ ను అందులో భాగస్వామిని చేశాడు. ఇక తారక్ ప్రోమో రిలీజ్ చేసినప్పుడు అందులో చరణ్ కు కూడా ప్రాతినిథ్యం కల్పించాడు. చివరికి దోస్తీ సాంగ్ లో కూడా చరణ్-తారక్ అలా కలిసి నడుచుకుంటూ వచ్చి, అందర్నీ అలరించారు.

సరిగ్గా ఇలాంటి టైమ్ లో రామ్ చరణ్ పై, కేవలం రామ్ చరణ్ ను పొగుడుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజైంది. దోస్తీ సాంగ్ లో రామ్ చరణ్ లుక్ అదిరిందట. ఆ మీసకట్టు, కళ్లలో పౌరుషం చూస్తుంటే మగధీరను మించిపోయేలా ఉందట. ఓ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు చరణ్ ను ఇలా మెచ్చుకున్నాడు. దీన్ని అక్కడితో వదిలేస్తే బాగుండేది. సదరు సినీ విశ్లేషకుడు చరణ్ ను మెచ్చుకున్నారహో అంటూ ఏకంగా ప్రెస్ నోట్ రిలీజైంది. ఇక్కడే ఎన్టీఆర్ అభిమానులకు కాలింది.

దోస్తీ సాంగ్ లో చరణ్, తారక్ ఇద్దరూ కనిపించారు. ఇద్దరికీ ఒకటే స్క్రీన్ టైమ్ ఇచ్చారు. కానీ ఆ తక్కువ స్క్రీన్ టైమ్ లోనే రామ్ చరణ్ అద్భుతంగా ఇరగదీశాడంటూ, కేవలం చరణ్ పై ప్రెస్ నోట్ రిలీజ్ చేయడాన్ని వీళ్లు తప్పుపడుతున్నారు. అంటే.. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ బాగాలేడని అర్థమా అంటూ ప్రశ్నిస్తున్నారు. హీరోలకు సొంతంగా అభిమానులుంటారు. ఎవరికి నచ్చిన హీరోను వాళ్లు పొగుడుతారు. అందులో తప్పులేదు. కానీ… ఇలా ఎవరో బాలీవుడ్ ఎనలిస్ట్ అన్నాడంటూ, ఓ మల్టీస్టారర్ సినిమాకు సంబంధించి కేవలం ఒక్క హీరోపై ఏకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

ఇంతకీ తప్పు ఎవరిది..?

సదరు ప్రెస్ నోట్ ఆర్ఆర్ఆర్ యూనిట్ కు తెలిసే రిలీజైందా..? లేక రామ్ చరణ్ వ్యక్తిగత పీఆర్ టీమ్ అత్యుత్సాహంతో దాన్ని రిలీజ్ చేసిందా? అనే విషయాన్ని పక్కనపెడితే.. కచ్చితంగా ఆ ప్రెస్ నోట్ ఎన్టీఆర్ అభిమానుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉంది. సినిమా విడుదల దగ్గర పడుతున్న ఇలాంటి టైమ్ లో  సంయమనం పాటించాల్సిన వ్యక్తులే ఇలా సొంతంగా ప్రెస్ నోట్స్ రిలీజ్ చేస్తే.. ఇప్పటివరకు ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఉన్న సహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీయడమే. 

ఎన్టీఆర్ తో పోలిస్తే రామ్ చరణ్ కు కూసింత బాలీవుడ్ అప్పీల్ ఉండొచ్చు. ఎందుకంటే, గతంలో హిందీలో ఓ సినిమా చేశాడు కాబట్టి. ఆ మాత్రం దానికే బాలీవుడ్ జనాలంతా రామ్ చరణ్ ను మాత్రమే పొగుడుతున్నారనే అర్థం వచ్చేలా ఉంది కొద్దిసేపటి కిందట విడుదలైన ఈ పత్రికా ప్రకటన.

ఇకనైనా ఇలాంటి రెచ్చగొట్టే ప్రెస్ నోట్స్ కాకుండా.. సినిమా ప్రచారానికి సమగ్రంగా పనికొచ్చే మెటీరియల్, కంటెంట్ ను వదిలితే బాగుంటుంది. లేదంటే సరిగ్గా విడుదలకు ముందు రసాభస జరగడం గ్యారెంటీ. ఇంతకీ రాజమౌళి అనుమతితోనే ఈ ప్రెస్ నోట్ రిలీజ్ అయిందా?