ప్రస్తుతం బాలీవుడ్ లో సమంత పేరు మారుమోగిపోతోంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న సల్మాన్ ఖాన్ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. హీరోయిన్లపై ఇలాంటి పుకార్లు సహజం. అయితే సమంతపై రావడం మాత్రం కాస్త విచిత్రం. ఎందుకుంటే, ఆమె తాత్కాలికంగా సినిమాలు ఆపేసింది మరి.
ఖుషి సినిమా తర్వాత సమంత గ్యాప్ తీసుకుంది. ఆ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఖుషి సినిమాకు ప్రచారం చేసి, ఆ వెంటనే తల్లితో కలిసి అమెరికా వెళ్లింది. మయొసైటిస్ బారిన పడిన ఆమె, అనారోగ్యం నుంచి కోలుకున్నప్పటికీ, సైడ్ ఎఫెక్టులు ఆమెను తీవ్రంగా బాధిస్తున్నాయి.
సమంత కంటిచూపు తగ్గింది. కళ్లపై లైట్ పడితే తలనొప్పి వచ్చేస్తుంది. దీనికితోడు హఠాత్తుగా నీరసం ఆవహిస్తుంది. ఇలాంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్న ఈమె, పూర్తిస్థాయిలో ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లింది.
సమంత క్లోజ్ టీమ్ నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ ట్రీట్ మెంట్ కు కొన్ని నెలల సమయం పడుతుందంట. సైడ్ ఎఫెక్టుల్లో ఒక్కో సమస్యకు, ఒక్కో రకంగా చికిత్స అందించాలంట. కాబట్టి కొన్ని నెలల పాటు సమంత అమెరికాలోనే ఉండబోతోంది. ఎన్నాళ్లకు శారీరకంగా పూర్తిస్థాయిలో కోలుకుంటుందనే విషయాన్ని ఇప్పటికిప్పుడు సమంత కూడా చెప్పలేని పరిస్థితి.
ఇలాంటి టైమ్ లో సల్మాన్ సరసన సమంత నటించనుందంటూ పుకార్లు రావడం ఆశ్చర్యకరం. కరణ్ జోహార్ నిర్మాతగా కరణ్ సినిమా లాక్ అయింది. తమిళ దర్శకుడు విష్ణువర్థన్ ఈ ప్రాజెక్టును డైరక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇందులో హీరోయిన్ గా సమంత కోసం ట్రై చేస్తున్నారట.