కొన్ని అంశాల్లో జగన్ ప్రభుత్వం తీవ్ర గందరగోళానికి గురౌతోంది. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. దాని మంచీచెడ్డ, పర్యవసానాల గురించి లోతుగా అధ్యయనం చేయాలి. కానీ జగన్ ప్రభుత్వంలో మేధోమధనం జరుగుతున్నట్టు లేదు. ఇందుకు తాజా ఉదాహరణగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం నిర్వహించ తలపెట్టిన క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్ (సీబీఏఎస్)ను రద్దు చేయడమే.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్టు గ్రామ సచివాలయ వ్యవస్థ 2019 అక్టోబరు 2న ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేయడానికి సుమారు 1.34 లక్షల మంది ఉద్యోగులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేశారు. రెండేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం నాడు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్‌కు రెండేళ్ల సర్వీసు పూర్తి అవుతుంది.
దీంతో తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని సంబరంగా ఉన్న సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్ (సీబీఏఎస్) అనే పరీక్ష పెడతామని, అందులో ఉత్తీర్ణులైన వారినే రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకుంది. నాడు చెప్పిందానికి, నేడు చేస్తున్న దానికి తేడా ఉండడంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
ఉద్యోగుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని సిలబస్‌ను తగ్గిస్తామని మొదట చెప్పారు. ఇవేవీ ఉద్యోగుల ఆందోళనను తగ్గించలేక పోయాయి. పరీక్ష పాస్ కాకపోయినా ఉద్యోగులను తొలగించేది లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పు కొ చ్చారు. అలాంటప్పుడు పరీక్ష పెట్టడం దేనికంటూ సచివాలయ ఉద్యోగులు ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం నుంచి సమాధానం రా లేదు. దీంతో ఈ వ్యవస్థ రూపకర్త , ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లంను సచివాలయ ఉద్యోగ సంఘం నాయకులు కలిసి తమ ఆందోళనను వివరించారు.
సీబీఏఎస్లో ఒక పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఆయన హామీ ఇచ్చారు. దీంతో సచివాలయ ఉద్యోగులు మరింత గందరగోళానికి గురయ్యారు. అసలు ఏ పరీక్ష రద్దు చేస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ నుంచి వెలువడిన ప్రకటనతో సచివాలయ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.
అసలు సీబీఏఎస్నే రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రొబేషన్ విషయంలో సచివాలయ ఉద్యోగులెవరూ ఎలాంటి భయాలు పెట్టుకోవద్దన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు మినహా ఎలాంటి పరీక్షలు ఉండబోవని ఆయన స్పష్టం చేయడంతో సచివాలయ ఉద్యోగులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
సీబీఏఎస్ గానీ, ఇతర ఏ అదనపు పరీక్షలు గానీ ఉద్యోగులకు నిర్వహించరని ఆయన పేర్కొనడంతో సమస్యకు పరిష్కారం లభించింది. కానీ ఇంత రాద్ధాంతం అవసరమా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అనవసర భయాందోళనకు గురి చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
క్రమబద్ధీకరణకు పరీక్ష పెట్టాలనుకోవడం, ఆ తర్వాత సిలబస్ తగ్గిస్తామనడం, అనంతరం ఒక పరీక్షే ఉంటుందనడం… మళ్లీ లేదు లేదు, అసలు పరీక్షే ఉండదని చెప్పడం ద్వారా ప్రభుత్వం తనకు తాను అయోమయంలో ఉందనే విమర్శకు ఆస్కారం ఇచ్చినట్టైందని ఉద్యోగులు చెబుతున్నారు.