ఈ శుక్రవారం సినిమాలు.. అతి తక్కువ రేట్లకు..!

ఈ శుక్రవారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయు వేగం, గం గం గణేశా లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం, చిన్న సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించడం…

ఈ శుక్రవారం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయు వేగం, గం గం గణేశా లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం, చిన్న సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించడం కామన్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయువేగం, గం గం గణేశా సినిమాలకు కూడా టికెట్ రేట్లు తగ్గబోతున్నాయి. అయితే ఈ సారి నిర్ణయం తీసుకున్నది ఆ సినిమా యూనిట్లు కాదు.

సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మే 31న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన మల్టీప్లెక్సుల్లో కేవలం 99 రూపాయలకే సినిమా చూసే అవకాశం కల్పిస్తోంది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (మాల్). దేశవ్యాప్తంగా దాదాపు 4వేల స్క్రీన్స్ లో ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది.

పీవీఆర్ ఐనాక్స్, సినీపొలిస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2 లాంటి ఎన్నో మల్టీప్లెక్స్ ఛెయిన్స్ లో 99 రూపాయలకే సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఆ రోజున ఏ షోకైనా కేవలం 99 రూపాయలు చెల్లించి సినిమా చూడొచ్చు. అయితే రీక్లయినర్ సీట్లకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు.

ప్రస్తుతానికి భజే వాయువేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గం గం గణేశా సినిమాలకు సంబంధించి ఈ స్క్రీన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ చేయలేదు. అవి ఓపెన్ అయిన తర్వాత ఏఏ స్క్రీన్స్ లో 99 రూపాయల టికెట్ ఉంది, అసలు హైదరాబాద్ లో ఎన్ని స్క్రీన్స్ కు ఈ సౌలభ్యం కల్పించారో ఓ క్లారిటీ వస్తుంది.