“అమరావతి రాజధానికి వేలాది ఎకరాలను పైసా ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చారు. ఇదంతా చంద్రబాబు క్రెడిట్. ఒక రాజధాని కోసం వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇవ్వడం ఎక్కడైనా జరిగిందా?. వారి త్యాగం వెలకట్టలేనిది” అంటూ కమ్యూనిస్టులు మొదలు కుని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, పలు ప్రజాసంఘాల నేతలు గత వెయ్యి రోజులుగా చెబుతున్నారు. ఔనేమో అని ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు రాజధాని మినహా ప్రాంతాల జనం అమాయకంగా నమ్ముతూ వచ్చారు.
అలాంటి త్యాగయ్యలు ఏం కోరుతున్నారో తెలుసా… తమ గ్రామాలను మెగాసిటీగా చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. తుళ్లూరు మండలంలోని 19 గ్రామాలు, అలాగే మంగళగిరిలోని 3 గ్రామాలను కలిపి మొత్తం 22 పంచాయతీలను మున్సిపాల్టీగా చేయాలని ఏపీ సర్కార్ సంకల్పించింది. ఈ మేరకు అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపాల్టీకి ఒప్పుకునేది లేదని, సీఆర్‌డీఏ చట్టం ప్రకారం మెగాసిటీగా అభివృద్ధి చేయాలని త్యాగయ్యలు డిమాండ్ చేయడం విశేషం.
మున్సిపాల్టీ చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను గ్రామస్తులు తిరస్కరించారు. రాజధాని అభివృద్ధి చేస్తామంటనే భూములిచ్చామని, మెగాసిటీ కాదని ఇప్పుడు మున్సిపాలిటీ ప్రతిపాదనకు ఎలా అంగీకరిస్తామని వ్యాపార ఒప్పందాన్ని గ్రామస్తులు బయటపెట్టారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, అమరావతి పేరుతో చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందానికి తేడా ఏమీ లేదని ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు ఏమై పోయినా ఫర్వాలేదు, తమ 29 గ్రామాలు మాత్రం మెగాసిటీ అయితే, భూముల రేట్లకు రెక్కలొచ్చి తాము కోటీశ్వరులు కావచ్చనేది త్యాగయ్యల ఆత్యాశ. వారి అత్యాశను నెరవేర్చని జగన్ అంటే కోపం వుండదా మరి!