ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం రాజమౌళి-దానయ్య చేతిలోనే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. మరో నెల రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. “వాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు. సంక్రాంతి కాకపోతే సమ్మర్. అప్పటికీ కుదరకపోతే ఇంకో డేట్. అంతా వాళ్లిష్టం.” ఎవరైనా ఇలానే అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు.
అంతా అనుకుంటున్నట్టు ఆర్ఆర్ఆర్ రిలీజ్ అనేది ఇప్పుడు మేకర్స్ చేతిలో లేదు. పెన్ స్టుడియోస్ చేతిలో ఉంది. ఆర్ఆర్ఆర్ ను రాబోయే 4 నెలల్లో రిలీజ్ చేయాల్సిందేనంట. అగ్రిమెంట్ అలానే రాసుకున్నారని సమాచారం. అంతా సంతకాలు కూడా పెట్టారు. అడ్వాన్స్ పేమెంట్ కూడా చేతులుమారింది.
మరి అగ్రిమెంట్ లో చెప్పినట్టు చేయకపోతే ఏమౌతుంది? రిలీజ్ ఒక నెల రోజులు ఆలస్యమైతే ఏమౌతుంది? ఈ ప్రశ్నలకు కూడా అగ్రిమెంట్ లోనే సమాధానం ఉంది. గడువు లోగా విడుదల చేయకపోతే.. ఆ మేరకు ఆర్ఆర్ఆర్ మేకర్స్, రివర్స్ లో పెన్ స్టుడియోస్ కు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. లేకపోతే తాము ఒప్పందం చేసుకున్న మొత్తాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది.
అదే సమయంలో పెన్ స్టుడియోస్ సంస్థ కూడా, జీ గ్రూప్ కు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, పెన్ స్టుడియోస్ నుంచి పెద్ద మొత్తంలో ఆర్ఆర్ఆర్ రైట్స్ ను దక్కించుకున్న సంస్థ జీ గ్రూప్ మాత్రమే. నెట్ ఫ్లిక్స్, స్టార్ మా కూడా కొన్ని రైట్స్ దక్కించుకున్నప్పటికీ మేజర్ స్టేక్ హోల్డర్ జీ గ్రూప్. వందల కోట్ల రూపాయల లావాదేవీల్లో ఏమాత్రం ఆలస్యం జరిగినా మేకర్స్ తో పాటు అంతా కోర్టు కేసులు ఎదుర్కోవాల్సిందే.
సో.. ఆర్ఆర్ఆర్ సినిమాను రాబోయే 4 నెలల్లో రిలీజ్ చేయకపోతే నిర్మాతకు వడ్డీలు తడిసిమోపెడవ్వడమే కాకుండా.. నాన్-థియేట్రికల్ రైట్స్ మొత్తంలో కొంత పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉందన్నమాట. అంటే ఒక్క దెబ్బకు రెండు నష్టాలన్నమాట.
అటు చూస్తే ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు డేట్ దొరకడం లేదు. సంక్రాంతి బరిలో ఉన్న సినిమా యూనిట్లతో సంప్రదింపులు చేస్తున్నప్పటికీ పవన్ కల్యాణ్ బెట్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి దాటితే ఆర్ఆర్ఆర్ కు మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు.