ఆస్కార్ కోసం భాజాభజంత్రీలు

మొన్నే ఒక వీడియో చూసాను. తన భావాలను కుండ బద్దలు కోట్టినట్లు చెప్పే న్యాయవాది దిలీప్ సుంకర బైట్ అది. తెలుగు నాట ఓ వర్గం పావలా సమర్థత వుంటే దానికి రూపాయి డప్పు…

మొన్నే ఒక వీడియో చూసాను. తన భావాలను కుండ బద్దలు కోట్టినట్లు చెప్పే న్యాయవాది దిలీప్ సుంకర బైట్ అది. తెలుగు నాట ఓ వర్గం పావలా సమర్థత వుంటే దానికి రూపాయి డప్పు ఎలా వేస్తారు. మేధావులను ఎలా తయారు చేస్తారు..ఉద్యమ నాయకులను ఎలా తయారుచేస్తారు. వారికి కావాల్సిన వారిని ఎలా పైకి ఎత్తుతారు. వారికి నచ్చని వారిని ఎలా బదనామ్ చేస్తారు అన్నది క్లారిటీగా, క్లుప్తంగా చెప్పేసారు.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ బరిలోకి పంపడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఇదే గుర్తుకు వచ్చింది. జాతీయ స్థాయిలో మీడియాను పట్టుకుని గ్యాసిప్ కథనాలు వండి వార్పించడం, వాటి ఆధారంగా మరిన్ని వార్తలు, ఫేక్ ఐడిలతో ట్విట్టర్ లో నానా యాగీ, అమెరికా స్థాయిలో మనవాళ్ల పలుకుబడి వాడేయడం, ఇవన్నీ చూస్తుంటే ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ బరిలోకి విజ‌యవంతంగా పంపేలాగే వున్నారు.

ఇప్పటికే కంగనానో, విజ‌యేంద్ర ప్రసాద్ నో ప్రభావం చూపించారేమో, ఎన్టీఆర్ ను అమిత్ షా ను కలిపారు. తెల్లవారి లేస్తే ఎన్టీఆర్ కు ఆస్కార్…కీరవాణి పాటకు ఆస్కార్, పనిలో పని చరణ్ కు కూడా అంటూ తెగ ఊదరగోడుతున్నారు. నిజానికి వీళ్లంతా కేజిఎప్ 2 సినిమా మేకర్లను చూడాలి. ఆ సినిమా ఆర్ఆర్ఆర్ కన్నా పెద్ద హిట్. సినిమా విడుదలయింది. హిట్ అయింది. ఆ తరువాత ఏమైనా హడావుడి వుందా? కనీసం ఓ మాట వినిపించిందా? వాళ్ల పనులు వాళ్లు చేసుకుంటూ ఎంత సైలంట్ గా వున్నారు?

పబ్లిసిటీ తెచ్చుకోవడం లో రాజ‌మౌళి అండ్ కో కన్నా సమర్థులు ఎవ్వరూ వుండరేమో? తెరవెనుక పావులు కదుడపుతూ, తెరముందు హడావుడి చేస్తూ, తాము ఎలిజిబుల్ అనిపించుకుని, వ్యవహారం నడిపించుకోవాలనే ప్రయత్నం అలా చకచకా జ‌రిగిపోతోంది. అవార్డు వచ్చే అర్హత వుంటే అదేే వస్తుంది. దీని కోసం ఇంత హడావుడి చేస్తే, ఫ్యాన్స్ వార్ కు దారితీయడం తప్ప ఒరిగేదేమిటి?